
హైదరాబాద్‌లో డ్రగ్స్ దందా.. యువతి అరెస్ట్
గోవా నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ సరఫరా.
మాదకద్రవ్యాల కట్టడికి దేశవ్యాప్తంగా పోలీసు రంగం అనేక ప్రయత్నాలు చేస్తోంది. తెలంగాణ పోలీసులు మరో అడుగు ముందుకేసి ప్రత్యేక బృందాలతో మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోతుపుతున్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈగల్(EAGLE) టీమ్.. పలుమార్లు డ్రగ్ దందాల గుట్టు రట్టు చేసింది. తాజాగా పోలీసులు డ్రగ్స్ విక్రయిస్తున్న ఓ యువతిని అరెస్ట్ చేశారు. ఆమె గోవా నుంచి డ్రగ్స్‌ను హైదరాబాద్‌కు తీసుకొస్తున్నట్లు గుర్తించారు. యువతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. వాళ్ల ప్రాథమిక దర్యాప్తులో కీలక విషయాలు వెలుగుచూశాయి. ఈజీ మనీ కోసమే సదరు యువతి డ్రగ్స్ పెడ్లర్‌గా మారినట్లు గుర్తించారు. గోవాలో ఓ నైజీరియన్ గ్రూప్ దగ్గర నుంచి యువతి డ్రగ్స్ కొనుగోలు చేసేదని నిర్ధారించారు పోలీసులు.
గోవా నుంచి హైదరాబాద్‌కు భారీగా డ్రగ్స్ తీసుకొస్తున్న యువతిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితురాలిని బంజారాహిల్స్‌కు చెందిన హస్సాగా గుర్తించారు. 2024 డిసెంబర్‌లో గోవాకు వెళ్లిన హస్సా తొలిసారిగా MDMAను వినియోగించినట్లు, ఆ తర్వాత మాదకద్రవ్యాలకు బానిసగా మారినట్లు తేలింది. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆశతో ఆమె డ్రగ్స్ పెడ్లర్‌గా మారినట్లు పోలీసులు తెలిపారు.
గోవాలోని నైజీరియన్ డ్రగ్ మాఫియాతో హస్సాకు సంబంధాలు ఏర్పడినట్లు దర్యాప్తులో వెల్లడైంది. అక్కడి నుంచి తక్కువ ధరకు MDMA, LSD వంటి ఖరీదైన డ్రగ్స్ కొనుగోలు చేసి, వాటిని హైదరాబాద్‌కు తీసుకొచ్చి నగర యువతకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఈ ఏడాది మార్చి నుంచి ఆమె పలుమార్లు గోవాకు వెళ్లి డ్రగ్స్ తీసుకొచ్చినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. ఈ నెల 26న గోవాలోని సియోలిమ్, మాపూసా ప్రాంతాల్లో డ్రగ్స్ డీల్స్ చేసినట్లు దర్యాప్తులో తేలింది.
హస్సాపై గతంలో కూడా గోల్కొండ పోలీస్ స్టేషన్‌లో NDPS చట్టం కింద కేసు నమోదైంది. ఆ కేసులో జైలుకు వెళ్లిన ఆమె, ఇటీవల బెయిల్‌పై విడుదలైనట్లు పోలీసులు తెలిపారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా పద్ధతి మార్చుకోకుండా, హైదరాబాద్‌కు చెందిన మరికొందరు సహచరులతో కలిసి డ్రగ్స్ దందా కొనసాగిస్తుండగా పోలీసులు మాటు వేసి పట్టుకున్నారు.
ప్రస్తుతం ఆమె ఎవరెవరికి డ్రగ్స్ విక్రయిస్తోంది, ఈ ముఠాలో ఇంకా ఎంతమంది సభ్యులు ఉన్నారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ డ్రగ్స్ నెట్‌వర్క్‌కు సంబంధించిన మిగిలిన నిందితులను కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తామని అధికారులు తెలిపారు.

