క్లాస్ రూమ్ నుంచి అంతరిక్షానికి: హైదరాబాద్ విద్యార్థుల క్యూబ్‌సాట్ ప్రయాణం
x

క్లాస్ రూమ్ నుంచి అంతరిక్షానికి: హైదరాబాద్ విద్యార్థుల క్యూబ్‌సాట్ ప్రయాణం

ఈ ప్రయాణంలో హీరోలు పేరుమోసిన బడా శాస్త్రవేత్తలు కాదు… స్కూల్ బ్యాగ్ మోసే పిల్లలు.


వాళ్లు ఇంకా టీనేజర్లే. వాళ్ల కలలు మాత్రం భూమి లోవర్ ఆర్బిట్‌లో ఉన్నాయి. ఇప్పటివరకు వాళ్ల పేర్లు అటెండెన్స్ రిజిస్టర్‌లోనే కనిపించేవి. ఇప్పుడు అదే పేర్లు ఇస్రో లాంచ్ మానిఫెస్ట్‌లో మెరిసిపోనున్నాయి. గచ్చిబౌలి క్లాస్‌రూమ్ నుంచి శ్రీహరికోట లాంచ్‌ప్యాడ్ వరకూ సాగిన ఈ ప్రయాణంలో హీరోలు పేరుమోసిన బడా శాస్త్రవేత్తలు కాదు… స్కూల్ బ్యాగ్ మోసే పిల్లలు. హైదరాబాద్‌కు చెందిన ఈ చిన్నారులు తయారు చేసిన క్యూబ్‌స్యాట్(CubeSat) శాటిలైట్ జనవరి 12న అంతరిక్షానికి హాయ్ చెప్పబోతోంది. ఇది స్కూల్ ప్రాజెక్ట్ కాదు… ఇది చరిత్రకు మొదటి మెట్టు.

హైదరాబాద్‌కు చెందిన 12 నుంచి 17 ఏళ్ల విద్యార్థులు రూపొందించిన క్యూబ్‌స్యాట్ ఇప్పుడు భారత అంతరిక్ష చరిత్రలో ప్రత్యేక అధ్యాయంగా నిలవబోతోంది. ఈ చిన్న శాటిలైట్ జనవరి 12న ఉదయం 10 గంటల 17 నిమిషాలకు ఇస్రో నిర్వహించే పీఎస్‌ఎల్‌వీ–సీ62(PSLV-C62) మిషన్‌లో అంతరిక్షానికి ప్రయాణించనుంది.

‘ప్రాజెక్ట్–1 ఎస్‌బీబీ’(Proet-1 SBB) అనే పేరుతో గచ్చిబౌలిలోని బ్లూ బ్లాక్స్ మాంటిస్సోరి (Blue Block Montissori)స్కూల్‌‌కు చెందిన 17 మంది విద్యార్థులు ఈ ఉపగ్రహాన్ని రూపొందించారు. ఇస్రో అధికారిక లాంచ్ మానిఫెస్ట్‌లో స్థానం దక్కడం వీరి కృషికి లభించిన గొప్ప గుర్తింపు. ప్రయోగాన్ని శ్రీహరికోటలో ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం కూడా వీరికి లభించింది. అందులో ఇద్దరికి మిషన్ కంట్రోల్ రూమ్‌లోకి ప్రత్యేక అనుమతి రావడం ఈ ప్రాజెక్ట్‌కు మరింత విశిష్టత తీసుకొచ్చింది.

మామూలుగా స్కూల్స్ హోంవర్క్ ఉంటుంది. కొన్నికొన్ని స్కూల్స్‌లో ప్రాజెక్ట్ వర్క్ అని ఒక చిన్న డమ్మీ మోడల్ తయారు చేయిస్తారు. కానీ ఈ స్కూల్ పిల్లలు చేపట్టిన ఈ ప్రాజెక్ట్‌ను అలాంటిది కాదు. దీనిని ఇంత ప్రత్యేకంగా నిలబెట్టే విషయం దీని ద్వారా పిల్లలకు లభించే నిజమైన ఇంజినీరింగ్ అనుభవం. ఇది సాధారణ పాఠశాల ప్రాజెక్ట్‌లా ముందే తయారైన కిట్లపై ఆధారపడింది కాదు. స్క్రాచ్ నుంచి అంతా కూడా పిల్లలే రూపొందించారు. ఐడీయా నుంచి హార్డ్‌వేర్ అసెంబ్లీ, ఫర్మ్‌వేర్ డిజైన్ వరకు ప్రతి దశను విద్యార్థులే పూర్తి చేశారు. సెన్సార్లు పనిచేయని సందర్భాల్లో కోడ్‌ను సరిచేసుకోవడం వారికి సవాలుగా మారినప్పటికీ అదే అనుభవం వారిని మరింత బలంగా తీర్చిదిద్దింది. టిఫిన్ బాక్స్ పక్క.. కోడింగ్, ప్రాజెక్ట్ పేపర్లను పెట్టుకుని పనిచేసిన విద్యార్థులు వీరు.

బ్లూ బ్లాక్స్ మైక్రో రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో అమలు చేసే ‘స్ట్రక్చరల్ ఆటానమీ’ విధానం ఈ ప్రాజెక్ట్‌కు బలమైన పునాది వేసింది. పెద్దల జోక్యం తక్కువగా ఉండే ఈ విధానంలో విద్యార్థులే సమస్యలకు పరిష్కారాలు కనుగొన్నారు. అంతరిక్షంలో ఉష్ణోగ్రత మార్పులు అధ్యయనం చేసే సెన్సార్లను స్వయంగా సోల్డర్ చేసి ఉపగ్రహంలో అమర్చారు. ఈ ప్రాజెక్ట్ తయారీలో చిన్నారి శాస్త్రవేత్తలకు టేక్‌మీ2స్పేస్(Take me2space) శాస్త్రవేత్తలు మార్గనిర్దేశం ఇచ్చారు. కానీ వాటిని పర్ఫెక్ట్‌గా అమలు చేయడం మాత్రం పూర్తిగా విద్యార్థుల చేతుల్లోనే జరిగింది.

ఈ ఘనతను సంస్థ వ్యవస్థాపకుడు పవన్ గోయల్ ప్రశంసించారు. ‘‘ఏదైనా సాధించాలంటే వయసు ఎక్కువగా ఉండాల్సిన అవసరం లేదని ఈ పిల్లలు నిరూపించారు’’ అని అన్నారు. వీరు రేపటి ఇంజినీర్లు కాదని, ఈ రోజే అంతరిక్ష ప్రయాణానికి సిద్ధమైన ఇంజినీర్లని కొనియాడారు. ఈ ప్రాజెక్ట్‌ అంతర్జాతీయ స్థాయిలో కూడా ఆసక్తిని రేపింది. నార్వేలోని నోబెల్ పీస్ సెంటర్ ఈ విధానాన్ని పరిచయం చేయాలని ఆహ్వానించింది. మెక్సికోలో జరిగే ఏఎంఐ కాన్ఫరెన్స్‌లో సాంకేతిక సమీక్షకు కూడా ఈ విద్యార్థుల బృందం ఎంపికైంది.

ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మీడియా ప్రదర్శనలోనూ విద్యార్థులు తమ సత్తా చాటారు. ఆర్బిటల్ డైనమిక్స్ నుంచి పేచ్‌లోడ్ ఇంటిగ్రేషన్ వరకు వచ్చిన అన్ని ప్రశ్నలకు విద్యార్థులు ధైర్యంగా సమాధానాలు ఇచ్చారు. ఈ క్యూబ్‌స్యాట్ 450 కిలోమీటర్ల ఎత్తు నుంచి వాతావరణ పరిస్థితులు, ఆర్ద్రతకు సంబంధించిన డేటాను సేకరించనుందని వివరించారు. ఆ సమాచారం భవిష్యత్తులో ఇస్రో, నాసా వంటి సంస్థలకు ఉపయోగపడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

ఈ ప్రాజెక్ట్‌పై బ్లూ బ్లాక్స్ సహ వ్యవస్థాపకురాలు మునీరా హుస్సేన్ స్పందించారు. ‘‘చిన్న వయసు నుంచే అంతరిక్ష సాంకేతికత, డ్రోన్ టెక్నాలజీ, బ్లాక్‌చెయిన్ వంటి అంశాల్లో అవగాహన కల్పించడమే మా లక్ష్యం. ప్రస్తుతం ఏడో తరగతి నుంచి పదో తరగతి చదువుతున్న ఈ విద్యార్థులు భవిష్యత్తులో క్షిపణి శాస్త్రవేత్తలుగా, ఏరోస్పేస్ ఇంజినీర్లుగా ఎదగాలనే కలలతో ముందుకు సాగుతున్నారు’’ అని చెప్పారు. ఇదంతా బాగానే ఉంది.

క్యూబ్‌సాట్(CubeSat) అంటే ఏమిటి

క్యూబ్‌సాట్(CubeSat) అనేది చిన్న పరిమాణంలో రూపొందించే ఉపగ్రహం. సాధారణంగా ఇది పది సెంటీమీటర్లు పొడవు, వెడల్పు, ఎత్తుతో ఉంటుంది. దీని బరువు కూడా1-2 కిలోల మధ్యే ఉంటుంది. దీనిని రూపొందించడానికి ఖర్చు కూడా తక్కువే అవుతుంది. దాని వల్ల విద్యార్థులకు కూడా అంతరిక్ష సాంకేతికతను చేరువ చేయడం సాధ్యమవుతుంది. అంతేకాకుండా పెద్ద ఉపగ్రహాలతో పోలిస్తే దీనిని త్వరగా తయారు చేయవచ్చు. అందుకే ప్రపంచవ్యాప్తంగా విద్యా సంస్థలు క్యూబ్‌సాట్(CubeSat) మోడల్‌ను విస్తృతంగా ఉపయోగిస్తున్నాయి.

క్యూబ్‌సాట్‌ నిర్మాణంలో కీలక భాగాలు

క్యూబ్‌సాట్ నిర్మాణంలో పలు కీలక స్టెప్స్ ఉన్నాయి. వాటన్నింటిని జాగ్రత్తగా పాటించాల్సిందే. ఏమాత్రం తేడా వచ్చినా ప్రాజెక్ట్ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. అవేంటంటే..

స్ట్రక్చర్ డిజైన్

ఈ క్యూబ్‌సాట్ నిర్మాణాన్ని అల్యూమినియం మిశ్రమంతో తయారు చేశారు. అంతరిక్షంలో ఎదురయ్యే తీవ్రమైన ఉష్ణోగ్రతలు, ప్రయోగ సమయంలో వచ్చే కంపనాలను తట్టుకునేలా దీనిని బలంగా డిజైన్ చేశారు. చిన్న ఉపగ్రహం అయినా దీని నిర్మాణం చాలా దృఢంగా ఉంటుంది.

పవర్ సిస్టమ్

ఈ ఉపగ్రహానికి విద్యుత్ అందించేందుకు చిన్న సోలార్ ప్యానెల్స్ అమర్చారు. సూర్యకాంతితో ఇవి ఛార్జ్ అవుతాయి. లోపల ఉన్న బ్యాటరీలు రాత్రి సమయంలో కూడా వ్యవస్థలు పనిచేసేలా చూస్తాయి. తక్కువ శక్తితో ఎక్కువ పనితీరు సాధించడమే ఈ వ్యవస్థ ప్రత్యేకత.

కమ్యూనికేషన్ సిస్టమ్

ఇందులో ఉన్న ట్రాన్స్‌మిటర్ భూమిపై ఉండే గ్రౌండ్ స్టేషన్‌తో నిరంతరం కాంటాక్ట్‌లో ఉంటుంది. శాటిలైట్ సేకరించిన సమాచారం నేరుగా విద్యార్థుల ల్యాబ్‌లకు చేరుతుంది. దీని ద్వారా టెలిమెట్రీ వ్యవస్థలను ప్రత్యక్షంగా నేర్చుకునే అవకాశం కలుగుతోంది.

ఆన్‌బోర్డ్ కంప్యూటర్

ఈ ఉపగ్రహానికి మెదడులా పనిచేసేది ఆన్‌బోర్డ్ కంప్యూటర్. అన్ని సెన్సార్ల నుంచి వచ్చే డేటాను ఇది సేకరిస్తుంది. అవసరమైన సమాచారాన్ని ప్రాసెస్ చేసి భూమికి పంపుతుంది. చిన్న పరిమాణంలో ఉన్నా పనితీరు మాత్రం పెద్ద వ్యవస్థలతో సమానంగా ఉంటుంది.

క్యూబ్‌సాట్ అసలేం చేస్తుంది

ఈ క్యూబ్‌సాట్ ద్వారా అంతరిక్ష ఉష్ణోగ్రతలు, రేడియేషన్ ఎఫెక్ట్, భూమి మాగ్నెటిక్ ఫీల్డ్ మార్పులు వంటి అంశాలను అధ్యయనం చేస్తుంది. ఈ డేటా భవిష్యత్తు అంతరిక్ష ప్రయోగాలకు మార్గదర్శకంగా నిలుస్తుంది.

కమ్యూనికేషన్ ప్రయోగాలు

డేటా ట్రాన్స్‌మిషన్ ఎలా జరుగుతుంది, సిగ్నల్ బలం ఎలా మారుతుంది అనే విషయాలపై విద్యార్థులు అనేక పరీక్షలు చేస్తున్నారు. ఇది తక్కువ ఖర్చుతో కమ్యూనికేషన్ ఉపగ్రహాల అభివృద్ధికి ఉపయోగపడుతుంది.

ఐఓటీ ప్రయోగాలు

ఈ క్యూబ్‌సాట్ ద్వారా ఐఓటీ ఆధారిత స్మార్ట్ సిస్టమ్‌లపై కూడా పరిశోధనలు సాగుతున్నాయి. భవిష్యత్తులో వ్యవసాయం, విపత్తు నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణ వంటి రంగాలకు ఇది ఉపయోగపడే అవకాశం ఉంది.

భారత్‌కు దీని ప్రాముఖ్యత

భారత్ ప్రస్తుతం అంతరిక్ష రంగంలో కొత్త దశలోకి అడుగుపెడుతోంది. చిన్న ఉపగ్రహాలకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. ఈ సమయంలో హైదరాబాద్ విద్యార్థుల క్యూబ్‌సాట్ ప్రాజెక్ట్ దేశానికి అవసరమైన నైపుణ్యాన్ని పెంచుతోంది. అంతేకాకుండా చిన్న ఉపగ్రహాల యుగంలో భారత్ కొత్త దశలోకి అడుగుపెడుతోంది.

Read More
Next Story