అమీన్‌పూర్‌లో హైడ్రా యాక్షన్: అక్రమ ఆరు అంతస్తుల భవనం నేలమట్టం
x
భవనాన్ని కూలుస్తున్న హైడ్రా జేసీబీ (ఫొటో : ఎక్స్ / హైడ్రా పోస్టు)

అమీన్‌పూర్‌లో హైడ్రా యాక్షన్: అక్రమ ఆరు అంతస్తుల భవనం నేలమట్టం

రూ.15 వేల కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా


సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలంలోని ఐలాపురం గ్రామంలో ప్రభుత్వ భూములపై సాగిన అక్రమ నిర్మాణాలపై హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టింది. భారీ పోలీస్ బందోబస్తు మధ్య జేసీబీలతో ఆరు అంతస్తుల భవనం సహా గెస్ట్ హౌస్‌ను కూల్చివేస్తూ, ప్రభుత్వ భూములను రక్షించే దిశగా కీలక చర్యలు తీసుకుంది.

హైడ్రా భారీ ఆపరేషన్

అమీన్ పూర్ లో ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మించిన భారీ భవనాన్ని హైడ్రా జేసీబీలతో శనివారం కూల్చివేసింది. రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో కలసి హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టింది. ఐలాపురం తండాతో పాటు గ్రామంలో ఇళ్ల జోలికి వెళ్లకుండా హైడ్రా భారీ భవనంపై చర్యలు తీసుకుంది.పేదల ఇళ్ల జోలికి వెళ్లకుండా హైడ్రా ఆపరేషన్ చేపట్టడం మొదటిసారి.1998వ సంవత్సరం నుంచి కోర్టు స్టే ఆర్డర్ ఉన్నా నిర్మాణాలు చేసిన ముఖీం గెస్ట్ హౌస్ తో పాటు, అతని సోదరుడు అజీమ్ నిర్మించిన 6 అంతస్తుల భవనాన్ని హైడ్రా కూల్చివేసింది.




ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా

సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మండలం ఐలాపురం విలేజ్ లో మొత్తం 1263 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది.ఈ భూమిలో ఇప్పటికే చాలా నివాసాలు నిర్మించారు.ఆ నివాసాల జోలికి వెళ్లకుండా మిగిలి ఉన్న 860 ఎకరాల ప్రభుత్వ భూమినే హైడ్రా కాపాడింది. 863 ఎకరాల భూమి విలువ రూ.15 వేల కోట్లకు పైగా ఉంటుందని అంచనా. ఎలాంటి అనుమతులు లేకుండా అడ్వకేట్ ముఖీం సోదరుడు అజీమ్ 6 అంతస్తుల భవనాన్ని నిర్మించాడు. కూల్చివేసిన ఈ భవనంలో ఎవరూ నివాసం ఉండడం లేదని హైడ్రా అధికారులు చెప్పారు.కొంతమందిని ఆప్పటికప్పుడు అద్దెలకు దించి నివాసాలున్నట్టు భవన నిర్మాణ దారుడు చూపించాడు. భవనంలో ఉన్నవారిని ఖాళీ చేయించి ఆక్రమణలను తొలగించారు.

దశాబ్దాలుగా కొనసాగుతున్న ఆక్రమణలపై హైడ్రా చర్యలు ప్రభుత్వ భూముల పరిరక్షణకు కీలక మలుపుగా మారాయి. పేదల ఇళ్లను తాకకుండా అక్రమ భారీ నిర్మాణాలపై మాత్రమే దృష్టి పెట్టడం ఈ ఆపరేషన్ ప్రత్యేకతగా నిలిచింది. ఇకపై కూడా ఇలాంటి అక్రమాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని హైడ్రా అధికారులు హెచ్చరిస్తున్నారు.



Read More
Next Story