
కాలుష్య కాసారంగా మారిన హుసేన్ సాగర్
కాలుష్యకాసారంగా హుసేన్ సాగర్: సందర్శకులు ముక్కుమూసుకోవాల్సిందే!
మూడు వారాల్లో పసుపురంగులోకి మారిన జలాలు
హైదరాబాద్ హుసేన్ సాగర్ సరస్సు ఈ వేసవికాలం తొలి దశలోనే ఎన్నడూ లేని విధంగా పసుపు పచ్చగా మారి తీవ్ర దుర్గంధంతో నిండింది.హైదరాబాద్ మహానగరానికి మణిహారంగా ఉన్న హుసేన్ సాగర్ తీరంలోని లుంబినీ పార్కు, ఎన్టీఆర్ గార్డెన్, పీవీ ఘాట్, తెలంగాణ సచివాలయంతోపాటు ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్డు వైపు వెళుతుంటే ముక్కుపుటాలదిరే తీవ్ర దుర్గంధం వస్తోంది. జర జాగ్రత్త.పర్యాటకుల కోసం సాగర్ చుట్టూ సౌకర్యాలు కల్పించినా దీని నుంచి వెలువడుతున్న దుర్గంధం పర్యాటకులను చికాకు పెడుతుంది.
రంగు మారిన సాగర్ నీరు
నగర నడిబొడ్డున ఉన్న హుసేన్ సాగర్ జలాశయం కాలుష్య కాసారంగా మారింది. హుసేన్ సాగర్ చుట్టూ ఉన్న ట్యాంక్ బండ్ తో నెక్లెస్ రోడ్డు,సంజీవయ్య పార్కు, జలవిహార్, బుద్ధ విగ్రహాన్ని పర్యాటకులు చూసేందుకు వీలుగా అభివృద్ధి చేశారు. కానీ ఈ జలాశయంలో నీరు పసుపు పచ్చగా మారడంతోపాటు తీవ్ర దుర్గంధం వెలువడుతుండటంతో సందర్శకులు హుసేన్ సాగర్ ను చూసేందుకు వెనుకంజ వేస్తున్నారు. తెలంగాణ సచివాలయం, లుంబినీ పార్కు,ఎన్టీఆర్ మార్గ్, బుద్ధభవన్, ట్యాంక్ బండ్, హోటల్ మారియట్ ల వద్ద హుసేన్ సాగర్ నీరు గత మూడు వారాలుగా పసుపుపచ్చగా మారిందని బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు అథారిటీ అధికారులే అంగీకరిస్తున్నారు. చలికాలం ముగిసి వేసవి కాలం ఆరంభం అయిన నేపథ్యంలో హుసేన్ సాగర్ నీరు రంగుమారుతుందని చెబుతున్నారు.హుసేన్ సాగర్ జలాశయంలోకి పారిశ్రామిక వ్యర్థాలు, మురుగునీరు, కెమికల్ వాటర్ కలుస్తుండటంతో ఈ నీరు కలుషితం అవుతున్నాయని పర్యావరణ వేత్త డాక్టర్ లుబ్నా చెప్పారు.
పెరిగిన కాలుష్యం
హుసేన్ సాగర్ జలాశయంలో కలుషిత వ్యర్థాలు 450 ఎంఎల్ డీలు కలుస్తున్నాయని వెల్లడైంది. ఖైరతాబాద్, సంజీవయ్య పార్కు వద్ద కాలుష్యం ఎక్కువగా ఉందని తేలింది. బుద్ధ విగ్రహం, నెక్లెస్ రోడ్డు, ఎన్టీఆర్ గార్డెన్, హుసేన్ సాగర్ సెయిలింగ్ క్లబ్ వద్ద తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి నీటి శాంపిళ్లను సేకరించి పరీక్షించగా అధికంగా కాలుష్యం ఉందని వెలుగుచూసింది.వాతావరణ పరిస్థితులల్లో మార్పులే నీటి రంగు మార్పుకు కారణమని బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు అధికారిణి శ్రీవాణి చెప్పారు. వేసవి కాలం ప్రారంభంలోఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగేకొద్దీ నీరు పసుపు రంగులోకి, కొన్నిసార్లు ఆకుపచ్చగా ,అప్పుడప్పుడు నల్లగా మారుతుందని ఆమె తెలిపారు. దీని వల్ల నెక్లెస్ రోడ్, ఎన్టీఆర్ మార్గ్, సెక్రటేరియట్, ట్యాంక్ బండ్,బుద్ధ భవన్ వరకు ప్రయాణించే సందర్శకులకు దుర్వాసనతో అసౌకర్యం కలుగుతుంది.
నిమజ్జనం వల్ల నీటి కాలుష్యం
హుసేన్ సాగర్ లో పీఓపీ వినాయక విగ్రహాల నిమజ్జనం వల్ల నీటి కాలుష్యం పెరుగుతోంది.ఈ నీటిలో క్రోమియం అధికంగా ఉందని తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి నీటి శాంపిల్ పరీక్షల్లో వెల్లడైంది. గత ఏడాది వినాయక నిమజ్జనాల తర్వాత జలాశయంలో నుంచి 20,000 టన్నుల వ్యర్థాలను తొలగించారు. హుస్సేన్ సాగర్ సరస్సులో నుంచి 4,360 వినాయక విగ్రహాల అవశేషాలను తొలగించారు.రోడ్ల నుంచి సుమారు 20,000 టన్నుల వ్యర్థాలను తొలగించారు.
కోట్లాదిరూపాయలు వెచ్చిస్తున్నా తగ్గని కాలుష్యం
సాగర్ కాలుష్యాన్ని తగ్గించేందుకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ అథారిటీ కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నా ఈ దుర్వాసన మాత్రం పోవడం లేదు. కాలుష్య కాసారంగా మారిన హుసేన్ సాగర్ ప్రక్షాళన చేయడానికి 1998వ సంవత్సరం నుంచి ప్రతీ ఏటా కోట్లాది రూపాయలను హైదరాబాద్ మెట్రోపాలిటన్ అథారిటీ, బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు విభాగం అధికారులు వెచ్చిస్తున్నా, ఇప్పటికీ ఈ నీటిని శుభ్రం చేయలేక పోయారు.పారిశ్రామిక రసాయన వ్యర్థాలు వచ్చి సాగర్ లో కలుస్తుండటంతో ఈ ప్రాంతానికి వస్తే చాలు తీవ్ర దుర్గంధంతో ముక్కుమూసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. వర్షాకాలం, చలికాలం పోయి వేసవికాలం వస్తున్నపుడల్లా సాగర్ జలాశయంలోని నీరు రంగు మారడంతోపాటు తీవ్ర దుర్వాసన వస్తోంది.360 కోట్ల రూపాయల జపాన్ దేశ ఆర్థిక సహాయంతో హుసేన్ సాగర్ క్యాచ్ మెంట్ ఇంప్రూవ్ మెంట్ పనులు చేసినా కలుషిత నీరు వచ్చి సరస్సులో కలుస్తూనే ఉంది.
సాగర్ ప్రక్షాళన ఏది ?
ఇబ్రహీం కులీకుతుబ్ షా పాలనలో హుసేన్ షా వలీ 1562వ సంవత్సరంలో హుసేన్ సాగర్ చెరువును తవ్వించారు. 24 చదరపు కిలోమీటర్ల ఈ సరస్సులోకి రంగారెడ్డి జి్లలా జనవాడ గ్రామం నుంచి బుల్కాపూర్ నాలా, ఉస్మాన్ సాగర్ పరివాహక ప్రాంతం, సూరారం, కూకట్ పల్లి ల మీదుగా నీరు వచ్చి చేరుతుంది. హుసేన్ సాగర్ కాలుష్యంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో ప్రజా ప్రయోజన వ్యాజ్యం పై దాఖలైనా ఈ సమస్య పరిష్కారం కాలేదు. సాగర్ ను ప్రక్షాళన చేయడానికి 31 మురుగునీటి శుద్ధి ప్లాంట్లను నిర్మించడంతోపాటు మురుగునీటిని మళ్లించేందుకు డైవర్షన్ పైపులైన్లు వేయాలని నిర్ణయించినా సాగర్ కాలుష్యానికి తెర పడటం లేదు.
నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసు వేస్తా : డాక్టర్ లుబ్నా సార్వత్
అత్యంత పురాతనమైన హుసేన్ సాగర్ సరస్సు కాలుష్య కాసారంగా మారి నగరం నడి బొడ్డున తీవ్ర దుర్గంధం వెలువడుతున్న నేపథ్యంలో తాను దీనిపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసు వేస్తానని పర్యావరణ ఉద్యమ నాయకురాలు డాక్టర్ లుబ్నా సార్వత్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. పరిశ్రమల నుంచి వెలువడుతున్న వ్యర్థాలను ఎంప్లూయంట్ ప్లాంట్లలో సరిగా శుద్ధి చేయకుండా కలుషిత జలాలను సాగర్ లోకి వదులుతున్నారని ఆమె చెప్పారు. మరో వైపు సీజవరేజి ట్రీట్ మెంట్ ప్లాంట్లలోనూ మురుగునీటిని సరిగా శుద్ధి చేయక పోవడం వల్ల సాగర్ లో నీరు రంగు మారడంతోపాటు దుర్గంధం వెలువడుతుందని ఆమె పేర్కొన్నారు. వినాయక విగ్రహాల నిమజ్జనం వల్ల కలుషిత వ్యర్థాలు జలాశయంలో కలిశాయని చెప్పారు. ఆక్రమణల వల్ల సరస్సు విస్తీర్ణం తగ్గి కాలుష్యం పెరిగిందని చెప్పారు.
‘‘సాగర్ కాలుష్యాన్ని నివారించేందుకు కమిటీని నియమించాలని గతంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేసినా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కమిటీని ఏర్పాటు చేయలేదు’’అని డాక్టర్ లుబ్నా సార్వత్ ఆరోపించారు.
దుర్గంధాన్ని తగ్గించేందుకు చర్యలు : శ్రీవాణి
వేసవికాలం ఆరంభం వల్ల ఎండవేడిమికి నీరు ఆవిరి అయి పోవడం, జలాశయంలో నీరు తగ్గడం వల్ల నీటి కింద పేరుకుపోయిన వ్యర్థాల నుంచి దుర్గంధం వెలువడుతుందని హెచ్ఎండీఏ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీవాణి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. సాగర్ జలాశయం నుంచి దుర్గంధాన్ని తగ్గించేందుకు సీవరేజి ట్రీట్ మెంట్ ప్లాంట్లలో నీటిని మరింత మెరుగ్గా శుద్ధి చేయాలని తాము ఆదేశాలు ఇచ్చామని ఆమె తెలిపారు. పారిశ్రామిక వ్యర్థాలు, చెత్త, చెదారం నీటి కింద పేరుకు పోవడం వల్ల దుర్గంధం వెలువడుతుందని, దీన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటామని హెచ్ఎండీఏ బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు ఏడీ శ్రీవాణి చెప్పారు.
దుర్గంధం నివారణకు కెమికల్ స్ప్రేయింగ్ చేస్తున్నాం : హెచ్ఎండీఏ డిప్యూటీ ఇంజినీర్ గణేష్
వేసవికాలం ఆరంభం వల్ల హుసేన్ సాగర్ జలాశయంలో నీరు రంగు మారి దుర్గంధం వెలువడుతున్న నేపథ్యంలో తాము ఎఫెక్టివ్ మైక్రోబ్ సొల్యుషన్ కెమికల్ ను చల్లుతున్నామని హెచ్ఎండీఏ బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు డిప్యూటీ ఇంజినీర్ గణేష్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
‘‘హుసేన్ సాగర్ జలాశయం చుట్టూ ప్రతీ రోజూ ట్యాంకర్ల ద్వారా కెమికల్ స్ప్రేయింగ్ చేస్తూ హుసేన్ సాగర్ నుంచి వెలువడుతున్న దుర్గంధాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నాం’’అని హెచ్ఎండీఏ బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు డిప్యూటీ ఇంజినీర్ గణేష్ చెప్పారు.
ఒకప్పుడు నగరానికి అద్భుతమైన పర్యాటక ఆకర్షణగా నిలిచిన హుసేన్ సాగర్ దుర్గంధం వల్ల పర్యావరణ సమస్యలకు దారితీస్తుంది. రంగుమారిన నీరు, దుర్గంధం ప్రజల జీవన ప్రమాణాలపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది.
Next Story

