
హైదరాబాద్ పోటీ ప్రపంచ టాప్ అగ్ర క్లస్టర్లతోనే: రేవంత్
బయోఏషియా వేదికగా సీఎం రేవంత్ రెడ్డి విజన్. పెట్టుబడులు, గ్లోబల్ కెపబిలిటీ సెంటర్లు, జీవవిజ్ఞాన రంగంలో తెలంగాణ లక్ష్యాలు.
‘మా పోటీ కేవలం భారత్‌తోనే కాదు. ప్రపంచంలోని అగ్రగామి క్లస్టర్లతో’ అని సీఎం రేవంత్ రెడ్డి మరోసారి వ్యాఖ్యానించారు. తెలంగాణను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే తన లక్ష్యమని పునరుద్ఘాటించారు. బయోఏషియా సదస్సు వేదికగా హైదరాబాద్ గ్లోబల్ లక్ష్యాలను ప్రకటించారు. హైదరాబాద్‌కు స్వాగతం తెలుపుతూ ఆయన ప్రసంగాన్ని ప్రారంభించారు. 23 ఏళ్ల క్రితం బయోఏషియా ప్రారంభమైనప్పుడు నగరానికి చార్మినార్, బిర్యానీ, ఔషధ తయారీ, సాఫ్ట్‌వేర్ నగరంగా గుర్తింపు ఉండేదన్నారు. ఇప్పుడు ప్రపంచ వ్యాక్సిన్ తయారీ కేంద్రంగా నిలిచిందని తెలిపారు.
మంగళవారం హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన బయోఏషియా 2026 సదస్సుకు సీఎం హాజరయ్యారు. హైదరాబాద్‌కు స్వాగతం తెలుపుతూ ప్రసంగాన్ని ప్రారంభించారు. 23 ఏళ్ల క్రితం బయోఏషియా ప్రారంభమైనప్పుడు నగరానికి చార్మినార్, బిర్యానీ, ఔషధ తయారీ, సాఫ్ట్‌వేర్ గుర్తింపు ఉండేదన్నారు. ఇప్పుడు ప్రపంచ వ్యాక్సిన్ తయారీ కేంద్రంగా ఎదిగిందని వివరించారు. దూరదృష్టి నాయకత్వం, స్పష్టమైన విధానాలు, నైపుణ్య మానవ వనరులు, ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు కలిసి హైదరాబాద్‌ను గ్లోబల్ కెపబిలిటీ సెంటర్లకు కేంద్రంగా తీర్చిదిద్దాయని చెప్పారు. పరిశోధన, డిజైన్ రంగాల్లో విశిష్ట స్థానం సాధించిందన్నారు.
గత రెండు సంవత్సరాల్లో జీవవిజ్ఞాన రంగంలో రూ.73,000 కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చినట్లు వెల్లడించారు. దావోస్‌లో కొత్త లైఫ్ సైన్సెస్ పాలసీని ప్రకటించామని గుర్తుచేశారు. జీనోమ్ వ్యాలీ విస్తరణ చేపట్టామని తెలిపారు. వన్-బయో ప్రారంభించి, గ్రీన్ ఫార్మా సిటీ ప్రాజెక్టును వేగవంతం చేశామని చెప్పారు. అనేక గ్లోబల్ కెపబిలిటీ సెంటర్లను ఆహ్వానించామని వివరించారు. ఇది సాధారణ అభివృద్ధి కాదని, స్పష్టమైన దృష్టి ఫలితమని పేర్కొన్నారు. బయోఏషియా ఇప్పుడు బయో-వరల్డ్‌గా మారుతోందని వ్యాఖ్యానించారు. ఈ సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా 500 ప్రముఖ సంస్థలకు చెందిన 4,000 మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారని తెలిపారు. ఫార్మా, బయోసైన్సెస్, బయోటెక్, బల్క్ డ్రగ్స్, వ్యాక్సిన్లు, ఆరోగ్య రంగాల ప్రముఖులు పాల్గొన్నారని చెప్పారు.
సైన్స్, AI, బయోటెక్ కలయికతో విశేష ఫలితాలు సాధ్యమని వివరించారు. హైదరాబాద్‌లో జరిగే బయోఏషియా సదస్సు దావోస్‌లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరం తరహా గుర్తింపు పొందుతుందనే నమ్మకం ఉందన్నారు. “తెలంగాణ రైజింగ్ 2047” విజన్‌లో భాగంగా 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. పరిశోధన సంస్థలు, కార్పొరేట్లు, స్టార్టప్‌లు, చిన్న మధ్య తరహా సంస్థలు, ప్రభుత్వం మధ్య బలమైన భాగస్వామ్యం అవసరమని సూచించారు.
బల్క్ డ్రగ్స్ నుంచి బయాలజిక్స్ వరకు, తయారీ నుంచి ఆవిష్కరణ వరకు తెలంగాణ ముందుకు సాగుతోందని చెప్పారు. పెట్టుబడులు పెట్టాలని, GCCలను స్థాపించాలని, ఆవిష్కరణ కేంద్రాలు నిర్మించాలని ఆహ్వానించారు. కలిసి పనిచేస్తే హైదరాబాద్ ప్రపంచ వ్యాక్సిన్ రాజధాని స్థాయి నుంచి ప్రపంచ జీవవిజ్ఞాన రాజధానిగా ఎదుగుతుందని సీఎం ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ఈ దిశగా ముందుకు సాగుతోందని తెలిపారు.

