
హైస్పీడ్ రైల్వే హబ్‌గా హైదరాబాద్
హైస్పీడ్ రైల్వే హబ్‌గా హైదరాబాద్: తెలంగాణకు రూ.5,454 కోట్ల నిధులు
ఒక గంట 55 నిమిషాల్లో పుణేకు, మూడు గంటల్లో చెన్నై,బెంగళూరుకు రెండుగంటలు: హైస్పీడ్ రైళ్లతో హైదరాబాద్ దూసుకెళ్లనుంది.
తెలంగాణ రైల్వే రంగం కొత్త వేగం పుంజుకోనుంది. హైదరాబాద్ కేంద్రంగా బుల్లెట్ రైళ్ల కారిడార్లు, యాదాద్రికి ఎంఎంటిఎస్ విస్తరణ, అమృత్ స్టేషన్ పథకం వంటి కీలక ప్రాజెక్టులను రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్‌లో కేటాయించారు.తెలంగాణ రాష్ట్రానికి 2026-27 ఆర్థిక సంవత్సర కేంద్ర బడ్జెట్ లో రైల్వేరంగానికి రూ. 5,454 కోట్లు కేటాయించినట్లు కేంద్రరైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ప్రస్థుతం రాష్ట్రంలో రూ.47,984 కోట్ల రైల్వే ప్రాజెక్టులు చేపట్టామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ ప్రకటించారు. కేంద్ర బడ్జెట్ లో దక్షిణ మధ్య రైల్వేకు, తెలంగాణకు ఇచ్చిన నిధుల వివరాలను రైల్వే శాఖ మంత్రి, రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ తెలిపారు.
మూడు నగరాల మధ్య తగ్గిన ప్రయాణ సమయం
దేశంలో హైస్పీడ్ బుల్లెట్ రైళ్లకు హైదరాబాద్‌ను కేంద్రంగా మార్చేందుకు తెలంగాణకు రికార్డు స్థాయి నిధులను కేటాయింపులు చేస్తున్నట్లు రైల్వేవర్గాలు వెల్లడించాయి. మూడు బుల్లెట్ రైలు కారిడార్లు హైదరాబాద్ నగరంలోని శంషాబాద్ నుంచి ప్రారంభం కావడం వల్ల భారతదేశంలో హై-స్పీడ్ రైళ్లకు కేంద్రంగా అవతరించనుంది. ఈ కారిడార్లకు శంషాబాద్ ప్రధాన టెర్మినల్ గా గుర్తించారు.ఈ మూడు హై-స్పీడ్ రైలు కారిడార్ల వల్ల ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది.హైదరాబాద్-పుణెకు ఒక గంట 55 నిమిషాలు,హైదరాబాద్-చెన్నైకి రెండు గంటల 55 నిమిషాలు, హైదరాబాద్-బెంగళూరుకు రెండు గంటల సమయం పడుతుందని రైల్వే అధికారులు అంచనా వేశారు.ఈ హైస్పీడ్ కారిడార్ల వల్ల ఆర్థిక వృద్ధితోపాటు విద్య, ఆరోగ్యం, వ్యాపారం కోసం కనెక్టివిటీని పెంచుతాయని రైల్వే అధికారులు భావిస్తున్నారు.
యాదాద్రికి ఎంఎంటిఎస్
తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరగుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామి దేవాలయానికి వచ్చే భక్తుల సౌలభ్యం కోసం రూ.412 కోట్లతో యాదాద్రికి ఎంఎంటిఎస్ విస్తరణ కూడా ప్రారంభించామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర రైల్వే నెట్‌వర్క్ 100 శాతం విద్యుదీకరణను సాధించిందని రైల్వే అధికారులు చెప్పారు.రూ.2,500 కోట్ల వ్యయంతో గుంటూరు-బీబీనగర్ డబ్లింగ్, రూ. 6,000 కోట్లతో కాజీపేట-బల్హర్షా, కాజీపేట-విజయవాడ ట్రిప్లింగ్ ప్రాజెక్టులు, రూ. 500 కోట్లతో వికారాబాద్ మీదుగా సికింద్రాబాద్, వాడి మధ్య పనులు చేపట్టారు.
అమృత్ స్టేషన్ పథకం స్టేషన్ల అభివృద్ధి
అమృత్ స్టేషన్ పథకం కింద తెలంగాణలోని 40 రైల్వే స్టేషన్లను రూ.2,015 కోట్ల అంచనా పెట్టుబడితో సమగ్ర పునరాభివృద్ధి కోసం గుర్తించారు.బేగంపేట, కరీంనగర్, వరంగల్, శ్రీ బాల బ్రహ్మేశ్వర జోగులాంబ స్టేషన్లలో అభివృద్ధి పనులు విజయవంతంగా పూర్తయ్యాయి.తెలంగాణకు సగటు వార్షిక రైల్వే బడ్జెట్ కేటాయింపు 2009–14లో రూ.886 కోట్ల నుంచి 2026–27లో రూ.5,454 కోట్లకు పెరిగింది. ప్రస్తుతం ఐదు జతల వందే భారత్ ఎక్స్‌ప్రెస్,మూడు జతల అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడుస్తున్నాయరి సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు చెప్పారు. రైల్వే భద్రతా కార్యక్రమాలలో భాగంగా స్వదేశీ రైలు ఢీకొనడాన్ని నివారించే వ్యవస్థ 'కవచ్'ను తెలంగాణలో విస్తృతంగా అమలు చేస్తున్నామని చెప్పారు.
మొత్తంగా చూస్తే, కేంద్రం ప్రకటించిన ఈ భారీ రైల్వే కేటాయింపులు తెలంగాణ రవాణా ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చే దిశగా కీలకంగా నిలవనున్నాయి. హైస్పీడ్ రైళ్లతో పాటు ఆధునిక స్టేషన్లు, భద్రతా వ్యవస్థల అమలుతో రాష్ట్ర అభివృద్ధి కొత్త ట్రాక్‌పైకి ఎక్కనుందని రైల్వే వర్గాలు భావిస్తున్నాయి.
Next Story

