పోలింగ్ కేంద్రాల వద్ద భారీగా ఓటర్లు..
x
తమిళనాడు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సత్యబ్రత సాహూ

పోలింగ్ కేంద్రాల వద్ద భారీగా ఓటర్లు..

తమిళనాడులో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. కొన్ని గ్రామాల్లో స్థానిక సమస్యల వల్ల గ్రామస్థులు పోలింగ్‌ను బహిష్కరించారు.


తమిళనాడులోని చాలా పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల సందడి కనిపించింది. ఓటర్లు భారీగా తరలిరావడం ఇదే మొదటిసారి అని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (CEO) సత్యబ్రత సాహూ తెలిపారు.

తమిళనాడులో మొత్తం 39 లోక్‌సభ నియోజకవర్గాలకు శుక్రవారం పోలింగ్ జరిగింది. ఉదయం మందకొడిగా ప్రారంభమైన పోలింగ్ తర్వాత క్రమంగా పుంజుకుంది.అధికారిక సమాచారం ప్రకారం మధ్యాహ్నం 1 గంటకు పోలింగ్ 40.05 శాతంగా నమోదైంది.

ఓటింగ్ సజావుగా జరిగేందుకు అన్నిచర్యలు తీసుకున్నామని సాహూ ది ఫెడరల్‌కి తెలిపారు. తమిళనాడులో 181 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు అమర్చామని, పోలీసు బలగాలను ఉంచామని చెప్పారు.

ఓటింగ్ సజావుగా జరిగిందని అయితే కొన్నిపోలింగ్ కేంద్రాల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (EVM)లో సాంకేతిక లోపాలు తలెత్తాయని చెప్పారు.

ఓటింగ్‌ను బహిష్కరించిన గ్రామాలు..

తమిళనాడులోని కొన్ని గ్రామాల్లో ప్రజలు ఓటింగ్‌ను బహిష్కరించారు. ఉదయం 9:30 గంటలకు కాంచీపురం జిల్లాలోని ఏకనాపురం గ్రామ పోలింగ్ కేంద్రంలో కేవలం తొమ్మిది ఓట్లే పోలయ్యాయి. గ్రీన్‌ఫీల్డ్ పరందూర్ విమానాశ్రయానికి వ్యతిరేకంగా 600 రోజులుగా నిరసన చేస్తున్న నివాసితులు పోలింగ్‌ను బహిష్కరించారు. ఓటు హక్కు వినియోగించుకోవాలని కొందరు ప్రభుత్వ అధికారులు ఏకనాపురం ప్రజలను కోరారు.

" ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్న మేం ఎవరినీ ఓటు వేయమని బలవంతం చేయం. ప్రభుత్వ అధికారులు ఓటు వేయమని ప్రజలను అభ్యర్థించారు. కానీ అలా చేయమని వారిని మేం బలవంతం చేయలేదు." అని సాహూ పేర్కొన్నారు.

పుదుకోట్టై జిల్లా వెంగవాయల్ గ్రామస్థులు ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయించారు. డిసెంబర్ 2022లో గ్రామంలోని షెడ్యూల్డ్ కులాల ఇళ్లకు నీటిని సరఫరా చేసే ఓవర్‌హెడ్ ట్యాంక్‌లో మానవ మలం కనిపించింది. దీనిపై విచారణ జరుగుతున్నా.. ఇంకా ఎవరిని అరెస్టు చేయలేదు. ఇందుకు నిరసనగా గ్రామంలో ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు.

ఎన్నూర్ క్రీక్ వద్ద అమ్మోనియా గ్యాస్ లీక్ ఘటనపై దాదాపు 1,000 మంది ఎన్నూర్ ఓటర్లు ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు తొలుత ప్రకటించారు. అయితే తర్వాత తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకుని ఓటు వేయాలని నిర్ణయించుకున్నారు.

ఇద్దరి మృతి..

సేలం, కళ్లకురిచ్చి నియోజకవర్గాల్లో ఒక్కో పోలింగ్‌ కేంద్రంలో ఓటరు మృతి చెందారు. వీరిని సేలంలోని తమ్మంపట్టిలో ఆర్ చిన్నపొన్ను (77), సూరమంగళానికి చెందిన ఎన్ పళనిస్వామి (69)గా గుర్తించారు. ఈ ఘటనపై జిల్లా ఎన్నికల అధికారుల నుంచి నివేదిక కోరినట్లు సాహు తెలిపారు.

"ఎండ వేడిమి బారిన పడకుండా ఓటర్ల కోసం అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద టెంట్లు ఏర్పాటు చేశామని, తాగునీరు అందుబాటులో ఉంచామని తెలిపారు.

Read More
Next Story