
అమీన్‌పూర్‌లో హైడ్రా దుమారం.. అక్రమ భవనాల కూల్చివేత
అమీన్‌పూర్ ఐలాపురంలో హైడ్రా భారీ చర్యలు చేపట్టి ఖాళీ ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుంది.
అమీన్‌పూర్‌లో అక్రమ కట్టడాలపై హైడ్రా పంజా విసిరింది. కోర్టు స్టేను తుంగలో తొక్కుతూ కట్టిన నిర్మాణాలను కూల్చివేసింది. అమీన్‌పూర్‌లో చేపట్టిన భారీ ఆపరేషన్‌లో భాగంగా ఒక గెస్ట్ హౌస్, ఒక ఆరు అంతస్తుల భవనాన్ని హైడ్రా అధికారులు భారీ బందోబస్తు మధ్య కూల్చివేశారు. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలం ఐలాపురం గ్రామంలో రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో కలిసి హైడ్రా ఈ ఆపరేషన్ నిర్వహించింది. గ్రామంలోని నివాసాలపై ప్రభావం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటూ, ఖాళీ ప్రభుత్వ భూములపై దృష్టి సారించింది.
ఐలాపురంలో మొత్తం 1263 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో ఇప్పటికే కొంతభాగంలో నివాసాలు ఏర్పడ్డాయి. ఆ ఇళ్లను తాకకుండా మిగిలిన 860 ఎకరాల భూమిని కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ భూమి విలువ సుమారు 15 వేల కోట్లకు పైగా ఉంటుందని అంచనా. కోర్టు స్టే ఆర్డర్ ఉన్నప్పటికీ ముకీమ్ నిర్మించిన గెస్ట్ హౌస్‌ను అధికారులు కూల్చివేశారు. అలాగే ఎలాంటి అనుమతులు లేకుండా అతని సోదరుడు అజీమ్ నిర్మించిన ఆరు అంతస్తుల భవనాన్ని కూడా తొలగించారు.
ఆ భవనంలో ఎవరూ నివాసం ఉండకపోయినా, కొంతమందిని అద్దెకు ఉంచి నివాసాలు ఉన్నట్టు చూపించే ప్రయత్నం జరిగిందని అధికారులు గుర్తించారు. తరువాత అక్కడ ఉన్న వారిని ఖాళీ చేయించి కూల్చివేత చేపట్టారు. తండా ప్రాంతం, గ్రామంలోని పేదల ఇళ్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా హైడ్రా చర్యలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఖాళీ స్థలాలను స్వాధీనం చేసుకునే ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తంగా, కోర్టు ఆదేశాలను అమలు చేస్తూ ప్రభుత్వ భూములను రక్షించే దిశగా ఈ చర్యలు కొనసాగుతున్నాయి.

