కేజ్రీవాల్‌కు ఇలా చేయొద్దని నేను అప్పుడే చెప్పా: అన్నా హజారే
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టుపై సామాజిక కార్యకర్త అన్నా హజరే స్పందించారు. తాను చెప్పిన మాటలను పెడచెవిన పెట్టడం వల్లే ఇప్పుడు అరెస్టు దాకా వచ్చిందన్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గురువారం రాత్రి అరెస్టు చేసింది. ఆయన అరెస్టుపై సామాజిక కార్యకర్త అన్నా హజారే తనదైన శైలిలో స్పందించారు. గతంలో తనతో కలిసి మద్యపాపానికి వ్యతిరేకంగా మాట్లాడిన కేజ్రీవాల్ ఇప్పుడు లిక్కర్ పాలసీలో అరెస్ట్ కావడం బాధగా ఉందన్నారు. కేజ్రీవాల్‌ను అటువంటి విధానాన్ని రూపొందించకుండా ఉండమని దశాబ్దం క్రితం చెప్పానని ఆయన పేర్కొన్నారు.
“మా పని ఎక్సైజ్ పాలసీ చేయడం కాదని నేను కేజ్రీవాల్‌కు చెప్పాను. మద్యం చెడ్డదని చిన్న పిల్లవాడికి కూడా తెలుసు. ఈ (ఎక్సైజ్ పాలసీ) ఇష్యూ నుంచి దూరంగా ఉండమని నేను కేజ్రీవాల్‌ను కోరాను. కానీ నా మాట లెక్కచేయలేదు. ముందుకు సాగాడు. ”అని హజారే మహారాష్ట్రలోని తన గ్రామమైన రాలేగాన్ సిద్ధిలో హాజరే అన్నారు.
“ఎక్కువ డబ్బు సంపాదిస్తానని అనుకున్నాడు. అందుకే ఈ పాలసీ చేసాడు. నేను బాధపడి, అతనికి రెండుసార్లు రాసాను. ఇప్పుడు తన పనుల వల్లే అరెస్ట్ అయ్యాడు. ఏమీ చేయకపోతే, కేజ్రీవాల్‌ను అరెస్టు చేసేవారు కాదు. ఇప్పుడు చట్టం తన పని తాను చేసుకుంటుంది’’ అని హజారే అన్నారు.
గురువారం రాత్రి ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన తర్వాత కేజ్రీవాల్ సెంట్రల్ ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో రాత్రి గడిపారు.