
తెలంగాణలో SIR ఎలా ఉంటుంది?
దేశమంతా హాట్‌టాపిక్‌గా మారిన ఈ SIR అసలు ఏంటి? దీనికి ఎందుకు, ఎలా నిర్వహిస్తారు.
తెలంగాణలో కూడా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR) మంటలు రాజేయబోతున్నది. ఇప్పటికే ఈ ప్రక్రియ ప్రారంభమైన అన్ని రాష్ట్రాల్లో కూడా నేషనల్ డిమొక్రాటిక్ అలియన్స్(NDA) యేతర పార్టీలు ఈ ప్రక్రియను తీవ్రంగా ఖండించాయి. ఇప్పుడు ఆ ప్రక్రియను తెలంగాణలో అతి త్వరలో చేపట్టనున్నట్లు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తన హైదరాబాద్ పర్యటనలో ప్రకటించారు. తెలంగాణలో ఎస్ఐఆర్‌ను విజయవంతం చేయాలని బీఎల్‌ఓలను కోరారు. ఈ ప్రక్రియ కోసం 2002లో జరిగిన ఎస్ఐఆర్ జాబితాను ఆధారంగా తీసుకుంటున్నారు. ఈ 23 సంవత్సరాల్లో చాలా మారాయి. ఎంతో మంది కొత్త ఓటర్లు వచ్చారు. చాలా మంది ఓటర్లు తుదిశ్వాస విడిచారు. మరెందరో వలసలు వెళ్లారు, అంతే చాలా మంది వలసలు వచ్చారు? ఇలాంటి వాటన్నింటి వల్ల ఓటర్ జాబితా గజిబిజిగా మారింది.
దానిని సవరించడానికి, పారదర్శకంగా మార్చడానికే ఈ ఎస్ఐఆర్. 2025 జాబితా మేరకు 40 ఏండ్లలోపు 3,38,81,253 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 40 ఏండ్లలోపువారు1,74,05,716 మంది ఉన్నారు. ఇప్పుడు 2002 లిస్ట్ ప్రకారం ఓటర్ల పేర్లు, ఓటర్ ఐడీ నెంబర్లతో పోలింగ్ స్టేషన్ ప్రకారం పోల్చి ఓటర్ల జాబితాను అప్‌డేట్ చేయనున్నారు. ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ కోసం దాదాపు 35,985 మంది బీఎల్‌ఓలు రంగంలోకి దిగనున్నారు.
930 మంది ఓటర్లకు ఒక బూత్‌లెవెల్ ఆఫీసర్(BLO)ను నియమించనున్నారు. దీని ప్రకారం రాష్ట్రంలో ఉన్న ఓటర్లందరికి కలిపి మొత్తం 35,985 మంది బీఎల్‌ఓలు ఎస్ఐఆర్ సర్వే చేపట్టనున్నారు. వీరంతా కూడా ప్రతి ఓటరు ఇంటికి మూడు సార్లు వెళ్లి ఓటరు వివరాలను నిర్ధారించుకోనున్నారు.
ఓటర్ల జాబితాలోని అవకతవకలను తొలగించడం కోసం కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం ఇది. ఇప్పటికే బీహార్‌లో ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయింది. ప్రస్తుతం తొమ్మిది రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ ప్రక్రియ కొనసాగుతోంది.
ఛత్తీస్‌గఢ్, గోవా, గుజరాత్, కేరళ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తర్‌ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్, పుదుచ్చేరిలో జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియ 2026 ఫిబ్రవరి నాటికి పూర్తి కావచ్చని అంచనా. కొన్ని నెలలుగా ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ గురించి అనేక వార్తలు, విమర్శలు, ఆరోపణలు వంటివి వింటూనే ఉన్నాం. కానీ అసలు ఈ ఎస్ఐఆర్ ఏంటి? ఎందుకు చేస్తున్నారు? ఎలా చేస్తారు? ఎవరు చేస్తారు? వంటి అనేక అంశాలు చాలా మందికి తెలియవు.
అసలు SIR ఏంటి?
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR) అనేది ఓటర్ల జాబితాల కచ్చితత్వాన్ని నిర్ధారించడానికి జాతీయ ఎన్నికల కమిషన్(ECI) అనుసరించే విస్తృత స్థాయి ఇంటింటి తనిఖీ కార్యక్రమం. తప్పులు, అవకతవకలు లేని ఓటర్ల జాబితాను సిద్ధం చేయడమే ఈ ప్రక్రియ ప్రధాన లక్ష్యం. ఓటు అర్హత కలిగిన ప్రతి పౌరుడి పేరు ఓటరు జాబితాలో నమోదు కావాలి, అర్హత లేని లేదా నకిలీ పేర్లు తొలగించబడాలి, ఇదే ఎస్ఐఆర్ టార్గెట్.
SIR ఎలా నిర్వహిస్తారు
ఎస్‌ఐఆర్‌ను ప్రత్యేక ఎన్యూమరేషన్ ఫారమ్(Enumeration Form) ద్వారా చేపడతారు. దీనిని ఎన్నికల కమిషన్ గతంలో నిర్వహించిన ఎస్‌ఐఆర్, ఆ తర్వాత జరిగిన మార్పుల ఆధారంగా రూపొందించింది. ఈ ఫారమ్‌లను బూత్ లెవెల్ ఆఫీసర్(BLO) ప్రతి ఓటరు ఇంటికి వెళ్లి అందిస్తారు. ఈ ఫారమ్ తీసుకోవాలంటే సదరు ఓటరు తన ఓటు గుర్తింపు కార్డును బీఎల్ఓకు చూపించాల్సి ఉంటుంది. అంతేకాకుండా బీఎల్‌ఓకు ఓటరు తన మొబైల్ నెంబర్ ఇవ్వాలి.
దాంతో పాటు ఎన్యూమరేషన్ ఫారమ్ అందుకున్నట్లు ధ్రువీకరిస్తూ బీఎల్‌ఓ దగ్గర ఉండే పత్రంపై సంతకం కూడా చేయాలి. ఫారమ్‌ను ఇచ్చే ముందు BLO ECI మొబైల్ యాప్ ద్వారా దాన్ని స్కాన్ చేస్తారు. స్కాన్ విజయవంతమైతే యాప్ నీలం రంగును డిస్ప్లే చేస్తుంది. దీని అర్థం, ఫారమ్ పంపిణీ అయిందని, పంపిణీ తేదీ, సమయం, పంపిణీ చేసిన ఫారమ్‌ల సంఖ్య డేటాబేస్‌లో నమోదయ్యాయని సూచిస్తుంది.
ఏడు రోజులు సమయం
ఈ ఎన్యూమరేషన్ ఫారమ్‌ను నింపడానికి ఓటర్లకు ఏడు రోజుల సమయం ఇస్తారు. ఈ ఫారమ్‌లో ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, తండ్రి/తల్లి/జీవిత భాగస్వామి పేరు (వర్తిస్తే) వంటి వివరాలు ఇవ్వాలి. పత్రాలు ఇచ్చిన ఏడు రోజుల తర్వాత బీఎల్‌ఓ మళ్లీ ప్రతి ఇంటికి వెళ్లి నింపిన EFలను సేకరిస్తారు. వీటిని తిరిగి తీసుకునే సమయంలో మొబైల్ యాప్ ద్వారా స్కాన్ చేస్తారు. స్కాన్ విజయవంతమైతే యాప్ ఆకుపచ్చ రంగులోకి మారుతుంది. అంటే ఓటరు ఆ ప్రాంతంలో నివసిస్తున్నాడు, వివరాలు ప్రధాన ఓటర్ల డేటాబేస్‌లో విజయవంతంగా చేర్చబడ్డాయని లేదా అప్‌డేట్ చేయబడ్డాయని తెలుపుతుంది. ఈ డిజిటల్ ప్రక్రియ ద్వారా నకిలీ ఓటును తొలగించడం సులభతరం అవుతుంది. తద్వారా ఎన్నికల్లో మోసాలు లేదా దొంగ ఓట్లను నివారించవచ్చు.
SIR ఎందుకు నిర్వహిస్తున్నారు?
భారతదేశం లాంటి అధిక జనాభా ఉన్న దేశాలలో విద్య, ఉద్యోగం సహా ఇతర కారణాలతో వలసలు వెళ్లడం సర్వసాధారణం. అందువల్ల ప్రతి ఎన్నికల ముందు ఓటర్ల జాబితాను సవరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ ప్రక్రియ సరైన రీతిలో జరగకపోతే ఎన్నికల్లో భారీగా అవకతవకలు జరుగుతాయి. అర్హత ఉన్నప్పటికీ ఓటర్ల జాబితాలో ఓటరు పేరు లేకపోవడం, ఒకే ఓటరుకు రెండు చోట్ల ఓటు వేసే హక్కు రావడం ఇలాంటి అనేక సమస్యలు తలెత్తుతాయి.
అంతేకాకుండా మరణించిన వారి పేర్లను సమయానికి తొలగించకపోతే అది దొంగ ఓట్లకు దారితీసే అవకాశం కూడా ఉంది. దీని వల్ల దీని వల్ల అక్రమాలు జరగడమే కాక, పోలిన ఓట్ల శాతం, కొన్ని సందర్భాల్లో ఎన్నికల ఫలితాలపై కూడా ప్రభావం పడుతుంది. గతంలో చాలా సార్లు ఇలా జరిగింది. అందుకే ఎన్నికలయిన ప్రతిసారీ ఓడిపోయిన పార్టీలు దొంగ ఓట్లు పడ్డాయని, ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తుంటారు.
ఇటీవల కాంగ్రెస్ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ కూడా లక్షల్లో ఓట్ల అవకతవకలు జరిగాయని ఆరోపించారు. అటువంటి మరోసారి రాకుండా నియంత్రించడం కోసమే ఈ ఎస్ఐఆర్‌ను నిర్వహిస్తున్నారు.
చివరిసారి ఎప్పుడు జరిగింది..
చివరిసారిగా సమగ్ర సవరణ దాదాపు రెండు దశాబ్దాల క్రితం జరిగింది. అప్పటి నుంచి ఓటు వయస్సు 21 నుంచి 18కి తగ్గింది. నగర విస్తరణ, అంతర్గత వలసలు భారీగా పెరిగాయి. ఈ మార్పులన్నీ ఓటర్ల జాబితా నవీకరణ అవసరాన్ని మరింత పెంచుతున్నాయి.
ధృవీకరణ తప్పనిసరి
ప్రతి పోలింగ్ బూత్‌లో గరిష్టంగా 1,200 మంది ఓటర్లు మాత్రమే ఉంటారు. ప్రతి బూత్ BLO ద్వారా నిర్వహించబడుతుంది. ఓటర్ల జాబితాను అప్‌డేట్‌కు 2002–2004 జాబితాలు ఆధారంగా ఉపయోగించబడతాయి. పాత జాబితాల్లో పేరు ఉన్నవారికి ధృవీకరణ సులభంగా ఉంటుంది. ముసాయిదా జాబితాతో పాటు, గైర్హాజరు, వలస వెళ్లిన, మరణించిన, నకిలీ ఓటర్ల జాబితాలను చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్(CEO) అధికారిక వెబ్‌సైట్, ప్రభుత్వ కార్యాలయాల్లో ఉంచుతారు. ఓటర్లు తమ వివరాలను తప్పక తనిఖీ చేయాలి. అభ్యంతరాలు లేదా క్లెయిమ్‌లు ఉంటే, ERO లేదా BLA వద్ద దాఖలు చేయాలి.
BLO బాధ్యతలు ఏంటి?
ప్రతి ఓటరికి ప్రత్యేక ఎన్యూమరేషన్ ఫారమ్ అందించాలి. గత సవరణలో వారి పేరు లేదా బంధువుల పేరుతో సరిపోల్చడంలో సహాయం చేయాలి. పేరు, డేట్ ఆఫ్ బర్త్, అడ్రెస్, తండ్రి/గార్డియన్ పేరు వంటి వివరాలను ధృవీకరించాలి. కొత్త ఓటర్ల కోసం ఫారం 6, ప్రకటన ఫారం సేకరించాలి. ఎన్యూమరేషన్ ఫార్ నింపడంలో సహాయం చేయాలి. అనంతరం ఆ ఫారమ్‌ను సేకరించి ఈఆర్ఓకి సమర్పించాలి. ప్రతి ఇంటికి కనీసం మూడు సార్లు వెళ్లాలి. మరణించిన లేదా శాశ్వతంగా వలస వెళ్లిన ఓటర్లను గుర్తించాలి. రాజకీయ పార్టీల బూత్ లెవల్ ఏజెంట్స్ (BLA)తో కలిసి పని చేయడం BLO బాధ్యతల్లో భాగం.
ERO బాధ్యతలు
ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్(ERO) బూత్ లెవెల్ ఆఫీసర్(BLO)తో సమన్వయం చేసుకోవాలి. ముసాయిదా ఓటర్ల జాబితా తయారు చేయాలి. క్లెయిమ్‌లు, అభ్యంతరాలను స్వీకరించి వాటిపై నిర్ణయం తీసుకోవాలి. తుది ఓటర్ల జాబితాను ప్రకటించాలి, ప్రచురించాలి. పాత SIRతో సరిపోలని ఓటర్లకు నోటీసులు ఇవ్వాలి. అవసరమైన పత్రాలను ధృవీకరించాలి. ఓటరు గతంలో ఉన్న అడ్రెస్ వంటి వివరాలను ధృవీకరించాలి. పత్రాల ధృవీకరణకు అనుగుణంగా రోజువారీగా జాబితాను నవీకరించాలి.
ఓటర్లు తెలుసుకోవాల్సినవి
ఎస్ఐఆర్ ప్రక్రియ సమయంలో ఓటర్లు ఎన్యూమరేషన్ పత్రాన్ని తప్ప మరే ఇతర పత్రాలను తీసుకోకూడదు. ధృవీకరణ కోసం కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి లేదా పెన్షనర్ గుర్తింపు కార్డు, భారత ప్రభుత్వ జారీ చేసిన ఏదైనా గుర్తింపు పత్రం, ఆధార్ (పౌరసత్వానికి ఆధారం కాదు, కానీ SIRకు ఉపయోగించవచ్చు), జనన ధృవీకరణ పత్రం, పాస్‌పోర్ట్, విద్యా ధృవీకరణ పత్రం, శాశ్వత నివాస ధృవీకరణ పత్రం, అటవీ హక్కుల ధృవీకరణ పత్రం, OBC/SC/ST లేదా ఇతర కుల ధృవీకరణ పత్రం, జాతీయ పౌరుల రిజిస్టర్ (వర్తించే చోట), ప్రభుత్వ భూ/ఇల్లు కేటాయింపు పత్రం, స్థానిక సంస్థల కుటుంబ రిజిస్టర్ వంటి వాటిలో ఏదైనా ఒకటి లేదా రెండిటిని దగ్గర ఉంచుకోవాలి.
ఆన్‌లైన్‌లో ఎన్యూమరేషన్ ఎలా?
ఎన్యూమరేషన్ ఫారమ్‌ను ఆన్‌లైన్‌లోనూ నింపవచ్చు. అందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. అందులో సేవలు(Services) విభాగంలో ఎస్ఐఆర్(Special Intensive Revision 2026)ను క్లిక్ చేయాలి. అప్పుడు మీకు ‘Fill Enumeration Form’ లేదా ‘Search Your Name in Last SIR’ వస్తుంది. అందులో ఎంపికలో EPIC నంబర్, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ లేదా ఇమెయిల్ ఐడీ ఉపయోగించి ఫారమ్‌కి యాక్సెస్ పొందాలి. ఫారమ్‌లో ముందే ముద్రించబడిన వివరాలను ఓటరు IDతో సరిపోల్చుకోవాలి. ఆ తర్వాత మిగిలిన వివరాలు నింపి, డిజిటల్ సంతకం చేసి పత్రాన్ని సబ్మిట్ చేయాలి. ఏవైనా సమస్యలు లేదా ఫిర్యాదులు ఈ వెబ్‌సైట్ ద్వారా తెలపవచ్చు.

