
దొరికితే ‘ఫ్యాట్’ తీసేస్తారు
మనంతినే ఆహారంమీదే మన ఆరోగ్యం ఆధారపడుందన్న విషయం అందరికీ తెలిసిందే
ప్రజలను బాగా ఇబ్బందిపెడుతున్న విషయాల్లో ఆహారకల్తీ ప్రధానమైనది. దీన్ని నిరోధించేందుకు హైదరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ ప్రత్యేకంగా బృందాలను ఏర్పాటుచేశారు. మనంతినే ఆహారంమీదే మన ఆరోగ్యం ఆధారపడుందన్న విషయం అందరికీ తెలిసిందే. అలాంటి ఆహారంలో కూడా కల్తీ పెరిగిపోతోంది. కొనే నూనెలు, ఉప్పులు, పప్పులు, కారం, పసుపు, మసాలాలు, నెయ్యి, అల్లంవెల్లుల్లి, పేస్టులు, సబ్బులు ఇలా ఒకటేమిటి ఏది కొనాలన్నా భయంగానే ఉంటోంది. ఏది నకిలీయో ఏది ఒరిజినలో తెలుసుకోవటం కష్టమవుతోంది. అసలుకన్నా నకిలీ వస్తువులే కంటికి ఇంపుగా, బ్రాండెడ్ వస్తువులుగా కనబడుతుంటాయి మార్కెట్లో. ఒరిజినల్-నకిలీ మధ్య తేడా తెలుసుకోవటం అంత తేలికకాదు కాబట్టి చాలామంది దొరికింది, కంటికి ఇంపుగా కనిపించినవాటిని ఒరిజినల్ అనుకుని కొనేస్తున్నారు. కొంతకాలం వాడిన తర్వాత అనారోగ్యాల పాలై డాక్టర్ల చుట్టూ తిరగాల్సొస్తోంది.
మార్కెట్లో నకిలీలు పెరిగిపోతున్న విషయం గమనించిన ప్రభుత్వశాఖలు కొన్నిసార్లు దాడులు చేస్తున్నాయి. విజిలెన్స్, మార్కెటింగ్ శాఖ, పోలీసులు, తూనికలు, కొలతల శాఖ, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ అధికారులు బృందాలుగా ఏర్పడి దాడులు చేస్తున్నా, కేసులు నమోదుచేసి అరెస్టులు చేస్తున్నా పెద్దగా ఉపయోగాలు కనబడటంలేదు. అందుకనే కల్తీ వస్తువులను శాశ్వతంగా నియంత్రించటానికి హైదరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ ప్రత్యేకంగా పైన చెప్పిన శాఖల అధికారులతో బృందాలను ఏర్పాటుచేశారు.
ఒకపుడు గ్రామాలకు మాత్రమే పరిమితమైన కల్తీసరుకులు ఇపుడు నగరంలోకూడా విచ్చలవిడిగా దొరుకుతున్నాయి. నగరంలోని నాలుగు కమిషనరేట్ల పరిధిలోని శివారు ప్రాంతాలు కల్తీ సరుకుల తయారీకి అడ్డాగా మారినట్లు ఇప్పటికే చాలాసార్లు బయటపడ్డాయి. హైదరాబాద్, మల్కాజ్ గిరి, సైబరాబాద్, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ల పరిరిధిలో ఎక్కువగా కల్తీ వస్తువులు తయారవుతున్నాయని పోలీసుల దగ్గర సమాచారం ఉంది. అందుకనే హైదరాబాద్ పరిధిలోని పహడీషరీఫ్, జల్ పల్లి, శ్రీరామ్ నగర్ కాలనీ, మీర్ పేట్, నాదరగుల్, బడంగ్ పేట్, ఆదిబట్ల, రాజేంద్రనగర్, పెద్ద అంబర్ పేట్, మేడిపల్లి, కీసర, మేడ్చల్, ఘట్ కేసర్ ప్రాంతాలతో పాటు సైబరాబాద్ పరిధిలోని బాలానగర్, జీడిమెట్ల, మైలార్ దేవ్ పల్లి, పటాన్ చెరు, ఫ్యూచర్ సిటీ పరిధిలోని ఇబ్రహీంపట్నం, కందుకూరు, మహేశ్వరం తదితర ప్రాంతాలను పోలీసులు కల్తీ సరుకుల తయారీ కేంద్రాలుగా మ్యాపింగ్ చేశారు.
కల్తీ సరుకులు తయారీ కేంద్రాల్లో నకిలీలు తయారుచేయాలంటే భయపడేలా యాంటీ ఫ్యాట్ టీం బృందాలను ఏర్పాటుచేసి ప్రత్యేక కార్యాచరణను సజ్జనార్ రెడీచేశారు. ప్రతి బృందానికి డీసీపీ నేతృత్వం వహిస్తారు. శివారు ప్రాంతాల్లోని అన్నీ పోలీసుస్టేషన్ల పరిధిలోని పైన చెప్పిన ఏరియాల్లోని అడ్డాలపైన 24 గంటలు నిఘా పెట్టారు. పాత డేటా ఆధారంగా నకిలీలు తయారుచేసే వ్యాపారులపై పోలీసులు ఉక్కుపాదం మోపబోతున్నారు.
సమాజానికి పెద్ద సమస్య : సజ్జనార్
ఇదే విషయాన్ని సజ్జనార్ మాట్లాడుతు ఆహార కల్తీ సమాజానికి పెద్ద ముప్పుగా తయారైందని ఆందోళన వ్యక్తంచేశారు. నగరంలో ఆహార కల్తీకి పూర్తిస్ధాయిలో అడ్డుకట్ట వేసేందుకు కార్యాచరణ మొదలుపెట్టినట్లు తెలిపారు.

