ఒక్క దెబ్బకు రెండు పిట్టలు..కర్ణాటక సీఎం సిద్ధరామయ్య వ్యూహం అదేనా..
x

ఒక్క దెబ్బకు రెండు పిట్టలు..కర్ణాటక సీఎం సిద్ధరామయ్య వ్యూహం అదేనా..

లోక్‌సభ ఎన్నికల దృష్టిలో ఉంచుకుని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. దక్షిణాది రాష్ట్రాల నాయకుడిగా కూడా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నారు.


రానున్న లోక్‌సభ ఎన్నికల దృష్టిలో ఉంచుకుని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య రాజకీయ చదరంగంలో వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. దక్షిణాది రాష్ట్రాల నాయకుడిగా కూడా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నారు.

కేంద్రంపై పోరాటానికి సిద్ధం..

కేంద్రానికి వ్యతిరేకంగా ఫిబ్రవరి 7న ఢల్లీిలో జరిగిన చారిత్రాత్మక ఆందోళనకు ఆయన నాయకత్వం వహించారు. అనంతరం నిధుల కేటాయింపు, పన్నుల పంపిణీలో తమ రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని ప్రసంగించారు. తన కేబినెట్‌ మొత్తాన్ని ఢల్లీికి రప్పించి ‘‘నా పన్ను, నా హక్కు’’ నినాదంతో కేంద్రంపై పోరాటానికి సిద్ధమయ్యారు.

అదే పంథాలో కేరళ, తమిళనాడు సీఎంలు..

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ఇప్పుడు సిద్ధరామయ్య వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. తమకూ అన్యాయం జరిగిందన్న మాట తెలంగాణలో కూడా వినపడుతోంది. పరిస్థితి చూస్తుంటే..దక్షిణాది రాష్ట్రాలను ఏకం చేసేందుకు సిద్ధరామయ్య ప్లాట్‌ఫాం తయారు చేస్తున్నట్లుంది. సిద్ధరామయ్య, ఆయన ఆర్థిక సలహాదారు బసవరాజ్‌ రాయరెడ్డి ‘దక్షిణాది రాష్ట్రాల ఆర్థిక కూటమి’ ఏర్పాటుపై చర్చలు జరుపుతుండడమే ఇందుకు నిదర్శనం.

కర్ణాటకకు కేంద్ర బడ్జెట్‌లో అసమానతలను విమర్శిస్తూ.. కర్ణాటక ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (కేపీసీసీ) చీఫ్‌, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ సోదరుడు, ఎంపీ డీకే సురేష్‌ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. నిధుల కేటాయింపులో కేంద్రం వైఖరి మార్చుకోకపోతే దక్షిణాది రాష్ట్రాలు ‘ప్రత్యేక దేశం’ కోరే రోజులు కూడా వస్తాయన్నారు. సరిగ్గా ఇదే సమయంలో సిద్ధరామయ్య తెలివిగా వ్యవహరించారు. తమతో పాటు ఇతర దక్షిణాది రాష్ట్రాలు ఎదుర్కొంటున్న ఈ అన్యాయాన్ని దేశమంతా బలంగా వినిపించాలనుకున్నారు. వెంటనే ‘‘ఛలో ఢల్లీి’’ బ్యానర్‌తో ఢల్లీిలో ఆందోళనకు సిద్ధమయ్యారు. సిద్ధరామయ్యకు కేరళ, తమిళనాడు సీఎంలు కూడా మద్దతు ఇవ్వడంతో బీజేపీలో ఆందోళన మొదలైంది.

కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్‌ సలహాదారు పి త్యాగరాజ్‌ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలను నిర్లక్ష్యం చేస్తోందన్నారు. లోక్‌సభ ఎన్నికలలో బీజేపీని కట్టడి చేసేందుకు సిద్ధరామయ్య ఇలా వ్యూహం రచించారని మరో కాంగ్రెస్‌ నాయకుడు చెబుతున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయడానికి (గృహ జ్యోతి, గృహ లక్ష్మి, అన్న భాగ్య, శక్తి మరియు యువనిధి) నిధుల కొరత ఉంది. ఈ పథకాలు అమలు చేయాలంటే దాదాపు రూ. 50,000 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. ఈ పరిస్థితుల్లో కేంద్రం నుంచి తమకు రావాల్సిన నిధులు రాకపోవడాన్ని జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.

దక్షిణాదికి బలమైన నాయకుడు..

ఎన్నో ఏళ్ల కర్ణాటక రాజకీయాల తర్వాత సిద్ధరామయ్య రాష్ట్ర హక్కుల కోసం పోరాడే నాయకుడిగా ఎదిగారని నిపుణులు అంటున్నారు. గతంలో ఢల్లీిలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్నపుడు జనతా పార్టీకి చెందిన మాజీ ముఖ్యమంత్రి రామకృష్ణ హెగ్డే రాష్ట్ర హక్కుల కోసం పోరాడి దక్షిణాది రాష్ట్రాల నుంచి బలమైన ప్రతిపక్ష నాయకుడిగా ఎదిగిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు.

1980వ దశకంలో హెగ్డే తన అభిప్రాయాలను వ్యక్తీకరించడానికి అవకాశం ఇవ్వలేదని అభివృద్ధి మండలి నుంచి బయటకు వచ్చారు. ఇతర ప్రతిపక్ష నాయకులు ఆయన పంథానే అనుసరించారు. కేంద్ర-రాష్ట్ర సంబంధాలను సమీక్షించాలన్న డిమాండ్‌ తెరపైకి రావడంతో ఇద్దరు దక్షిణాది ప్రత్యర్ధులు ఏపీకి చెందిన ఎన్‌టి రామారావు, తమిళనాడుకు చెందిన ఎంజి రామచంద్రన్‌తో సమావేశాన్ని ఏర్పాటు చేసి అప్పట్లో ముఖ్యమంత్రుల మండలిని ఏర్పాటు చేశారు అని రాజకీయ విశ్లేషకుడు సి రుద్రప్ప ది ఫెడరల్‌కు తెలిపారు.

మీడియా ప్రచారం..

‘‘కేంద్ర ప్రభుత్వం పక్షపాత వైఖరి అవలంభిస్తోందని ఆరోపిస్తూ..ఢల్లీిలో తన కేబినెట్‌తో నిరసన తెలపడంతో సిద్ధరామయ్య స్టార్‌గా ఎదుగుతున్నట్లు కనిపిస్తోంది. బ్రిటీష్‌ వారికి వ్యతిరేకంగా గాంధీ చేపట్టిన అమర దండి మార్చ్‌ను గుర్తుచేసే కళాత్మక చిత్రంలో మహాత్ముడి వెనుక సిద్ధరామయ్య నడుస్తునట్టు ముద్రించిన పోస్టర్లు అన్ని ప్రముఖ దినపత్రికల్లో అచ్చయ్యాయి. ఈ వార్త జనాలను బాగా ఆకట్టుకుంది.

ఫిర్యాదుల పరిష్కారం..

జనతాపార్టీ, జనతాదళ్‌ నుంచి ఎదిగిన సిద్ధరామయ్య హెగ్డే ఆలోచనలను అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల తన ‘ఛలో ఢల్లీి’ ఉద్యమం తర్వాత సిద్ధరామయ్య విధానసౌధ ముందు ‘జన స్పందన’ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.జనం సమస్యలను వ్యక్తిగతంగా తెలుసుకున్నారు.

జన స్పందన కార్యక్రమం జనతా దర్శన్‌ తదుపరి వెర్షన్‌గా చెప్పాలి. ముఖ్యమంత్రి తన నివాసంలో ప్రజలను కలుసుకునే కార్యక్రమం. ఇప్పుడు విధాన సౌధలో రెండోసారి (మొదటి కార్యక్రమం నవంబర్‌ 2023లో జరిగింది) జన స్పందన కార్యక్రమం నిర్వహించారు.

వాస్తవానికి వారానికి ఒకసారి జనం సమస్యలను వ్యక్తిగతంగా తెలుసుకునే ఆలోచన హెగ్డే నుండి ప్రారంభమైంది. రాష్ట్రంలోని పలువురు ముఖ్యమంత్రులు ఇదే విధానాన్ని అనుసరించారు. సిద్ధరామయ్య ఇప్పుడు దానిని మరో స్థాయికి తీసుకెళ్లారు.

బీజేపీ అలా చేస్తే..కాంగ్రెస్‌ ఇలా..

లోక్‌సభ ఎన్నికలకు ముందు బీజేపీ అయోధ్య రామమందిర ఆలయ ప్రారంభోత్సవం, బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠను తెరమీదుకు వచ్చి కర్ణాటకలో హిందువుల ఓట్లను కొల్లగొట్టడం కమలనాథుల వ్యూహంగా కనిపిస్తోంది. వారికి చెక్‌ పెట్టే ఆలోచనలో ఉన్న సీఎం సిద్ధరామయ్య అవకాశం కోసం ఎదురుచూశారు. మధ్యంతర బడ్జెట్‌లో కేంద్రం మనకు తీవ్ర అన్యాయం చేసిందన్న విషయాన్ని హైలైట్‌ చేసి జనాన్ని బీజేపీకి దూరం చేయాలన్నది సిద్దరామయ్య ప్లాన్‌గా కనిపిస్తోంది.

Read More
Next Story