
హైదరాబాద్‌కు తాగునీటి కష్టాలు? సింగూర్ ఖాళీ అయితే పరిస్థితి ఏంటి?
మూడు రోజులకు ఒకసారి సరఫరా చేసే పరిస్థితి...
రచ్చ - రాజకీయం @ 5 పి.ఎం.
1) హైదరాబాద్‌కు తాగునీటి కష్టాలు? సింగూర్ ఖాళీ అయితే పరిస్థితి ఏంటి?
2) హైదరాబాద్‌లో గణేశ్ సందడి.. ఈ ఏడాది స్పెషల్ ఏమిటంటే?
3) డేటింగ్ యాప్‌లో ఫ్రెండ్‌షిప్.. రూ.4.91 కోట్లు స్వాహా!
1) హైదరాబాద్‌కు తాగునీటి కష్టాలు? సింగూర్ ఖాళీ అయితే పరిస్థితి ఏంటి?
హైదరాబాద్ తాగునీటి సరఫరాలో కీలకమైన సింగూర్ రిజర్వాయర్‌పై ప్రస్తుతం ఒత్తిడి పెరుగుతోంది. సింగూర్‌లో ఉన్న నీటి నిల్వలు మరో 80 రోజులకు మాత్రమే సరిపోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో సింగూర్ నీటిపై ఆధారపడే ప్రాంతాలకు భవిష్యత్తులో నీటి సరఫరాపై ప్రభావం పడకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై అధికారులు దృష్టి పెట్టారు. ప్రస్తుతం సింగూర్–మంజీరా వ్యవస్థ నుంచి హైదరాబాద్‌కు రోజుకు సుమారు 110 MGD నీరు వస్తోంది. నగరంలో రోజువారీ మొత్తం నీటి వినియోగం సుమారు 576 MGD. అంటే నగరానికి వచ్చే నీటిలో సింగూర్–మంజీరా వాటా కూడా కీలకంగానే ఉంది. హైదరాబాద్‌లో మొత్తం నీటి కనెక్షన్లు సుమారు 13 లక్షలు. సింగూర్–మంజీరా వ్యవస్థపై ఆధారపడే కనెక్షన్లు సుమారు 3 లక్షలు.
హైదరాబాద్‌కు నీరు ఎక్కడి నుంచి వస్తుందో చూస్తే.. కృష్ణా నుంచి 275 MGD, గోదావరి నుంచి 162 MGD, సింగూర్–మంజీరా నుంచి 110 MGD, ఉస్మాన్‌సాగర్ నుంచి 21 MGD, హిమాయత్‌సాగర్ నుంచి 7 MGD వస్తోంది. ఇలా అన్ని వనరుల నుంచి కలిపి రోజుకు సుమారు 576 MGD నీటిని నగరం వినియోగిస్తోంది.
సింగూర్ నీళ్లు తగ్గితే ఏం జరుగుతుంది?
సింగూర్ నీటి నిల్వలు పూర్తిగా తగ్గితే.. ప్రస్తుతం రెండు రోజులకు ఒకసారి నీరు అందుతున్న ప్రాంతాల్లో మూడు రోజులకు ఒకసారి సరఫరా చేసే పరిస్థితి రావచ్చని అధికారులు చెబుతున్నారు. అంతేకాదు, సాధారణంగా వస్తున్న నీటి పరిమాణం కూడా గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. సింగూర్–మంజీరా వ్యవస్థపై ఆధారపడే ప్రాంతాల్లో సుమారు 3 లక్షల నీటి కనెక్షన్లు ఉన్నాయి. అందువల్ల సింగూర్ నిల్వలు తగ్గడం కేవలం ఒక రిజర్వాయర్‌కు సంబంధించిన సమస్య కాకుండా.. నగరంలోని పెద్ద సంఖ్యలో కుటుంబాలపై ప్రభావం చూపే అంశంగా మారుతోంది.
ప్రత్యామ్నాయంగా గోదావరి నీరుప్రస్తుత పరిస్థితిని ఎదుర్కోవడానికి అధికారులు "గోదావరి ఫేజ్–2 నుంచి అదనంగా 40 నుంచి 50 MGD నీటిని తరలించే ప్రత్యామ్నాయ ప్రణాళికపై దృష్టి పెట్టారు. గోదావరి ఫేజ్–2 నీటి వ్యవస్థలో భాగంగా మల్లన్నసాగర్ వైపు నుంచి వచ్చే నీటిని శామీర్‌పేట్ ప్రాంతానికి తీసుకువచ్చి, అక్కడి నుంచి రింగ్ మెయిన్–2, అనుసంధాన పైప్‌లైన్ల ద్వారా నగరంలోని వివిధ రిజర్వాయర్లకు తరలించే వ్యవస్థ ఉంది. ఇదే మార్గాన్ని ఉపయోగించి అదనపు గోదావరి నీటిని తీసుకొచ్చి సింగూర్ నీటిపై ఆధారపడే ప్రాంతాలకు ప్రత్యామ్నాయంగా సరఫరా చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు జలమండలి ఎం.డి. అశోక్‌రెడ్డి చెప్పారు.
ఈ ప్రత్యామ్నాయ ప్రణాళికలో గోదావరి రింగ్ మెయిన్–2 పైప్‌లైన్ కీలకంగా మారుతోంది. పైప్‌లైన్‌కు ట్రయల్ రన్ నిర్వహించడంతో పాటు మిగిలిన పనులను వేగంగా పూర్తి చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. "ట్రయల్ రన్ విజయవంతమై వ్యవస్థ అందుబాటులోకి వస్తే, సింగూర్ నీటి నిల్వలు తగ్గిన సమయంలో గోదావరి నుంచి అదనపు నీటిని తీసుకురావడానికి ఇది ఉపయోగపడనుంది.
అంటే, ప్రస్తుతం ఒక ప్రాంతం నుంచి వచ్చే నీటిపై ఆధారపడకుండా, నగరంలోని వివిధ ప్రాంతాల మధ్య నీటిని మళ్లించే అవకాశం పెరుగుతుందని" అశోక్‌రెడ్డి చెప్పారు.శామీర్‌పేట్ వైపు నుంచి వచ్చే నీటిని లింగంపల్లి రిజర్వాయర్, కూకట్‌పల్లి వైపు తరలించి, అవసరమైన ప్రాంతాలకు మళ్లించే అవకాశాలను పరిశీలిస్తున్నారు.
ప్రత్యామ్నాయ నీటి మార్గాలతో పాటు ప్రస్తుత నీటి వినియోగాన్ని తగ్గించడం కూడా అవసరమని అధికారులు చెబుతున్నారు. రోజువారీ వినియోగంలో నీటి వృథాను తగ్గిస్తే సింగూర్‌లో ఉన్న నిల్వలను మరికొంత కాలం కొనసాగించే అవకాశం ఉంటుంది. తాగునీటిని దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటున్నారు.
జూబ్లీహిల్స్ రోడ్ నెం.23లోని 8-2-293/82/A/350 చిరునామాలో పూర్ణిమ (CAN No. 061108905) అనే వినియోగదారు తాగునీటిని ఫ్లోర్ క్లీనింగ్‌కు వినియోగిస్తూ దుర్వినియోగం చేసినట్లు గుర్తించారు. దీంతో సంబంధిత వినియోగదారుకు రూ.20,000 జరిమానా విధించి వసూలు చేశారు.ప్రస్తుతం సింగూర్‌లోని నిల్వలు తగ్గుతున్న నేపథ్యంలో, ఒకవైపు వర్షాలపై ఆశలు, మరోవైపు గోదావరి ఫేజ్–2 నుంచి 40–50 MGD ప్రత్యామ్నాయ సరఫరా ప్రయత్నాలు జరుగుతున్నాయి.
2) హైదరాబాద్‌లో గణేశ్ సందడి.. ఈ ఏడాది స్పెషల్ ఏమిటంటే?
హైదరాబాద్‌లో గణేశ్ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నగరంలోని వివిధ ప్రాంతాల్లో భారీ విగ్రహాలు, ప్రత్యేక థీమ్‌లతో మండపాలు ఏర్పాటు చేశారు. ఖైరతాబాద్ నుంచి బేగంబజార్, ఓల్డ్ సిటీ, కోఠి, సికింద్రాబాద్ వరకు గణేశ్ మండపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. అయితే.. ఈసారి హైదరాబాద్ గణేశ్ ఉత్సవాల్లో ప్రత్యేకంగా కనిపిస్తున్నది భారీ విగ్రహాలతో పాటు థీమ్ మండపాలు.
ఖైరతాబాద్ బడా గణేశ్ ఈ ఏడాది 69 అడుగుల పంచముఖ సంకటహర మహాగణపతి రూపంలో దర్శనమిస్తున్నాడు. ప్రధాన విగ్రహానికి ఇరువైపులా 15 అడుగుల సోమనాథ్ జ్యోతిర్లింగం, కాళికామాత విగ్రహాలను ఏర్పాటు చేశారు. మరో ప్రత్యేకత ఏంటంటే.. ఈసారి విగ్రహాన్ని ప్లాస్టర్ ఆఫ్ పారిస్ లేకుండా సహజ మట్టి, గడ్డితో రూపొందించారు. ఎకో ఫ్రెండ్లీ రంగులను ఉపయోగించారు. ఖైరతాబాద్ మండపానికి ఈసారి భారీగా భక్తులు తరలివచ్చారు. ఇక బేగంబజార్, ఫీల్‌ఖానాలో యాలి గణేశ్, పహల్వాన్ గణేశ్, గోల్డ్ థీమ్ కుందన్ గణేశ్ వంటి ప్రత్యేక మండపాలు ఉన్నాయి. ఓల్డ్ సిటీలో 3D షో ప్రొజెక్షన్ గణేశ్, జంగిల్ థీమ్ గణేశ్, లాల్‌దర్వాజా సింహవాహిని గణేశ్, ధూల్‌పేట్ బప్పా వంటి మండపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
మరోవైపు, నగరంలోనే మరో ప్రత్యేక గణేశ్ విగ్రహం కూడా చర్చనీయాంశంగా మారింది. సీఎం రేవంత్‌రెడ్డి గణేశుడిని చేతుల్లో పట్టుకున్నట్టుగా రూపొందించిన విగ్రహాన్ని ఓ మండపంలో ఏర్పాటు చేశారు. ఈ మండపంలో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను కూడా థీమ్‌గా ప్రదర్శించారు. గోషామహల్ నియోజకవర్గం, అఘాపురా హబీబ్‌నగర్ - భోయిగూడ పరిసర ప్రాంతంలో ఈ మండపం వుంది.
ఇక మరో ప్రత్యేకత.. 35 అంగుళాల పంచలోహ గణేశ్ విగ్రహం. ఇందులో 3,83,800 అమెరికన్ డైమండ్స్‌ను పొదిగి, 24 క్యారెట్ల గోల్డ్ ప్లేటింగ్ చేశారు. ఈ విగ్రహం తయారీకి ఎనిమిది నెలలు పట్టినట్లు సమాచారం.
బౌరంపేట్ హనుమాన్ యూత్ అసోసియేషన్ ఆద్వర్యంలో వినాయక సంబరాలు అంబరాన్ని అంటాయి. హెలికాప్టర్ ద్వారా వినాయకుని విగ్రహంపై పూల వర్షం కురిపించారు. భౌరంపేట్ బొడ్రాయి వద్ద నిర్వహించిన గణనాథుడికి ఏర్పాటుచేసిన మండపపై ఉంచిన విగ్రహానికి పూజలు నిర్వహించిన అనంతరం హెలికాప్టర్ ద్వారా పూల వర్షం కురిపించడంతో స్థానికులు కేరింతలు కొట్టారు.
హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని కీర్తి రిచ్‌మండ్ గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్‌లో గణనాథుడి లడ్డూ వేలంలో శక్తిమాన్ బృంద సభ్యులు ఈ లడ్డూను రూ.1.01 కోట్లకు దక్కించుకున్నారు. గతేడాది ఇదే కమ్యూనిటీలో లడ్డూ రూ.2.31 కోట్లు పలికింది. వేలం అనంతరం గణనాథుడి విగ్రహాన్ని నిమజ్జనానికి తరలించారు.
గణేశ్ ఉత్సవాలకు మరో ప్రధాన ఆకర్షణ నిమజ్జన శోభాయాత్ర. సెప్టెంబర్ 25న జరగనున్న ప్రధాన నిమజ్జనం కోసం పోలీసులు, జీహెచ్‌ఎంసీ భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, క్రేన్లు, బారికేడ్లు, పారిశుద్ధ్యం వంటి ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈసారి నగరవ్యాప్తంగా సుమారు 25 వేల మంది పోలీసులను భద్రత కోసం మోహరిస్తున్నారు.
మొత్తంగా.. భారీ విగ్రహాలు, ప్రత్యేక థీమ్ మండపాలు, పంచలోహ–డైమండ్ గణేశ్, ఎకో ఫ్రెండ్లీ ఖైరతాబాద్ బడా గణేశ్, భారీ నిమజ్జన శోభాయాత్ర.. ఇవే 2026 హైదరాబాద్ గణేశ్ ఉత్సవాల్లో ప్రధాన హైలైట్స్‌గా నిలుస్తున్నాయి.
3) డేటింగ్ యాప్‌లో ఫ్రెండ్‌షిప్.. రూ.4.91 కోట్లు స్వాహా!
డేటింగ్ యాప్‌లో పరిచయమైన వ్యక్తులను నమ్మిన హైదరాబాద్‌కు చెందిన 27 ఏళ్ల లాయర్ భారీ సైబర్ మోసానికి గురయ్యాడు. ప్రైవేట్ చాట్స్, ఫొటోలతో బెదిరించిన నిందితులు.. బాధితుడి నుంచి ఏకంగా రూ.4.91 కోట్లు వసూలు చేశారు.డేటింగ్ యాప్‌లో పరిచయం ఏర్పడిన తర్వాత బాధితుడితో నిందితులు వ్యక్తిగతంగా చాటింగ్, వీడియో కాల్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సేకరించిన ప్రైవేట్ ఫొటోలు, చాట్స్‌ను బయటపెడతామని బెదిరింపులకు దిగారు.
పరువు, కుటుంబ గౌరవం దెబ్బతింటుందనే భయంతో బాధితుడు మొదట కొంత మొత్తాన్ని చెల్లించాడు. అయితే డబ్బులు పంపిన కొద్దీ నిందితుల డిమాండ్లు పెరిగాయి. చివరకు కుటుంబ సభ్యుల ఖాతాల్లోని డబ్బుతో పాటు.. తన ఫ్లాట్‌ను విక్రయించి వచ్చిన మొత్తాన్ని కూడా వారికి బదిలీ చేసినట్లు సమాచారం.
మొత్తం 241 లావాదేవీల్లో రూ.4.91 కోట్లు చెల్లించినా బెదిరింపులు ఆగకపోవడంతో బాధితుడు సైబర్ పోలీసులను ఆశ్రయించాడు.ప్రస్తుతం పోలీసులు బ్యాంకు లావాదేవీలు, ఫోన్ నంబర్లు, చాటింగ్ వివరాలను పరిశీలిస్తున్నారు. డేటింగ్ యాప్‌లలో పరిచయమైన వారికి వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు, సున్నితమైన సమాచారాన్ని షేర్ చేయవద్దని నిపుణులు సూచిస్తున్నారు. బెదిరింపులకు భయపడి డబ్బులు చెల్లించకుండా వెంటనే సైబర్ పోలీసులను ఆశ్రయించాలని సూచిస్తున్నారు.
“డేటింగ్ యాప్‌లలో పరిచయమయ్యే వ్యక్తులను పూర్తిగా నమ్మొద్దు. వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు, ప్రైవేట్ చాట్స్, సున్నితమైన సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ షేర్ చేయకండి.” అని సైబర్ క్రైంలో పి.హెచ్‌డి చేసిన డాక్టర్ తేజ పలు సూచనలు చేశారు.
“ఎవరైనా ప్రైవేట్ ఫొటోలు లేదా వీడియోలను బయటపెడతామని బెదిరించి డబ్బులు అడిగితే.. భయపడి డబ్బులు చెల్లించొద్దు. ఒక్కసారి డబ్బులు చెల్లిస్తే డిమాండ్లు మరింత పెరిగే అవకాశం ఉంది.”
“బ్లాక్‌మెయిల్ లేదా సైబర్ మోసానికి గురైతే వెంటనే సైబర్ పోలీసులను ఆశ్రయించాలి. చాట్స్, ఫోన్ నంబర్లు, బ్యాంక్ లావాదేవీలు వంటి ఆధారాలను డిలీట్ చేయకుండా భద్రపరచాలి.” అని తేజ ఫెడరల్‌తో చెప్పారు.
డేటింగ్ యాప్‌లలో అపరిచితులను నమ్మొద్దని.. వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేయొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. బ్లాక్‌మెయిల్‌కు గురైతే డబ్బులు చెల్లించకుండా వెంటనే పోలీసులను ఆశ్రయించాలని సూచిస్తున్నారు.
