హైదరాబాద్‌లో వైభవంగా శ్రీ వేంకటేశ్వర రథోత్సవం
x

హైదరాబాద్‌లో వైభవంగా శ్రీ వేంకటేశ్వర రథోత్సవం

జూబ్లీహిల్స్‌లో శ్రీ వేంకటేశ్వర రథోత్సవం ఘనంగా, భక్తులు పుష్పాలంతో అలంకరించిన మహారథాన్ని దర్శించుకున్నారు.


హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవ మహోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం దివ్యమంగళ హారతుల మధ్య శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారు పుష్పాలతో, పతాకాలతో అలంకరించిన మహారథాన్ని అధిరోహించి భక్తకోటికి కృపాకటాక్ష దర్శనం ప్రసాదించారు.

“గోవిందా… గోవిందా…” నినాదాలతో మారుమోగిన ఆలయ పరిసరాల్లో భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తజన బృందాల కోలాటాలు, చెక్కభజనలు, మంగళవాయిద్యాలు ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని రెట్టింపు చేశాయి.


శ్రీ‌వారి రథదర్శనం జన్మజన్మాంతర పాపాలను హరించి భక్తులకు మోక్షసౌభాగ్యం ప్రసాదిస్తుందని, రథస్థుడైన మాధవుడి దర్శనం పునర్జన్మ బంధనాలను నివారిస్తుందని ఆలయ అర్చకులు తెలిపారు.

ఈ దివ్య ఉత్సవ శ్రేణిలో భాగంగా రాత్రి 7 గంటలకు స్వామివారు అశ్వవాహనంపై విహరిస్తూ భక్తులకు పుణ్యదర్శనం అనుగ్రహించనున్నారు.

Read More
Next Story