హైదరాబాద్ మెట్రో ఫేజ్-1 స్వాధీనం, విస్తరణకు గ్రీన్ సిగ్నల్
x

హైదరాబాద్ మెట్రో ఫేజ్-1 స్వాధీనం, విస్తరణకు గ్రీన్ సిగ్నల్

మెట్రో విస్తరణ అడ్డంకులపై సమీక్ష అనంతరం కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఫేజ్-2కు కేంద్ర అనుమతిపై దృష్టి సారించింది.


హైదరాబాద్ మెట్రో విస్తరణలో కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. తాజా పరిణామంగా, మెట్రో ఫేజ్-1ను స్వాధీనం చేసుకోవడంతో పాటు, ఫేజ్-2 విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్‌కు మెట్రో నెట్‌వర్క్ విస్తరించాలని వివిధ వర్గాల నుంచి వచ్చిన డిమాండ్లను ప్రభుత్వం పరిశీలించింది. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని విస్తరణ అవసరాన్ని సమీక్షించింది. ప్రస్తుతం మెట్రో ఫేజ్-1 మొత్తం 69 కిలోమీటర్ల మేర కొనసాగుతోంది. ఫేజ్-2(ఏ) కింద 76.4 కిలోమీటర్లు, ఫేజ్-2(బీ) కింద 86.1 కిలోమీటర్ల విస్తరణ ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే పంపినట్లు వెల్లడించారు. మెట్రో విస్తరణలో ఎదురవుతున్న అడ్డంకులను కూడా ప్రభుత్వం విశ్లేషించింది. ఫేజ్-1 ప్రైవేట్ సంస్థ నిర్వహణలో ఉండగా, ఫేజ్-2ను కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో అమలు చేయాల్సి రావడం వల్ల సాంకేతిక, చట్టపరమైన సమస్యలు తలెత్తుతున్నట్లు గుర్తించారు.

ఈ నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం లేవనెత్తిన అంశాలను పరిష్కరించేందుకు ఎల్ అండ్ టీ సంస్థ నుంచి మెట్రో ఫేజ్-1 నెట్‌వర్క్‌ను రాష్ట్ర ప్రభుత్వం హెచ్‌ఎంఆర్‌ఎల్ ద్వారా స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించింది. ఈ నిర్ణయానికి సభ పూర్తి మద్దతు తెలిపింది. ఫేజ్-1 స్వాధీనం ప్రక్రియను వేగవంతం చేయాలని, దానికి అవసరమైన చర్యలను ప్రభుత్వం తీసుకోవాలని సూచించారు. అలాగే ఫేజ్-2 విస్తరణకు కేంద్ర అనుమతులు త్వరగా పొందేందుకు కృషి చేయాలని సభ కోరింది. ఈ నిర్ణయంతో హైదరాబాద్ మెట్రో విస్తరణకు కొత్త దిశ లభించింది. తదుపరి చర్యలు కేంద్ర అనుమతులపై ఆధారపడి కొనసాగనున్నాయి.

Read More
Next Story