
ప్రతిపక్షాల ఆరోపణలకు హైడ్రా చెక్.. రూ.100కోట్ల ఆస్తులు సేఫ్
శాస్త్రిపురం కాలనీలో క్రీడామైదానంపై అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చి, స్థానికులకు ఉపశమనం కలిగించింది.
తనపై ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణలకు హైడ్రా చెక్ పెట్టింది. ఎంఐఎం అక్రమాస్తుల జోలికి హైడ్రా వెళ్లదని, కాంగ్రెస్-ఎంఐఎం మిత్రపక్షాలు కావడమే ఇందుకు కారణం అంటూ విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ విషయంపై హైడ్రాపై చాలా కాలంగా తీవ్ర ఆరోపణలు, విమర్శలు వస్తున్నాయి. అయితే తాజాగా వీటికి హైడ్రా చెక్ పెట్టింది. తమ దృష్టిలో పార్టీలకు ప్రాధాన్యం ఉండదని, ఆక్రమణలు జరిగితే తొలగిస్తామన్న మెసేజ్ ఇచ్చింది. ఈ క్రమంలోనే పాతబస్తీ మైలర్దేవుపల్లిలో హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టింది. అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకుంది. కోట్ల విలువైన క్రీడామైదానాన్ని కాపాడుతూ, ఐదు నిర్మాణదశలో ఉన్న భవనాలను కూల్చివేసింది.
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం శాస్త్రిపురం కాలనీలో బుధవారం ఉదయం ఈ ఆపరేషన్ జరిగింది. 188 ఎకరాల హుడా అనుమతి పొందిన లేఔట్‌లో క్రీడాస్థలంగా కేటాయించిన 6500 గజాల స్థలాన్ని ఆక్రమించినట్లు అధికారులు గుర్తించారు. లేఔట్ ప్రకారం ఇది ప్లే గ్రౌండ్‌గా ఉండాల్సి ఉన్నప్పటికీ, గత మూడు సంవత్సరాలుగా నోటరీ ఆధారంగా ప్లాట్లుగా అమ్మకాలు జరుగుతున్నట్లు తేలింది. ఎలాంటి అనుమతులు లేకుండానే నిర్మాణాలు చేపట్టినట్లు గుర్తించారు.
ఇప్పటికే జీహెచ్‌ఎంసీ నోటీసులు జారీ చేసి, 2024లో కూల్చివేతకు సంబంధించిన ఆదేశాలు కూడా ఇచ్చినప్పటికీ, నిర్మాణాలు ఆగలేదు. దీనిపై స్థానికులు ఫిర్యాదు చేయడంతో హైడ్రా అధికారులు GHMC, రెవెన్యూ శాఖలతో కలిసి స్థలాన్ని పరిశీలించారు. స్థలం క్రీడామైదానంగా కేటాయించబడినదని నిర్ధారించిన అధికారులు, నిర్మాణాలు నిలిపివేయాలని ముందే హెచ్చరించారు. అయినా పనులు కొనసాగడంతో బుధవారం ఉదయం చర్యలు చేపట్టారు.
ఈ ఆపరేషన్‌లో జీ ప్లస్ 3 స్థాయిలో నిర్మాణంలో ఉన్న ఐదు భవనాలతో పాటు రెండు చిన్న గదులను తొలగించారు. ఇప్పటికే నివాసం ఉన్న రెండు భవనాలను మాత్రం మినహాయించారు. దీంతో శాస్త్రిపురం కాలనీవాసులు ఊపిరి పీల్చుకున్నారు. ఫిర్యాదు చేసిన వెంటనే చర్యలు తీసుకోవడం పట్ల వారు సంతోషం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఆక్రమణలను అడ్డుకోవడానికి ప్రయత్నించినప్పుడు బెదిరింపులు ఎదురయ్యాయని వారు తెలిపారు. ఈ చర్యతో క్రీడామైదానం మళ్లీ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. అధికారులు తదుపరి చర్యలపై దృష్టి సారించారు.

