
ఐఏఎస్ కొడుకు డ్రగ్ పాజిటివ్
ఆ 8 మందిలో ఐఏఎస్ అధికారి కొడుకు ఉండటమే ఆశ్చర్యం
శుక్రవారం హైదరాబాద్, గచ్చిబౌలి పోలీసుస్టేషన్ పరిధిలో ఈగల్ బృందం కొన్ని పబ్బుల్లో ఆకస్మికంగా దాడులు చేసింది. ఈ దాడుల్లో 64 మందిని అదుపులోకి తీసుకుని పరీక్షలు చేయిస్తే అందులో 8 మంది డ్రగ్ పాజిటివ్ అని తేలింది. 64మందికి పరీక్షలు చేయిస్తే 8 మందికి డ్రగ్ పాజిటివ్ అని తేలటంలో గొప్ప విషయం ఏమీలేదు. కాకపోతే ఆ 8మందిలో ఐఏఎస్ అధికారి కొడుకు ఉండటమే ఆశ్చర్యం. డ్రగ్స్ విషయంలో రాజకీయ నేతలు, ఉన్నతాధికారులు, సెలబ్రిటీలు, వ్యాపార, పారిశ్రామికవేత్తల పిల్లల నుండి సామాన్యుల వరకు చాలామంది మత్తుకు బానిసలైపోతున్న విషయం అందరికీ తెలిసిందే.
ఒకవైపు డ్రగ్స్ ను అరికట్టేందుకు ప్రభుత్వం నానా అవస్తలు పడుతోంది. నియంత్రణలో భాగంగానే ఈగల్ అనే సరికొత్త వ్యవస్ధను ఏర్పాటుచేసింది. ఈగల్ బృందం తన నెట్ వర్క్ ను బాగా విస్తరించుకుని పదేపదే సమాచారం అందిన చోట్లలో ఆకస్మిక దాడులు చేసి అనేకమందిని అదుపులోకి తీసుకుంటోంది. ఈమధ్యనే మొయినాబాద్ లోని ఒక ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ మాజీ ఎంఎల్ఏ పైలెట్ రోహిత్ రెడ్డితో పాటు మరికొందరిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. పార్టీలోని 12 మందిని అదుపులోకి తీసుకుని డ్రగ్ టెస్ట్ చేయిస్తే అందులో రోహిత్ తో పాటు మరో ఐదుగురికి పాజిటివ్ రిపోర్టు వచ్చిన విషయం గుర్తుండే ఉంటుంది.
ప్రభుత్వ పాలనలో ఐఏఎస్ అధికారుల పాత్ర చాలా కీలకమైనదని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. అలాంటి కీలకమైన బాధ్యతల్లో ఉన్న ఒక మహిళా ఐఏఎస్ అధికారి కొడుకు కూడా ఈరోజు ఈగల్ జరిపిన దాడుల్లో డ్రగ్స్ తీసుకుంటే దొరికాడంటే వీళ్ళని ఏమనాలి ? ఐఏఎస్ కొడుకు డ్రగ్స్ వాడుతు దొరికాడన్న విషయాన్ని ఈగల్ బృందం ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది లేనిది తెలీలేదు. సదరు మహిళా ఐఏఎస్ అధికారి ఎవరనే విషయం కూడా గోప్యంగానే ఉంది.

