
ఐపీఎల్ పేరుతో బెట్టింగ్ మోసాలు.. హైదరాబాద్‌లో అలర్ట్
ఫేక్ ప్రిడిక్షన్ ఛానెల్స్, సోషల్ మీడియా మోసాలపై సైబర్ క్రైమ్ హెచ్చరికలు. కోట్ల రూపాయల మోసాలు వెలుగులోకి వచ్చాయి.
ఐపీఎల్ అంటే భారతదేశమంతా క్రికెట్ పండగ. కుర్రకారులో ఈ టోర్నీపై ఉండే ఆసక్తి వేరే లెవెల్. ఫ్యాన్స్‌కు ఉన్న ఉత్సాహాన్ని, క్రికెట్ అంటే ప్రేమను కొందరు మాత్రం తమకు అనుగుణంగా మార్చుకుంటున్నారు. డబ్బు ఆశ చూపి.. బెట్టింగ్ ఉచ్చులోకి దింపుతున్నారు. ఇందులో తాజాగా మరో కొత్ మోసం వెలుగు చూసింది. మ్యాచ్ రిజల్స్‌పైన బెట్టింగ్ వేయడం పాత పద్దతి. అలా అయితే ఎక్కువ మంది రావట్లేదనుకున్నారో ఏమో కానీ.. సైబర్ మోసగాళ్లు ఇప్పుడు మరో కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. తాము మ్యాచ్ ప్రెడిక్షన్ చెప్తామని, పక్కాగా అదే రిజల్ట్ వస్తుందని నమ్మబలుకుతూ ప్రజలకు కుచ్చుటోపీలు పెడుతున్నారు. మ్యాచ్ రిజల్ట్ ఒక్కటే కాదు.. టాస్ ఎవరు గెలుస్తారు అనేలాంటి అంశాలను కూడా వారు చెప్తామని ప్రచారం చేసుకుంటున్నారు. ఈ ప్రకటనలు పోలీసుల కళ్లలో పడటంతో అసలు బాగోతం బయటపడింది.
ఇదంతా కూడా మోసమని గుర్తించిన పోలీసులు ప్రజలను, అభిమానులు హెచ్చరిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ సీపీ సజ్జనార్ కూడా ఎక్స్(ట్విట్టర్) వేదికగా ఒక అలెర్ట్ పోస్ట్ పెట్టారు. ఈజీగా డబ్బు వస్తుందని, అధికంగా వస్తుందని ఆశపడి బెట్టింగ్ ఉచ్చులో పడొద్దని సజ్జనార్ హెచ్చరించారు. ‘‘సోషల్ మీడియాలో కొందరు ఇన్ఫ్లుయెన్సర్లు తప్పుడు ప్రకటనలతో ప్రజలను ఆకర్షిస్తున్నారు. మ్యాచ్ ఫలితాలు, టాస్ ఫలితాలను ముందే చెబుతామని చెప్పి, తమ ఛానెల్స్‌కు సబ్‌స్క్రైబ్ చేయిస్తున్నారు. తరువాత వారిని బెట్టింగ్ ఉచ్చులోకి దింపుతున్నారు’’ అని ఆయన తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
ఈ తరహా ఫేక్ ప్రిడిక్షన్ ఛానెల్స్ వల్ల అనేక మంది డబ్బులు కోల్పోతున్నారని అధికారులు హెచ్చరించారు. కేవలం డబ్బు కోసం అసత్య ప్రచారం జరుగుతోందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే గత నెలలో హైదరాబాద్ సైబర్ క్రైమ్ విభాగం పెద్ద ఎత్తున చర్యలు చేపట్టింది. 494 పెయిడ్ ప్రకటనలను తొలగించడంతో పాటు, వాటికి సంబంధించిన 129 సోషల్ మీడియా ఖాతాలను బ్లాక్ చేసింది.
ఇదే సమయంలో పలు పెద్ద మోసాలు కూడా బయటపడ్డాయి. మార్చి 2026లో రూ.26 కోట్లకు పైగా లావాదేవీలు జరిగిన ఆన్‌లైన్ బెట్టింగ్ నెట్‌వర్క్‌ను పోలీసులు ఛేదించారు. ఈ కేసులో నలుగురిని అరెస్ట్ చేశారు. మ్యూల్ బ్యాంక్ ఖాతాలను ఉపయోగించి డబ్బు మార్పిడి చేసినట్లు గుర్తించారు. అదే నెలలో 250కు పైగా సిమ్ కార్డులు సరఫరా చేసిన మరో గ్యాంగ్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ సిమ్ కార్డులతో నకిలీ వాట్సాప్, టెలిగ్రామ్ ఖాతాలు సృష్టించి మోసాలకు పాల్పడ్డారని అధికారులు తెలిపారు.
“ష్యూర్ విన్” పేరుతో 100 శాతం గెలుపు హామీలు ఇస్తూ ప్రజలను మోసం చేస్తున్న ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి. డబ్బు చెల్లించిన తర్వాత మోసగాళ్లు కనిపించకుండా పోవడం లేదా మరింత డబ్బు డిమాండ్ చేయడం జరుగుతోందని పోలీసులు తెలిపారు. ఫిబ్రవరి-మార్చి మధ్య ఒక వ్యాపారవేత్త నుంచి రూ.1.5 కోట్లు దోచుకున్న ఘటన కూడా నమోదు అయింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు కఠిన హెచ్చరికలు జారీ చేశారు.
బెట్టింగ్ యాప్స్‌ను ప్రోత్సహించే వారిపై కూడా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ కార్యకలాపాలపై నిఘా పెంచారు. తెలంగాణ గేమింగ్ చట్టం ప్రకారం ఇటువంటి నేరాలకు బ్యాంక్ ఖాతాలు ఫ్రీజ్ చేయడం, అరెస్టులు వంటి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజలు ఇలాంటి మోసాలకు గురికాకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అనుమానాస్పద ప్రకటనలు కనిపించినా, మోసపోయినా వెంటనే 1930కు కాల్ చేయాలని లేదా అధికారిక సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని అధికారులు తెలిపారు.

