దక్షిణాదిలో బీజేపీకి ఎన్ని సీట్లొస్తాయి?
x

దక్షిణాదిలో బీజేపీకి ఎన్ని సీట్లొస్తాయి?

బీజేపీ అంతర్గత సర్వేలో తేలిందేమిటి? కర్ణాటక, తమిళనాడు, కేరళలో ఎన్ని సీట్లు కైవసం చేసుకుంటుంది? ఏ రాష్ట్రంలో కషాయ పార్టీకి విజయావకాశాలు ఎక్కువ ?


కర్ణాటకలో ప్రముఖ రాజకీయ నాయకుడు బిఎస్ యడియూరప్ప (బిఎస్‌వై) నేతృత్వంలోని బిజెపి, జెడి (ఎస్) మద్దతుతో మొత్తం 28 లోక్‌సభ నియోజకవర్గాలను గెలుచుకుంటుందని పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. కాని ఆ పార్టీ ఇటీవల చేయించిన అంతర్గత సర్వేలో ఫలితాలు మరోలా ఉన్నాయి.
కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ ఇస్తున్నందున కర్ణాటకలో క్లీన్‌స్వీప్‌ చేసే అవకాశం లేదని సర్వే ఫలితాలు చెబుతున్నాయి. కేరళలో ఒక సీటు, తమిళనాడులో మూడు సీట్లను బీజేపీ గెలుచుకునే అవకాశం ఉందని సర్వే అంచనా వేసింది.
కర్ణాటకలో 2019 లోక్ సభ ఎన్నికలలో మొత్తం 28 స్థానాలకు బీజేపీ 25 స్థానాలను దక్కించుకోగా..బెంగళూరు రూరల్, హాసన్, మాండ్య నియోజకవర్గాల్లో వరుసగా కాంగ్రెస్, జెడి (ఎస్), ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపొందారు.
బీజేపీకి 15, కాంగ్రెస్‌కు 10..
సర్వే ప్రకారం కర్ణాటకలోని 28 సీట్లలో బీజేపీ 15, కాంగ్రెస్ దాదాపు 10 స్థానాల్లో విజయం సాధిస్తుందని, మూడు నియోజకవర్గాల్లో రెండు పార్టీలకు 50-50 శాతం అవకాశాలు ఉన్నాయని సర్వే అంచనా. కాగా తాము 15 సీట్లు గెలుస్తామని కాంగ్రెస్‌ ధీమాగా చెబుతోంది.
2019లో కాంగ్రెస్‌ కైవసం చేసుకున్న మూడు కీలక స్థానాలపై దృష్టి సారించాలని బీజేపీ అంతర్గత సర్వే సూచించింది. కాంగ్రెస్‌కు విజయావకాశాలున్న ఇతర నియోజకవర్గాల్లోనూ కాషాయ పార్టీ మరింత కసరత్తు చేయాలని పేర్కొంది.
కర్ణాటకలో 100 శాతం విజయం సాధించకపోవచ్చని భావించి, దక్షిణాది నుంచి సంఖ్యను బ్యాలెన్స్ చేయడానికి కేరళ, తమిళనాడులో బిజెపి ఎక్కువ సీట్లు సాధించడంపై దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది.
తమిళనాడులో 3, కేరళలో 1 సీట్లు..
తమిళనాడులోని మూడు లోక్‌సభ నియోజకవర్గాల్లోనూ, కేరళలో ఒక నియోజకవర్గాల్లోనూ ఆ పార్టీకి విజయావకాశాలు ఉన్నాయని పేరు బయటపెట్టడానికి ఇష్టపడని బీజేపీ ఆఫీస్ బేరర్ తెలిపారు. తమిళనాడులో చెన్నై సౌత్, కన్యాకుమారి, కోయంబత్తూరు నియోజకవర్గాలను కైవసం చేసుకోవచ్చు. కేరళలో తిరువనంతపురం నియోజకవర్గంలో బీజేపీ ఖాతా తెరిచే అవకాశం ఉందని పేర్కొన్నారు.
కేరళ తిరువనంతపురంలో కాంగ్రెస్‌ సిట్టింగ్‌ ఎంపీ శశిథరూర్‌పై ఆ పార్టీ కేంద్ర మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ను పోటీకి దింపింది. మూడుసార్లు ఎంపీగా ఎన్నికైన థరూర్ గట్టి పోటీ ఇస్తుండగా, 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో 30 శాతానికి పైగా ఓట్లు సాధించి బీజేపీ, వామపక్షాలను మూడో స్థానానికి పరిమితం చేసింది.
తమిళనాడులో కోయంబత్తూర్, కన్యాకుమారి, చెన్నై సౌత్‌లో వరుసగా కె అన్నామలై, పొన్ రాధాకృష్ణన్, తమిళిసై సౌందరరాజన్‌ ఎన్నికల బరిలో నిలచారు. అన్నామలై డీఎంకేకు చెందిన గణపతి రాజ్‌కుమార్‌, ఏఐఏడీఎంకేకు చెందిన సింగై రామచంద్రన్‌తో తలపడుతున్నారు. పార్టీ ఐటీ విభాగంలో పని చేయడం ద్వారా సోషల్ మీడియాలో ఏఐఏడీఎంకే ఉనికిని మెరుగుపరిచిన ఘనత సింగైకి దక్కింది. తమిళనాడు బిజెపి అధ్యక్షుడిగా, కర్ణాటక ఐపిఎస్ మాజీ అధికారి అన్నామలై తమిళనాడులో గణనీయమైన మద్దతు కూడగట్టుకున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే..ముగ్గురు అభ్యర్థులు కోయంబత్తూర్‌లోని ప్రతిష్టాత్మకమైన PSG గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్‌ల పూర్వ విద్యార్థులు. వేర్వేరు సంవత్సరాల్లో తమ విద్యను పూర్తిచేశారు.
చెన్నై సౌత్ నియోజకవర్గంలో తెలంగాణ మాజీ గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ జనరల్ అయిన తమిళిసై సౌందరరాజన్ , డీఎంకేకు చెందిన తన పాత స్నేహితుడు, సిట్టింగ్ ఎంపీ తమిజాచి తంగపాండియన్, అన్నాడీఎంకే మాజీ ఎంపీ జే జయవర్ధన్‌తో పోటీపడుతున్నారు. చెన్నై సౌత్‌లో బ్రాహ్మణ జనాభా ఎక్కవు. 2019లో వీరంతా బిజెపికి అనుకూలంగా ఓటు వేశారు. ఈ సారి కూడా అదే పార్టీకి మద్దతు ఇచ్చే అవకాశం ఉంది.
కన్యాకుమారి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి రాబర్ట్ బ్రూస్‌పై బీజేపీ సీనియర్ నేత పొన్ రాధాకృష్ణన్ పోటీ చేస్తున్నారు. క్లీన్ పొలిటీషియన్‌గా ట్రాక్ రికార్డు ఉన్న రాధాకృష్ణన్ 2014లో లాగానే ఈసారి కూడా గెలుస్తానని భావిస్తున్నారు. 2019 ఎన్నికల్లో, 2021 ఉప ఎన్నికల్లో వరుసగా కాంగ్రెస్ అభ్యర్థి హెచ్ వసంతకుమార్, అతని కుమారుడు విజయ్ వసంత్ చేతిలో ఓడిపోయారు.
అంతర్గత పోటీ..
కాగా, కర్ణాటకలో హుబ్లీ-ధార్వాడ్, నార్త్ కనరా, గుల్బర్గా, బీదర్, రాయచూర్, చిక్కబల్లాపూర్, కోలార్, మైసూరు, బీదర్, చిక్కోడి, నార్త్ కానరా, చిత్రదుర్గ స్థానాలను బీజేపీ కోల్పోయే అవకాశం ఉంది. బెళగావి, కోలార్, బెంగళూరు రూరల్‌లో అయితే 50-50 శాతం అవకాశాలున్నాయి.
రాష్ట్ర బిజెపి యూనిట్లో నాయకుల మధ్య విభేదాలు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పరాభవానికి కారణంగా కొందరు భావిస్తారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ చరిష్మా అంతంతమాత్రంగానే ఉన్నప్పటికీ, బీఎస్‌ యడియూరప్ప వర్గాలకు, బీఎస్‌వై వ్యతిరేక టీమ్‌(సీటీ రవి, బసనగౌడ పాటిల్‌ యత్నాల్‌ తదితరులు) మధ్య తీవ్ర పోటీ ఈ ఎన్నికల్లోనూ ప్రభావం చూపవచ్చు.
కాంగ్రెస్‌కు కలిసొస్తున్న అంశాలేంటి..
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హామీ పథకాలు, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఆయన డిప్యూటీ డీకే శివకుమార్‌ల పాలన పార్టీ గెలుపునకు ఉపయోగపడతాయని భావిస్తున్నారు. రాష్ట్ర యూనిట్లో అంతర్గత విభేదాలకు ఎప్పటికప్పుడు ఫుల్ స్టాప్ పెట్టడం కాంగ్రెస్‌కు కలిసొచ్చే మరో అంశం. అంతర్గత సర్వే ఫలితాలు ప్రస్తుత ట్రెండ్‌పై ఆధారపడి ఉన్నాయని పేరు బయటపెట్టడానికి ఇష్టపడని బీజేపీ మాజీ ఎంపీ ఒకరు ఫెడరల్‌తో చెప్పారు.
"ఓటింగ్ తేదీ దగ్గర పడుతున్న సమయంలో బిజెపి నాయకత్వం చాలా తెలివిగా ట్రెండ్ మార్చింది. అయితే ఆందోళనకలిగించే అంశం ఏమిటంటే.. నాయకుల మధ్య అంతర్గత గొడవలు, టిక్కెట్లు రాని రెబల్ ఎంపీలు పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తున్నారు" అని చెప్పారు. రాష్ట్రంలో ఏప్రిల్ 26 , మే 7న రెండు దశల్లో ఓటింగ్ జరుగుతుంది.
యడియూరప్పకు ప్రాధాన్యం..అయినా..
"అసెంబ్లీ ఎన్నికల సమయంలో, BSY ని పక్కన పెట్టడం సమస్యగా మారింది. ఆ అంశం బిజెపికి వ్యతిరేకంగా పనిచేసింది. ఇప్పుడు, BSY కి ప్రాధాన్యం ఇచ్చారు. కానీ BSY వ్యతిరేక అంశాలు, MP అభ్యర్థుల ఎంపికలో ఆయన 'పక్షపాత' నిర్ణయాలు పార్టీపై ప్రభావం చూపే అవకాశం ఉంది’’ అని మాజీ యడ్యూరప్ప క్యాబినెట్‌లోని మాజీ మంత్రిగా పనిచేసిన ఒకరు ఫెడరల్‌తో అన్నారు.
ఉదాహరణకు, అంతర్గత సర్వే అధ్యయనం ప్రకారం.. నార్త్ కనారా నియోజకవర్గం మంగుళూరు హిందుత్వ కంచుకోటగా పేరొంది. అయితే ఈ స్థానంలో కాంగ్రెస్ గెలుస్తుందని భావిస్తున్నారు. ఎందుకంటే బీజేపీ నుంచి టికెట్ రాని హిందుత్వ ఫైర్ బ్రాండ్ అనంత్ కుమార్ హెగ్డేకి బీసీ సామాజికవర్గం మద్దతు పలుకుతోంది.
కుల సమీకరణాలు..
‘‘కలబుర్గి, బీదర్‌, కోలార్‌ సహా పలు నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. ఈసారి కాంగ్రెస్ ముఖ్యంగా డీకే శివకుమార్ ఓటర్లను బలోపేతం చేసేందుకు కృషిచేస్తున్నట్లు మాజీ మంత్రి తెలిపారు. అనేక నియోజకవర్గాల్లో సిద్ధరామయ్య మాస్ అప్పీల్ కూడా ప్రధాన పాత్ర పోషిస్తోంది. బీజేపీ-జేడీ(ఎస్) కూటమి ముస్లిం ఓటు బ్యాంకుతో పాటు అహిందా (వెనుకబడిన తరగతులు, మైనారిటీలు, దళితులు) ఓట్లు కాంగ్రెస్‌కు పడతాయని భావిస్తున్నారు. అయితే బీజేపీ నాయకత్వం కొంత వ్యూహాత్మకంగా వ్యవహరించేందుకు ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు.
అయితే బీజేపీ కంచుకోటలైన ధార్వాడ్, నార్త్ కనరా నియోజకవర్గాలపై బీజేపీ పట్టునిలుపుకోవాలని చూస్తోంది. అనంత్ కుమార్, జేసీ మధుస్వామి, కేఎస్ ఈశ్వరప్ప సహా తిరుగుబాటుదారులను శాంతింపజేసేందుకు నాయకత్వం ప్రయత్నిస్తోంది.
50-50 చాన్స్..
ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సోదరుడు DK సురేష్ బెంగళూరు రూరల్‌లో విజయం సాధించే అవకాశం ఉందని సర్వే అంచనా వేసింది. ఇక్కడి నుంచి దేవెగౌడ అల్లుడు, ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ సిఎన్ మంజునాంత్‌ బీజేపీ తరుపున పోటీ చేస్తున్నారు. మంజునాథ్‌ గెలిచే అవకాశం 50-50 వరకు ఉందని సర్వే కనుగొంది. లింగాయత్‌లు, మరాఠీ మాట్లాడే వర్గాలు, మద్యం లాబీలు నిర్ణయాత్మక కారకాలుగా ఉన్న బెళగావి నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి జగదీష్ షెట్టర్ గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కాంగ్రెస్‌లో కొంతకాలం కొనసాగిన తరువాత, షెట్టర్ తిరిగి బిజెపిలో చేరారు. ధార్వాడ్ లేదా హవేరి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావించారు. అయితే హిందుత్వ కంచుకోటగా భావించే బెలగావిని ఆయనకు కేటాయించారు. స్థానిక బిజెపి నాయకుల నుంచి వ్యతిరేకత ఉన్నా..షెట్టర్ అక్కడ నుంచి గెలిచే అవకాశం ఉందని సర్వే పేర్కొంది.
అలాగే కోలార్‌ రిజర్వ్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ మంత్రి కెహెచ్‌ మునియప్ప అభ్యర్థిత్వంపై తలెత్తిన గొడవలు బిజెపికి అవకాశాలను పెంచాయి. వామపక్ష దళితులు ('అంటరానివారు') బిజెపికి మద్దతు ఇచ్చే నిర్ణయాత్మక అంశం కాగా, మరో వర్గం దళితులు ('స్పర్శించదగినవారు') కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నారు. కాంగ్రెస్ వామపక్ష దళితుడిని బరిలోకి దింపడంతో ఇక్కడ రెండు పార్టీలకు విజయావకాశాలు సమానంగా ఉన్నాయి.
ఇతర సవాళ్లు..
కె సుధాకర్ (చిక్కబళ్లాపూర్), పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి (ధార్వాడ్), కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజె వంటి నాయకులు తమ తమ నియోజకవర్గాల్లోని సొంత పార్టీ నాయకులు, కార్యకర్తల నుంచి సవాళ్లను ఎదుర్కొంటున్నారు.
ఈసారి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బీఎస్‌ యడియూరప్ప, ఆయన కుమారుడు విజయేంద్ర పనితీరుపై ‘అసలు’ బీజేపీ నేతలు అసంతృప్తితో ఉన్నారు. పైగా గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వొక్కలిగాలు, లింగాయత్‌ల ఓట్లతో కాంగ్రెస్ విజయం సాధించింది. రిజర్వేషన్ అంశం సహా అనేక అంశాలు బీజేపీకి వ్యతిరేకంగా పనిచేశాయి. ఈ ఏడాది కూడా అదే శాతం లింగాయత్‌లు (పంచమసాలీ ఉపవర్గం), వొక్కలిగాలు కాంగ్రెస్‌ వైపు మొగ్గు చూపితే, 2019లో వచ్చిన సీట్లను నిలబెట్టుకోవడం బీజేపీకి కష్టంగా మారవచ్చని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.
మోదీ - రామ మందిరం
మోడీ వేవ్, అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం ఈ సారి అత్యధిక స్థానాలు గెలుపొందేందుకు దోహదపడతాయని కర్ణాటక బిజెపి నాయకులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్‌ పార్టీ ఓటర్లను ఆకర్షిస్తోంది. రాష్ట్రానికి రావాల్సిన నిధులను కేంద్రం విడుదల చేయకపోవడాన్ని, కరువు నష్ట పరిహారం చెల్లించకపోవడం అంశాలను ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నారు. అయితే ఈ విషయాలు తెలుసుకున్న బీజేపీ అధినాయకత్వం ఎన్నికల వ్యూహాలకు మరింత పదును పెట్టినట్టు సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తుంది.
Read More
Next Story