చిరుత హత్య మిస్టరీ ఛేదించిన ‘హంటర్’ జాగిలం
x
తెలంగాణలో చిరుతపులి కళేబరం

చిరుత హత్య మిస్టరీ ఛేదించిన ‘హంటర్’ జాగిలం

తెలంగాణలో తగ్గుతున్న చిరుతలు : వరుస ఘటనలు


తెలంగాణ అడవిలో జరిగిన చిరుతపులి హత్య మిస్టరీని ఫారెస్ట్ జాగిలం ‘హంటర్’ ఛేదించింది. కవ్వాల అభయారణ్యంలో నీళ్లు తాగేందుకు వచ్చిన చిరుతను ఉచ్చు వేసి చంపిన వేటగాళ్లను, వాసన ఆధారంగా ట్రాక్ చేసి పట్టించింది. గోళ్ల కోసం క్రూరంగా వేటాడిన ఈ ఘటనలో ముగ్గురు నిందితులను అటవీశాఖ అధికారులు అరెస్ట్ చేయగా, హంటర్ జాగిలం కీలక పాత్ర పోషించడం సంచలనంగా మారింది.


కవ్వాల అభయారణ్యంలో చిరుతపులిని చంపిన వేటగాళ్లను ఫారెస్ట్ జాగిలం ‘హంటర్’ పట్టించింది. మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండలం ఊట్ల గ్రామ అటవీ ప్రాంతంలో నీళ్లు తాగేందుకు చెరువు వద్దకు వచ్చిన చిరుతపులిని కొందరు వేటగాళ్లు రెండు చెట్ల మధ్య ఉచ్చు ఏర్పాటు చేసి పట్టుకొని దాన్ని చంపారు. చిరుతపులి గోళ్లను తీసుకొని దాన్ని కాల్చారు. మిస్టరీగా మారిన చిరుతపులి వేటను హంటర్ అనే ఫారెస్ట్ జాగిలం గుట్టు రట్టు చేసింది. చిరుతపులి మరణించిన సంఘటన స్థలానికి ఫారెస్ట్ డాగ్ తీసుకువెళ్లగా అక్కడ వాసన చూసి దాన్ని దహనం చేసిన స్థలానికి తీసుకువెళ్లింది. అక్కడ చిరుతపులి వెన్నెముక వాసన చూసిన జాగిలం నేరుగా ఊట్ల గ్రామంలో వేటగాళ్ల ఇంటికి వెళ్లింది. వేటగాళ్ల ఇంట్లో చిరుత గోళ్లను కట్ చేసేందుకు ఉపయోగించిన కత్తి, గొడ్డలిని జాగిలం పట్టుకుంది. దీంతో ఫారెస్ట్ అధికారులు వేటగాళ్లను అరెస్ట్ చేశారు.

బయ్యర్లుగా ఫారెస్ట్ అధికారులు వేషం కట్టి...

కవ్వాల అభయారణ్యంలో చిరుతపులిని చంపి వాటి గోళ్లను ఒక్కోటి పదివేల రూపాయలకు విక్రయించేందుకు ముగ్గురు వేటగాళ్లు యత్నించారు. ఈ విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు చిరుత గోళ్లు కొనుగోలు చేస్తామంటూ బయ్యర్లుగా వేషం కట్టి వేటగాళ్లను సంప్రదించారు. దీంతో వేటగాళ్లను అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటన అటవీ శాఖ వర్గాల్లో కలకలం రేపింది. గత కొన్ని రోజులుగా అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న చిరుత కనిపించకపోవడంతో అప్రమత్తమైన అటవీ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో తాళ్లపేట రేంజ్ పరిధిలో చిరుత కళేబరాన్ని గుర్తించారు.


తెలంగాణలో ఈ వేసవికాలంలో అడవిలో నీరు దొరక్క చిరుతపులులు, ఇతర వన్యప్రాణులు అటవీగ్రామాల్లోకి వస్తున్నాయి. దీంతో వాటిని వేటగాళ్లు చంపుతున్నారు. ఇటీవల తెలంగాణలో పలు సంఘటనలు జరిగాయి.రాష్ట్రంలో జరిగిన చిరుతల వేట ఘటనలను వరుసగా సాగుతున్నా అటవీశాఖ అధికారులు వన్యప్రాణులను కాపాడేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని వన్యప్రాణుల ప్రేమికులు ఆరోపించారు. ఒకవైపు నీళ్ల కోసం వన్యప్రాణులు అడవిలో నుంచి అటవీ గ్రామాల్లోకి వస్తుండగా ఇదే అదునుగా తీసుకొని వేటగాళ్లు వాటిని చంపుతున్నారు.మరో వైపు చిరుతపులులు అటవీ గ్రామాల్లోకి వస్తుండటంతో ప్రజలు ప్రాణభయంతో తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు. మంచిర్యాల అటవీ అధికారులు దండేపల్లి మండలం ఊట్ల గ్రామంలో చిరుతపులిని వేటాడే రాకెట్‌ను కనుగొన్నారు. చిరుతపులి గోళ్లను సేకరించి వాటిని విక్రయించేందుకు యత్నించిన ముగ్గురు వ్యక్తులను ఫారెస్టు అధికారులు అరెస్టు చేశారు.

కామారెడ్డి జిల్లాలో చిరుత కళేబరం లభ్యం

కామారెడ్డి జిల్లా బాన్స్ వాడ మండలం హన్మాజీపేట గ్రామం వద్ద ఉన్న అడవుల్లో తాజాగా చిరుతపులి కళేబరాన్ని అటవీశాఖ అధికారులు గుర్తించారు. గుర్తుతెలియని వేటగాళ్లు వారం రోజుల క్రితం చిరుతపులిని చంపారని కామారెడ్డి అటవీశాఖ అధికారిణి బి నిఖిత, బాన్స్ వాడ ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ పి సునీత, అటవీశాఖ అధికారులు చెప్పారు. సంఘటన స్థలాన్ని ఫారెస్ట్ అధికారులు సందర్శించి సంఘటన స్థలంలో రెండు చిరుత పులి కాళ్లను కనుగొన్నారు. హన్మాజీపేటలో చిరుతపులిని చంపిన ఘటనపై అటవీశాఖ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ముగ్గురు వేటగాళ్లు చిరుతను చంపారని గుర్తించి దర్యాప్తు చేస్తున్నారు.

చిరుతల వరుస మరణాలు

తెలంగాణ రాష్ట్రంలో చిరుత పులుల సంఖ్య తగ్గుతోంది. ఇటీవల తరచూ చిరుతలు మృత్యువాత పడుతున్నాయి. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో 121 చిరుతలు కనిపించగా, మొత్తం 173 చిరుతలు రక్షిత అడవుల వెలుపలి ప్రాంతాల్లో సంచరిస్తున్నాయని తెలంగాణ వైల్డ్ లైఫ్ అధికారులు అంచనా వేశారు. 2018 వ సంవత్సరంలో 334 చిరుతలు ఉండగా 2022 నాటికి 297కి పడిపోయింది. తెలంగాణలో గత నాలుగేళ్లుగా చిరుతపులికి గడ్డుకాలం నడుస్తుంది. చిరుతలు అడవుల మధ్యలోని రోడ్లను దాటుతుండగా హిట్-అండ్-రన్ ప్రమాదాల్లో మరణిస్తున్నాయని అటవీశాఖకు చెందిన వైల్డ్ లైఫ్ ఓఎస్ డీ ఎ శంకరన్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ఇటీవల కామారెడ్డి, రంగారెడ్డి,నారాయణపేట జిల్లాలో చిరుతలు రోడ్డు దాటుతూ వాహనాలు ఢీకొనడంతో మృత్యువాత పడ్డాయి.
నిజామాబాద్ జిల్లాలో గత ఏడాది సెప్టెంబరు నెలలో మూడేళ్ల వయసున్న చిరుతపులి రోడ్డు ప్రమాదంలో మరణించింది.
- జక్రాన్ పల్లి మండలం సకింద్రాపూర్ వద్ద చిరుతపులి జాతీయ రహదారి 44 దాటుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొంది.ఫారెస్ట్ అధికారులు చిరుత కళేబరానికి పోస్టుమార్టం చేయించారు.జాతీయ రహదారిపై రోడ్డు దాటుతూ ఇటీవల జింక కూడా మృత్యువాత పడింది.
-గత ఏడాది నవంబరు నెలలో సిద్ధిపేట జిల్లా దౌలతాబాద్ మండలం గొడుగుపల్లి గ్రామ శివార్లలో చిరుతపులి కళేబరాన్ని ఫారెస్ట్ అధికారులు గుర్తించి దర్యాప్తు చేశారు.చిరుత మృతిని గుర్తించేందుకు వెటర్నరీ వైద్యులు పోస్టుమార్టం చేశారు. చిరుత నిమోనియా వ్యాధితో మరణించిందని వైద్యులు చెప్పారు.
- నాగర్ కర్నూలు జిల్లాలోని కొల్లాపూర్ మండలం అమరగిరి ప్రాంతంలో పదేళ్ల వయసున్న చిరుత మరణించింది. చిరుతకు విషహారం పెట్టడం వల్ల మరణించిందని పశువుల డాక్టర్లు చెప్పారు.

అటవీ అధికారులకు సమాచారం అందడంతో వెంటనే డాగ్ స్క్వాడ్ సహా ప్రత్యేక బృందం రంగంలోకి దిగింది. ఆధారాలు సేకరించి విచారణను వేగవంతం చేశారు. ఈ దర్యాప్తులో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్న అధికారులు వారి వద్ద నుంచి మొత్తం 13 చిరుతపులి గోళ్లను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో నిందితులు నేరాన్ని అంగీకరించినట్లు జన్నారం అటవీ డివిజనల్ అధికారి ఎం. రామ్మోహన్ తెలిపారు.
చిరుతలపై వరుసగా జరుగుతున్న వేటలు, ప్రమాదాలు అటవీ సంరక్షణపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఒకవైపు నీటి కొరతతో వన్యప్రాణులు అడవులను వదిలి గ్రామాల వైపు వస్తుండగా, మరోవైపు వేటగాళ్ల దాడులు వాటి ప్రాణాలకు ముప్పుగా మారుతున్నాయి. హంటర్ జాగిలం సహాయంతో ఈ ఘటనలో నిందితులు పట్టుబడ్డా, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అటవీశాఖ కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వన్యప్రాణి ప్రేమికులు కోరుతున్నారు.


Read More
Next Story