ఫిబ్రవరిలోపు  తెలంగాణలో ప్రారంభంకానున్న హెచ్ పీవీ టీకా కార్యక్రమం
x
HPV injection for girls

ఫిబ్రవరిలోపు తెలంగాణలో ప్రారంభంకానున్న హెచ్ పీవీ టీకా కార్యక్రమం

టీకా కార్యక్రమం మొదలుపెట్టేందుకు కేంద్రంనుండి అనుమతి రాగానే రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి ప్రారంభించేందుకు అన్నీ ఏర్పాట్లు చేసుకుంది.


మహిళల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు ఉద్దేశించిన హెచ్పీవీ టీకా(Human Papilloma Virus)ను బాలికలకు అందించాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. టీకా కార్యక్రమం మొదలుపెట్టేందుకు కేంద్రంనుండి అనుమతి రాగానే రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి ప్రారంభించేందుకు అన్నీ ఏర్పాట్లు చేసుకుంది. మహిళల్లో(Cervical Cancer) గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ సమస్య రోజురోజుకు పెరిగిపోతోంది. మహిళలకు గర్భాశయ క్యాన్సర్ నివారించాలంటే బాలికలుగా ఉన్నపుడే దీనికి సంబంధించిన హ్యూమన్ పాపిలోమా వైరస్ అనే (Gardasil) టీకా(ఇంజెక్షన్) ఇవ్వాలని ఈమధ్యనే ప్రపంచ ఆరోగ్య సంస్ధ ప్రపంచదేశాలకు సూచించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే దేశవ్యాప్తంగా 14,15 ఏళ్ళ బాలికలకు ఈ టీకాను అందించాలని కేంద్రప్రభుత్వం రెడీ అవుతోంది.

హెచ్పీవీ టీకాను బాలికలకు ఇస్తే 4 రకాల గర్భాశయ క్యాన్సర్లను నిరోధించవచ్చని ఇప్పటికే పరిశోధనల్లో తేలింది. బహిరంగ మార్కెట్లో సుమారు రు. 4 వేలకు దొరుకుతున్న గార్డాసిల్ టీకాను బాలికలకు ఉచితంగా ఇవ్వాలని కేంద్రం డిసైడ్ చేసింది. ఇపుడు కేంద్రప్రభుత్వం అమలుచేస్తున్న సార్వజనీన టీకాల కార్యక్రమంలో భాగంగా కాకుండా ప్రత్యేకంగా గార్డాసిల్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ను చేపట్టాలని నిర్ణయించింది. ఒక డోసు వ్యాక్సిన్ అందించటం వల్ల బాలికలకు సంబందిత వైరస్ ల నుండి దీర్ఘకాల రక్షణ లభిస్తుందని అనేక పరిశోధనల్లో తేలింది. 15 ఏళ్ళలోపు బాలికలకోసం ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న గార్డాసిల్-4 టీకాను రెండుడోసుల్లో తీసుకోవాల్సుంటుంది.

క్యాన్సర్ కారకాలైన హెచ్పీవీ టైప్ 16, 18తో పాటు టైప్ 6, 11 రకాల నుండి ఈ టీకా రక్షణిస్తుంది. తెలంగాణకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే సుమారు 5 లక్షల డోసుల గార్డాసిల్ ను రెడీగా ఉంచుకుంది. వీటిని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు ఇతర ప్రజారోగ్య కేంద్రాలు, ఆసుపత్రుల్లో ఉచితంగా ఇవ్వబోతోంది. ఈ టీకాలను బాలికలందరికీ ఇవ్వటానికి వీలుగా 1200 మెడికల్ ఆఫీసర్లు, 2600 ఎంఎల్పీలు, 1850 మంది సూపర్ వైజర్లు, 7 వేల ఏన్ఎంలతో పాటు అదనంగా 2 వేల మంది మెడికల్ సిబ్బందికి అవసరమైన శిక్షణ ఇప్పించింది.

కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి అనుప్రియా పటేల్ పార్లమెంటు సమావేశాల్లో మాట్లాడుతు సర్వైకల్ క్యాన్సర్ కు సంబంధించిన తెలంగాణ వివరాలను వెల్లడించారు. మంత్రి చెప్పిన ప్రకారం 2021లో 3,129 మంది సర్వైకల్ క్యాన్సర్ సోకితే 1711 మంది చనిపోయారు. 2022లో 3,185మందికి క్యాన్సర్ సోకితే 1,720 మంది మృతిచెందారు. 2023లో 3,201 మంది సర్వైకల్ క్యాన్సర్ రోగుల్లో 1,729 మంది మృత్యువాతపడ్డారు. 2024లో 3,217 మంది సర్వైకల్ క్యాన్సర్ రోగుల్లో 1,746 మంది చనిపోయారు.

పై గణంకాలను గమనించిన తర్వాత మహిళల్లో సర్వైకల్ క్యాన్సర్ ఎంతమంది ప్రాణాలను తీస్తోందో అర్ధమవుతోంది. అందుకనే గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్ సోకకుండా బాలికలకు తగిన రక్షణ ఇవ్వాలని ప్రపంచ ఆరోగ్య సంస్ధ సూచనల మేరకు కేంద్ర, తెలంగాణ ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకున్నాయి. టీకా కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వటమే ఆలస్యం తెలంగాణ ప్రభుత్వం బాలికలకు గార్డాసిల్ టీకాలను ఇవ్వటానికి రంగం సిద్దంచేసుకున్నది.

Read More
Next Story