అక్కడ యుద్దం ముదిరితే, ఇక్కడ కట్టెల పొయ్యిలే దిక్కా? (వీడియో)
x
Cooking with Firewood in Hyderabad

అక్కడ యుద్దం ముదిరితే, ఇక్కడ కట్టెల పొయ్యిలే దిక్కా? (వీడియో)

గ్యాస్ పొయ్యిమీద చేసే వంటలతో పోల్చుకుంటే కట్టెలు, బొగ్గుల పొయ్యిల మీదచేసే వంటల రుచులు భలేగుంటాయి


హైదరాబాద్ లోని చాలా హోటళ్ళు తిరిగి కట్టెలు, బొగ్గుల పొయ్యిల దగ్గరకే వెళుతున్నాయి. గ్యాస్ పొయ్యిమీద చేసే వంటలతో పోల్చుకుంటే కట్టెలు, బొగ్గుల పొయ్యిల మీదచేసే వంటల రుచులే భలేగుంటాయి. కాని మారుతున్న జీవనశైలి కారణంగా దాదాపు జనాలందరు కట్టెలు, బొగ్గుల పొయ్యిల నుండి గ్యాస్ స్టౌ, ఎలక్ట్రిక్ కుక్కర్లు, ఇండక్షన్ కుక్కర్లకు దశాబ్దాల క్రితమే మారిపోయారు. అలాంటిది ఇపుడు సడెన్ గా మళ్ళీ కట్టెల పొయ్యిలు, బొగ్గులపొయ్యిలంటే వినటానికే విచిత్రంగా ఉంది. దీనికంతటికి కారణం గల్ఫ్ యుద్ధమే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అక్కడెక్కడో యుద్ధం జరుగుతుంటే ఇక్కడ మనకు కష్టాలు మొదలవ్వటం విచిత్రం కాకమరేమిటి ?

మనదేశంలో గ్యాస్, పెట్రోల్, డీజల్ రోజువారి వాడకంలో ఎక్కువభాగం గల్ఫ్ దేశాల నుండే దిగుమతి అవుతున్నది. పదకొండురోజులుగా జరుగుతున్న ఇరాన్-ఇజ్రాయెల్+అమెరికా వార్ కారణంగా గ్యాస్ వెలికితీత, ఆయిల్ ఉత్పత్తి ఆగిపోయింది. ఇంకా గట్టిగా చెప్పాలంటే ఇరాన్ దెబ్బకు కువైట్, ఖతార్, సౌదీఅరేబియా, దుబాయ్, ఒమన్, బహ్రెయిన్ లాంటి దేశాల్లో ఆయిల్ ఉత్పత్తిని ఇరాన్ దారుణంగా దెబ్బతీసింది. అలాగే హర్మోజ్ జలసంధి మీదుగా యూరోపు, ఆసియా ముఖ్యంగా ఇండియాకు రావాల్సిన షిప్పులు ఎక్కడివి అక్కడే రెండువారాల నుండి నిలిచిపోయాయి. ఫలితంగా మనదేశంలో గ్యాస్, ఆయిల్ సరఫరా తగ్గిపోయింది. దాంతో ప్రస్తుతానికి గ్యాస్ కొరత వచ్చేసింది.

వెంటనే అప్రమత్తమైన కేంద్రప్రభుత్వం అందుతున్న గ్యాస్ ను ముందు జనాలకు అందించాలన్న ఉద్దేశ్యంతో డొమెస్టిక్ యూసేజ్ కు ప్రయారిటి ఇచ్చింది. దాంతో వాణిజ్యావసరాలకు గ్యాస్ కొరత వచ్చేసింది. దాని ప్రభావమే ఇపుడు హోటళ్ళు, రెస్టారెంట్లు, రిసార్టుల మీద తీవ్రంగా కనబడుతోంది. అందుకనే ఉన్న అరాకొరా గ్యాస్ తో వంటలుచేయటం కష్టంకాబట్టి బిజినెస్ ను దేనికదే తగ్గించేసుకుంటోంది. అందుకనే చాలా హోటళ్ళు, రెస్టారెంట్లలో మెనులో ఐటమ్స్ చాలా తగ్గిపోయాయి. వడ, డోసె, పూరీ లాంటి నూనెలు ఎక్కువగా ఉపయోగించుకునే ఐటమ్స్ ను మెనులో నుండి తీసేశారు. నూనెలు ఎక్కువగా వాడితేకాని వడలు, దోసేలు, పూరీలు తినటానికి రుచిగా ఉండవు. నూనెలు ఎక్కువగా వాడాలంటే అందుకు గ్యాస్ కూడా ఎక్కువగానే అవసరమవుతుంది.

అందుకనే చాలా హోటళ్ళు, రెస్టారెంట్లలో ఇపుడు ఆవిరి మీద ఉడికే ఇడ్లీలు, కుడుములనే ఎక్కువ తయారుచేస్తున్నారు. ఇడ్లీలు, కుడుములను గ్యాస్ మీదే కాకుండా పెద్ద ఎలక్ట్రిక్ కుక్కర్ల మీద కూడా చేయచ్చు. నాలుగురోజులు పోతే ఎలక్ట్రిక్ కుక్కర్ల మీదకూడా చేయటం కష్టమవుతుందేమో. మొత్తంమీద గ్యాస్ కొరత కారణంగా నగరంలోని వేలాది హోటళ్ళు, రెస్టారెంట్లు, పేయింగ్ గెస్ట్ హాస్టళ్ళు, హాస్టళ్ళు, మెస్సుల్లో వంటలకు ఇబ్బందులు పడుతున్నది అయితే వాస్తవం.

ఎక్కువసేపు వండే వంటలను తగ్గించేసి అన్నం, పప్పు, సాంబారు, రసం, పచ్చళ్ళనే మెనులో పెడుతున్నారు. కొన్ని పీజీ హాస్టళ్ళల్లో అయితే ఉత్త మ్యాగీలను ఉడకపెట్టి పిల్లలకు వడ్డిస్తున్నారు. హైదరాబాద్ లోని ఎస్సార్ నగర్, అమీర్ పేట, గచ్చిబౌలి, కేపీహెచ్బీ, అశోక్ నగర్, చిక్కడపల్లి, గాంధీనగర్, హైటెక్ సిటి, కొండాపూర్, దిల్ సుఖ్ నగర్ లాంటి ప్రాంతాల్లో వందలాది పీజీ హాస్టళ్ళున్నాయి. రోడ్డుపక్కన ఇడ్లీలు, దోసెలు, పూరీలమ్ముకున్న తోపుడుబండ్ల వాళ్ళు కూడా ఒన్లీ ఇడ్లీలను మాత్రమే అమ్ముతున్నారు. వాడుతున్న గ్యాస్ అయిపోతే ఇడ్లీలు కూడా కష్టమే. అందుకనే పూరీ, దోసెలు, వడల్లాంటివి చేయటం ఆపేశారు.

నగరంలో గుర్తింపు పొందిన చిన్న, పెద్ద హోటళ్ళు సుమారు 25 వేలున్నాయి. టీస్టాళ్ళు, మొబైల్ వాహనాలు, ఫుట్ పాత్ మీద తినుబండారాలు అమ్మేవి కలిసి సుమారు 40 వేలున్నాయి. పీజీ హాస్టళ్ళల్లో ఉంటున్న వారిసంఖ్య సుమారు 10 లక్షలు. మెస్సులు 2 వేలున్నాయి. చిన్నా, పెద్దా హోటళ్ళల్లో ఉపాధిపొందుతున్న వారిసంఖ్య 5 లక్షలున్నట్లు అంచనా. గిగ్ వర్కర్లు అంటే జొమాటో, స్విగ్గీతో పాటు ఇతర ఆన్ లైన్ యాప్ లలో పనిచేస్తున్న వర్కర్లు సుమారు 5 లక్షలమంది ఉన్నారు. వీరుకాకుండా వివిధ అవసరాల కోసం నగరానికి ప్రతిరోజు వచ్చి వెళ్ళేవాళ్ళు మరో 5 లక్షలుంటారు. ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే చాలా హోటళ్ళు, రెస్టారెంట్లు ఆన్ లైన్ బుకింగులను నిలిపేశాయి. నేరుగా తమదగ్గరకు వస్తున్న వారికే టాప్ ప్రయారిటి ఇస్తున్నాయి.

మూత తప్పదేమో : నారాయణ

ప్రస్తుత గ్యాస్ సరఫరా కొరతగురించి ఉప్పల్ లోని హోటల్ యజమాని కే. నారాయణ మాట్లాడుతు గ్యాస్ సరఫరా కొరత వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము అని చెప్పారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి సమస్యను చూడలేదు అన్నారు. గడచిన 20 ఏళ్ళుగా ఇలాంటి సమస్య తలెత్తలేదు అని కూడా అన్నారు. గ్యాస్ సరఫరా ఎప్పుడు బాగవుతుందో తెలీక అయోమయం పెరిగిపోతోంది అన్నారు. హోటల్లో ఐటమ్స్ అన్నీ తగ్గించేయటంతో ఆదాయం పైన ప్రభావం పడుతోంది అని వాపోయారు. వర్కర్లకు చేతినిండా పనిలేకపోయినా జీతాలు మాత్రం ఇచ్చుకోక తప్పదు అని చెప్పారు.

కట్టెలపొయ్యి మీద వంట తేలికకాదు : గంగిరెడ్డి

శ్రీ కృష్ణ హోటల్ యజమాని పీర్ల గంగిరెడ్డి మాట్లాడుతు గ్యాస్ కు కొరత వచ్చిన కారణంగా కట్టెల పొయ్యిలే దిక్కు అని చెప్పారు. అయితే కట్టెలు కూడా అవసరమైనంత దొరకవని చెప్పారు. సంవత్సరాలుగా గ్యాస్ పొయ్యిల మీద వంటలు చేయటానికి అలవాటుపడిన వారిని ఒక్కసారిగా కట్టెల పొయ్యిల మీద వంటలు చేయమంటే సాధ్యం అవుతుందా ? అని ప్రశ్నించారు. ఒకవేళ కట్టెలపొయ్యి మీద వంటలు చేయాలన్నా హైదరాబాద్ మహానగరంలో కట్టెలు ఎక్కడ దొరుకుతాయని ఆవేధన వ్యక్తంచేశారు. గ్యాస్ పొయ్యిమీద వంటలు చేసినంత తేలికగా కట్టెల పొయ్యిల మీద వండటం కుదరదు అని తేల్చిచెప్పారు. కట్టెల పొయ్యిల మీద కూడా వంటలు కుదరకపోతే చివరకు హోటల్ ను మూసేయాల్సిందే తప్ప వేరేదారి లేదు అని అన్నారు.

ఉపాధి చూపించాలి : నారాయణరెడ్డి

ప్రస్తుత పరిస్ధితిల్లో ప్రభుత్వాలు కల్పించుకుని తమకు సరైన ఉపాధి చూపించాలని గిగ్ వర్కర్ల రాష్ట్ర అధ్యక్షుడు పీ నారాయణరెడ్డి విజ్ఞప్తిచేశారు. గ్యాస్ కొరత తమ కుటుంబాల్లో చిచ్చుపెడుతోంది అన్నారు. గ్యాస్ కొరత కారణంగా హోటళ్ళు, రెస్టారెంట్లు ఆన్ లైన్లో బుకింగులను నిలిపేస్తున్నాయి అని చెప్పారు. ఫలితంగా తమ ఉపాధిమీద దెబ్బపడుతోంది అన్నారు.

గ్రౌడ్ లెవల్లో పరిస్ధితులను చూసిన తర్వాత అర్ధమవుతున్నది ఏమిటంటే యుద్ధం ఇలాగే మరికొన్ని రోజులు సాగి, గ్యాస్ కొరత పెరిగితే వేలాది హోటళ్ళు, రెస్టారెంట్లు మూతపడక తప్పదు.

Read More
Next Story