హైదరాబాద్ ఫ్రండ్స్ బోన్సాయ్ సొసైటీ 40 ఏళ్ల విజయోత్సవం
x
ఆకట్టుకుంటున్న బోన్సాయ్ చెట్టు

హైదరాబాద్ ఫ్రండ్స్ బోన్సాయ్ సొసైటీ 40 ఏళ్ల విజయోత్సవం

రంగురంగుల బోన్సాయ్ ప్రదర్శనతో మహిళా సభ్యుల ప్రయాణం


ఇదో అందమైన కథ ..నిజంగా హైదరాబాదు వంటి పెద్ద నగరంలో ఒక చిన్న బోన్సాయ్ ప్రియుల సముదాయం 40 ఏళ్ల పుడమిపై స్థిరంగా పెరిగి, అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది. 1983లో కేవలం ఎనిమిది మందితో ప్రారంభమై, ఎన్నో సవాళ్లను అధిగమించి వందకు పైగా సభ్యులను చేరుకున్న హైదరాబాద్ ఫ్రండ్స్ బోన్సాయ్ సొసైటీ ఇప్పుడు ప్రతి సంవత్సరం తన ప్రత్యేక బోన్సాయ్ సింఫనీ ప్రదర్శనతో నగరాన్ని ఆకర్షిస్తూ, ప్రకృతి ప్రేమికుల మనసులను దోచుకుంటోంది.

హైదరాబాద్
నగరంలో ఫ్రండ్స్ బోన్సాయ్ సొసైటీ 1983వ సంవత్సరంలో పదిమంది ఔత్సాహిక బోన్సాయ్ ప్రియులతో ఏర్పాటైంది. ఎక్కువ మంది మహిళా సభ్యులతో కూడిన బోన్సాయ్ సొసైటీ ప్రతీ ఏటా బోన్సాయ్ చెట్ల ప్రదర్శనను ఏర్పాటు చేస్తోంది. ఐఎఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్, ఆర్మీ అధికారుల భార్యలతోపాటు వ్యాపారవేత్తలు ఈ సొసైటీలో సభ్యులుగా ఉన్నారు.8 మందితో ప్రారంభమైన హైదరాబాద్ ఫ్రండ్స్ బోన్సాయ్ సొసైటీ సభ్యుల సంఖ్య వందమందికి పైగా చేరింది.

బోన్సాయ్ సింఫనీ 40 ఏళ్ల వేడుక

హైదరాబాద్ ఫ్రండ్స్ బోన్సాయ్ సొసైటీ ఆవిర్భవించి 40 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా బంజారాహిల్స్ లోని కళింగ కల్చరల్ సెంటరులో ఈ నెల 20 వతేదీ నుంచి మూడు రోజుల పాటు బోన్సాయ్ సింఫనీ 2026 పేరిట నిర్వహిస్తున్నారు. ఈ నేచర్ గార్డెన్ మినియేచర్ ప్రదర్శనను సోషల్ చీఫ్ సెక్రటరీ సీవీ ఆనంద్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యానవన శాఖ డైరెక్టర్ షేక్ యాస్మిన్ భాషా ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ ప్రదర్శనలో అంతర్జాతీయ బోన్సాయ్ మాస్టర్లు, దేశంలోని వివిధ నగరాలకు చెందిన బోన్సాయ్ సొసైటీల ప్రతినిధులు పాల్గొన్నారు.

నగరంలో వెలసిన బోన్సాయ్ గార్డెన్లు

బోన్సాయ్ చెట్ల పెంపకంపై జాతీయ, అంతర్జాతీయ నిపుణులను పిలిపించి బోన్సాయ్ పెంపకంలో నూతన పద్ధతులపై సభ్యులకు శిక్షణ ఇప్పిస్తున్నామని బోన్సాయ్ సొసైటీ అధ్యక్షురాలు ఊట్ల శ్రీదేవి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. సౌత్ ఏషియా బోన్సాయ్ ఫెడరేషన్, ఇండో జపనీస్ అసోసియేషన్ సభ్యుల సౌజన్యంతో సభ్యులకు బోన్సాయ్ పెంపకంలో మెళకువలను నేర్పించామని ఆమె తెలిపారు.హైదరాబాద్ నగరంలోని రాజ్ భవన్ గార్డెన్, ఎన్టీఆర్ గార్డెన్ లలోనూ బోన్సాయ్ చెట్లు పెంచుతున్నామని ఆమె వివరించారు. రామోజీ ఫిలింసిటీలో కిష్కింధ మూలిక బోన్సాయ్ గార్డెన్ ను ఏర్పాటు చేశారు. బోన్సాయ్ చెట్ల పెంపకంలో హైదరాబాద్ సభ్యులకు పలు అవార్డులు లభించాయి.

సందర్శకులను ఆకట్టుకున్నబోన్సాయ్ సింఫనీ ప్రదర్శన

చిన్నచిన్న కుండీలు...రంగురంగుల చిట్టి పొట్టి బోన్సాయ్ చెట్లు...వివిధ రంగుల పూలతో విలసిల్లిన బోన్సాయ్ చెట్ల ప్రదర్శన సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. బంజారాహిల్స్ సమీపంలోని కళింగ కల్చరల్ సెంటరులో ఏర్పాటైన ఈ ప్రదర్శనను తిలకించడానికి పెద్ద సంఖ్యలో బోన్సాయ్ ప్రియులు, మహిళలు తరలివచ్చారు. హైదరాబాద్ నగరంలో బిగ్ బోన్సాయ్ నర్సరీ కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ నర్సరీలో వివిధ రకాల ప్లాంట్లు ఉన్నాయి.ఇలా 40 ఏళ్ల ప్రయాణంలో హైదరాబాద్ ఫ్రండ్స్ బోన్సాయ్ సొసైటీ నగరంలో బోన్సాయ్ సంస్కృతిని విస్తరించడంలో కీలక పాత్ర పోషిస్తోంది.

శుక్రవారం బోన్సాయ్ సింఫనీ 2026 ద్వారా హైదరాబాద్ ఫ్రండ్స్ బోన్సాయ్ సొసైటీ వారి 40 సంవత్సరాల ప్రయాణాన్ని ఒక సుందర ఘట్టంగా నిలిపింది. నగర ప్రజలకు మినియేచర్ ప్రకృతి అందాన్ని చేరువగా చేసే ఈ కార్యక్రమం, నగరంలోని ప్రకృతి ప్రేమికుల హృదయాలలో బోన్సాయ్ కళపై మెరుగు, కొత్త శిక్షణ అవకాశాల పురోగతి, అంతర్జాతీయ మైత్రి ప్రభావాలను సృష్టించింది.

Read More
Next Story