అయోధ్య రామాలయ నిర్మాణానికి ఎన్ని కోట్లు ఖర్చుపెట్టారో తెలుసా?
x

అయోధ్య రామాలయ నిర్మాణానికి ఎన్ని కోట్లు ఖర్చుపెట్టారో తెలుసా?

ఎన్నో ఏళ్ల పోరాటం తర్వాత అయోధ్య రామాలయం నిర్మాణం మొదలైంది. ప్రస్తుతానికి తొలి దశ పనులు పూర్తయ్యాయి. ఇప్పటి దాకా ఖర్చు పెట్టింది ఎంత. ఇంకా ఎంత అవసరం..


అయోధ్య రామాలయం అత్యంత ప్రతిష్టాత్మకం. చారిత్రాత్మకం కూడా. ఆలయ నిర్మాణానికి అయిన ఖర్చు గురించి శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కోశాధికారి గోవింద్ దేవ్ గిరి ఇలా వివరించారు.

‘‘ఆలయ నిర్మాణానికి ఇప్పటిదాకా రూ. 1,100 కోట్లకు పైగా ఖర్చు అయ్యింది. ఆలయం మొత్తం పూర్తి చేయడానికి మరో రూ. 300 కోట్లు అవసరం. ఒక అంతస్థు పూర్తయింది. మరో అంతస్తు నిర్మించాల్సి ఉంది.’’ అని చెప్పారు.

రాముడి పాత విగ్రహం గురించి మాట్లాడుతూ..

ప్రస్తుతం తాత్కాలిక మందిరంలో ఉన్న రాముడి పాత విగ్రహాన్ని జనవరి 22న ఆలయంలో ప్రతిష్టించే కొత్త విగ్రహం ముందు ఉంచుతామని గోవింద్ దేవ్ గిరి తెలిపారు. “అసలు విగ్రహం చాలా ముఖ్యమైనది. 5 నుంచి 7 అంగుళాల ఎత్తు ఉన్న విగ్రహం 25 నుంచి 30 అడుగుల దూరం నుంచి కనిపించదు. అందుకే పాత విగ్రహాన్ని కొత్త విగ్రహం ముందు ఉంచుతున్నాం’’ అని చెప్పారు.

అరుణ్ యోగిరాజ్ చెక్కిన రామ్‌లల్లా విగ్రహం ఎంపికపై మాట్లాడుతూ.. ‘‘బాలరాముడి విగ్రహ తయారీకి ముగ్గురు శిల్పులు పోటీపడ్డారు. మూడింటిలో ఒక విగ్రహాన్ని ఎంచుకోవడం మాకు చాలా కష్టమైంది. ఎందుకంటే మూడు చాలా అందంగా ఉన్నాయి. మా ప్రమాణాలకు అనుగుణంగానే విగ్రహాలు చెక్కారు. అయితే మైసూరుకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ చెక్కిన విగ్రహం "ప్రాణప్రతిష్ట"కు ఎంపికైంది. మిగతా రెండింటిని కూడా ఆలయంలో ఉంచుతాం.

మూడు విగ్రహాల్లో అత్యుత్తమమైన దాన్ని ఎంపిక చేసేందుకు ఎంత సమయం తీసుకున్నారని గిరిని ప్రశ్నించగా.. ‘‘నేను ప్రతి నెలా విగ్రహాలు చెక్కే ప్రదేశాలను సందర్శించాను. ఆ ప్రదేశాల్లోకి ప్రజలను అనుమతించరు. విగ్రహాల తయారీకి శిల్పులు 4 నుంచి 5 నెలల సమయం తీసుకున్నారు. విగ్రహాల తయారీ పూర్తయ్యాక మేం ఒక రోజు విగ్రహాలను పరిశీలించి నిర్ణయం తీసుకున్నాం.’’ అని చెప్పారు.

చారిత్రాత్మక వేడుక ..

500 ఏళ్ల తర్వాత భారతదేశంలో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. చాలా ఏళ్ల పోరాటం తర్వాత రాముడు తన అసలు స్థానంలో ఆశీనులు కాబోతున్నాడు. ఈ వేడుక మనకు దీపావళి లాంటిదే. మనం ఏటా దీపావళి జరుపుకుంటాం. కానీ ఇది చారిత్రాత్మకమైనది’’ అని అన్నారు.

ధర్మం అనేది ప్రకృతి, విశ్వాసాన్ని నియంత్రించే అంతర్లీణ చట్టాలు. మీరు సైన్స్‌ని నమ్మవచ్చు. నమ్మకపోవచ్చు. ధర్మ సూత్రాలు శాశ్వతమైనవి. వాటిని అర్థం చేసుకుని, ఆచరించే వారు ప్రయోజనం పొందుతారు. సనాతన ధర్మం గురించి చులకనగా మాట్లాడే వారు ముందు ధర్మం అంటే ఏమిటో తెలుసుకోవాలి’’ అని గిరి సూచించారు.

Read More
Next Story