
చెరువుల అభివృద్ధికి హైడ్రా కార్యాచరణ ప్రణాళిక
లక్ష కోట్ల ఆస్తుల రక్షణే లక్ష్యం: 2026లో హైడ్రా దూకుడు
2 వేల ఎకరాల భూముల రక్షణకు హైడ్రా మాస్టర్ ప్లాన్
హైదరాబాద్ నగరాన్ని వరదల ముప్పు నుంచి, ప్రభుత్వ ఆస్తులను కబ్జాల నుంచి కాపాడే దిశగా హైడ్రా దూకుడు పెంచుతోంది. 2026 సంవత్సరంలో లక్ష కోట్ల విలువైన ఆస్తులను రక్షించడమే లక్ష్యంగా హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) భారీ కార్యాచరణకు సిద్ధమైంది.కబ్జాలపై కొరడా ఝళిపిస్తూ… చెరువులకు రక్షణ కవచం… పేదలకు భరోసా… ఇదే హైడ్రా 2026 రోడ్‌మ్యాప్.
హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) 2026వ సంవత్సరంలో లక్ష కోట్ల ఆస్తులను కాపాడటమే లక్ష్యంగా పెట్టుకుంది.2026వ సంవత్సరంలో హైడ్రా లక్షల కోట్ల విలువైన 2వేల ఎకరాల భూములను పరిరక్షించాలనే లక్ష్యంతో ప్రణాళిక రూపొందించింది. గత ఏడాది 1000 ఎకరాల్లో ఆక్రమణలను తొలగించి, ప్రభుత్వ భూములు, చెరువుల స్థలాలను కాపాడింది. ఈ ఏడాది డబుల్ లక్ష్యంతో ముందుకు సాగనుంది. దీంతోపాటు పేదల ఇళ్లను కూల్చకుండా చర్యలు తీసుకోవడంతోపాటు పెద్దల కబ్జాలపై భరతం పడతామని హైడ్రా చీఫ్ ఏవీ రంగనాథ్ ప్రకటించారు.
హైడ్రా దూకుడు
2026 వ సంవత్సరంలో హైడ్రా దూకుడు ప్రదర్శించనుంది.చెరువుల పరిరక్షణలో హైడ్రా మరింత దూకుడుగా వ్యవహరిస్తుందని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ప్రకటించారు.చెరువులు ఇకపై పిల్లలు, యువతకు పెద్దల ఆరోగ్యానికి క్రీడలకు ఆలవాలంగా మారుస్తామని ఆయన చెప్పారు. పర్యావరణ పరిరక్షణ, చెరువుల అక్రమణల తొలగింపుల్లో హైడ్రా ఇక ముందు కూడా దూకుడుగానే ముందుకు పోతుందని ఆయన పేర్కొన్నారు. చెరువుల్లో ఆక్రమణలు తొలగింపు ఒకటే తమ లక్ష్యం కాదని విషతుల్యంగా మారిన చెరువులను శుభ్రపరుస్తున్నామని, తద్వారా గుర్రపు డెక్క వంటి చెట్లు మొలవకుండా శుభ్రమైన నీరు చెరువులో ఉండే విధంగా చూస్తున్నామన్నారు.
పర్యావరణ హిత నగరంగా హైదరాబాద్
పర్యావరణ హితమైన నగరంగా హైదరాబాద్‌ను హైడ్రా తీర్చిదిద్దుతోందని హైడ్రా అడిషనల్ డైరెక్టర్ వర్ల పాపయ్య చెప్పారు. ప్రభుత్వ భూములు, పార్కులు, చెరువులు, నాలాలు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలను కాపాడుకున్నప్పుడే,ప్రకృతి వైపరీత్యాలను నియంత్రించగలమని ఆయన పేర్కొన్నారు. పార్కులను కాపాడి పచ్చని వాతావరణాన్ని, చెరువులు, నాలాలను రక్షించి వరదలను నియంత్రిస్తున్నామన్నారు.
1000 ఎకరాల్లో కబ్జాల తొలగింపు
ఇప్పటివరకు హైడ్రా పలు ఆక్రమణలు తొలగించి వెయ్యి ఎకరాలకు పైగా ప్రభుత్వ ఆస్తులను రక్షించింది.హైడ్రా హైదరాబాద్‌లో 5,800 ఫిర్యాదులు పరిష్కరించింది. 12 సరస్సులను పునరుద్ధరించి, 200 ఎకరాల భూమి తిరిగి స్వాధీనం చేసుకుంది. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పరిధిలోని రాయసముద్రం(రామచంద్రాపురం) చెరువును సర్వాంగ సుందరంగా అభివృద్ధి చేస్తామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ చెప్పారు.రాయసముద్రం చెరువు సుమారు 120 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఈ చెరువును కేవలం ఒక నీటి వనరుగానే కాకుండా, స్థానికులకు ఆహ్లాదాన్ని పంచే ఒక చక్కని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామన్నారు. వాకింగ్ ట్రాక్, చిన్నారుల కోసం ప్లే ఏరియా, పార్కులు, అన్ని వయసుల వారు వ్యాయామం చేయడానికి పరికరాలు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. వలస పక్షులకు నిలయంగా ఉన్న ఈ చెరువును పూర్తి స్థాయిలో కాపాడుకోవాల్సన అవసరం ఉందన్నారు.
హైడ్రా పేదల ఇళ్లు కూల్చదు : ఏవీ రంగనాథ్
హైడ్రా అధికారులు వచ్చారంటే ఇళ్లు కూల్చివేస్తారని ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని రంగనాథ్ స్పష్టం చేశారు. ఇప్పటికే నిర్మించుకున్న ఇళ్ళ విషయంలో హైడ్రా జోక్యం చేసుకోదని, కేవలం నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్న ఆక్రమణలు, ఇతర అడ్డంకులను తొలగించి ప్రజలందరికీ మేలు చేయడమే తమ లక్ష్యమని చెప్పారు.పేదల ఇళ్లను హైడ్రా కూల్చదని అదే సమయంలో పేదలను ముందు పెట్టి ఆక్రమణలు చేసే పెద్దలను వదిలిపెట్టే సమస్య లేదని హైడ్రా కమిషనర్ చెప్పారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆక్రమణలు తొలగించాల్సి వస్తే..ప్రభుత్వం ద్వారా వారికి పరిహారం అందేలా చూస్తామన్నారు.ఇళ్ళు కూల్చివేసి లేదా ప్రజలకు ఇబ్బంది కలిగించకుండా అభివృద్ధి పనులు కొనసాగిస్తామని ఆయన అన్నారు.
భవన వ్యర్థాలు పారబోస్తే కఠిన చర్యలు
హైదరాబాద్ నగరంలోని చెరువుల ఫుల్ ట్యాంక్ లెవెల్, బఫర్ జోన్లలో భవన వ్యర్థాలను పారబోస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ హెచ్చరించారు. మేళ్ల చెరువులో వ్యర్థాలను వెంటనే తొలగించాలని రాజుయాదవ్ అనే బిల్డరును ఆదేశించారు. గండిపేట చెరువులో వ్యర్థాలు పారబోసిన హిమాయత్ నగర్ గ్రామానికి చెందిన ఖుర్షిద్ ను వాటిని తొలగించాలని కోరారు. బుల్కాపూర్ నాలా ఆక్రమణలను తొలగించాలని హైడ్రా ఆదేశించింది.
సరస్సుల సంరక్షణే ధ్యేయం
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చెరువులు, కుంటలు, నాలాలు, పార్కులు,క్రీడామైదానాలు, ఫుట్ పాత్ లు, ప్రభుత్వ స్థలాలను కాపాడటమే లక్ష్యంగా హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా)ని 2024 జులై 19వతేదీన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. హైడ్రాను ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, డిజాస్టర్ మేనేజ్ మెంట్, లాజిస్టిక్ సపోర్టు విభాగాలుగా విభజించింది.భారీవర్షాలు, వరదలు సంభవించినపుడు సహాయ పునరావాస కార్యక్రమాలు చేపట్టడానికి హైడ్రా ఆధ్వర్యంలోనే డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ను ఏర్పాటు చేశారు. ఏసీపీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో హైడ్రా పోలీసుస్టేషనులో ఆరుగురు ఇన్ స్పెక్టర్లు, 12 మంది ఎస్ఐలు, 30 మంది పోలీసు కానిస్టేబుళ్లతో ప్రత్యేక పోలీసుస్టేషన్ ను ఏర్పాటు చేశారు.
మొత్తంగా 2026లో లక్ష కోట్ల ఆస్తుల పరిరక్షణ లక్ష్యంతో హైడ్రా దూకుడు పెంచుతోంది. చెరువుల రక్షణ, అక్రమణల తొలగింపు, పర్యావరణ హిత హైదరాబాద్ నిర్మాణం దిశగా చేపడుతున్న చర్యలు నగర భవిష్యత్తుకు కీలకంగా మారనున్నాయి.పేదల ఇళ్లకు భద్రత, చెరువులకు రక్షణతో హైదరాబాద్‌కు కొత్త దిశను చూపనుంది.
Next Story

