
PHOTO SOURCE : X/SCR: హైదరాబాద్ కేంద్రంగా హైస్పీడ్ రైల్వే కారిడార్ లు
హైస్పీడ్ రైళ్లతో దూసుకెళ్లనున్న హైదరాబాద్
కేంద్ర బడ్జెట్ 2026–27: మూడు హైస్పీడ్ రైల్వే కారిడార్లతో హైదరాబాద్ హబ్
దేశ హైస్పీడ్ రైల్వే ప్రణాళికల్లో హైదరాబాద్‌కు కీలక స్థానం దక్కింది. 2026–27 కేంద్ర బడ్జెట్‌లో ఏడు ప్రధాన నగరాల మధ్య హైస్పీడ్ రైల్వే కారిడార్లను ప్రకటించగా, వాటిలో మూడు కారిడార్లు హైదరాబాద్‌ను కేంద్రంగా ఉండటం విశేషంగా నిలిచింది.
2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్ లో ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ హైదరాబాద్ నగరానికి ప్రాధాన్యమిచ్చారు. దేశంలో ఏడు ప్రధాన నగరాల మధ్య హైస్పీడ్ రైల్వే కారిడార్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించగా, ఇందులో మూడు హైస్పీడ్ రైల్వే కారిడార్లు హైదరాబాద్ నుంచి ఉండటం విశేషం. హైదరాబాద్ - పూణే, హైదరాబాద్- బెంగళూరు, హైదరాబాద్ -చెన్నై కేంద్రాల మధ్య హైస్పీడ్ రైల్వే కారిడార్ లను కేంద్రమంత్రి ప్రకటించారు. ఏడు హైస్పీడ్ కారిడార్లలో మూడు హైదరాబాద్ ను కలుపుతూ ఏర్పాటు చేయడం విశేషం.
మోదీ సొంత నియోజకవర్గం వారణాసికి ప్రాధాన్యం
ముంబయి- పూణే, చెన్నై- బెంగళూరు, ఢిల్లీ -వారణాసి, వారణాసి- సిలిగుడి హైస్పీడ్ కారిడార్లను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. హైదరాబాద్ తర్వాత సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సొంత పార్లమెంటు నియోజకవర్గమైన వారణాసి నుంచి ఢిల్లీకి, వారణాసి నుంచి సిలిగుడికి హైస్పీడ్ కారిడార్ ఏర్పాటు చేశారు.తెలంగాణలోని హైదరాబాద్ స్టేషన్ ను కలుపుతూ మూడు రైల్వే హైస్పీడ్ కారిడార్లను ఏర్పాటు చేస్తున్నట్లు బడ్జెట్ ప్రకటించడంపై తెలంగాణ రైల్వే ప్రయాణికుల సంఘం అధ్యక్షుడు నూర్ హర్షం వ్యక్తం చేశారు.
వాణిజ్యంగా కొత్త అవకాశాలు
ఈ హైస్పీడ్ రైల్వే కారిడార్లు అమలులోకి వస్తే హైదరాబాద్ దేశంలోని ప్రధాన నగరాలతో మరింత వేగంగా, సమర్థవంతంగా అనుసంధానమవుతుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు భావిస్తున్నారు. దీని ద్వారా తెలంగాణ రాష్ట్రానికి ఆర్థికంగా, వాణిజ్యంగా కొత్త అవకాశాలు లభించనున్నాయి.హైస్పీడ్ రైల్వే కారిడార్లతో హైదరాబాద్ రవాణా రంగంలో కొత్త యుగానికి అడుగుపెడుతోంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఈ హైస్పీడ్ రైల్వే కారిడార్లు హైదరాబాద్ అభివృద్ధికి మరో మైలురాయిగా మారనున్నాయి.
Next Story

