శ్రీలంక క్రికెట్ జట్టుకి ఫుల్‌ జోష్
x
శ్రీలంక ఫ్యూచర్ బోర్డు

శ్రీలంక క్రికెట్ జట్టుకి ఫుల్‌ జోష్

శ్రీలంక క్రికెట్ జట్టుకు భారీ ఊరట లభించింది. దీంతో శ్రీలంక క్రికెట్ బోర్డు తో పాటు పూర్తి జట్టంతా ఫుల్‌ జోష్‌లో ఉంది


శ్రీలంక క్రికెట్‌కు భారీ ఊరట లభించింది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌ (ఐసీసీ) ఆ జట్టుపై ఉన్న నిషేధాన్ని ఎత్తి వేసింది. నిషేధం ఎత్తివేత తక్షణమే అమల్లోకి వస్తుందని ఐసీసీ ఆదివారం (జనవరి 28) ప్రకటించింది. సభ్య దేశంగా ఉండి బాధ్యతల ఉల్లంఘణకు పాల్పడటంతో పాటు బోర్డు అంతర్గత వ్యవహారాల్లో మితిమీరిన రాజకీయ జోక్యాన్ని సహించని ఐసీసీ నవంబర్‌ 10న శ్రీలంక క్రికెట్‌ బోర్డుపై (ఎస్‌ఎల్‌సీ) నిషేధాన్ని విధించింది.

లంక క్రికెట్‌ బోర్డు స్వయంప్రతిపత్తిని కోల్పోయి, స్థానిక రాజకీయ నాయకుల చేతుల్లో పావుగా మారి అవినీతి, నిధుల దుర్వినియోగానికి పాల్పడిందని ఆ దేశ ఆడిటర్‌ జనరల్‌ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఐసీసీ ఎస్‌ఎల్‌సీపై నిషేధం విధించింది. వన్డే వరల్డ్‌కప్‌ 2023 అనంతరం షమ్మీ సిల్వ నేతృత్వంలోని శ్రీలంక క్రికెట్‌ బోర్డును ఐసీసీ రద్దు చేసింది. ఎస్‌ఎల్‌సీపై నిషేధం అమల్లో ఉన్న నేపథ్యంలో ఆ దేశంలో జరగాల్సిన అండర్‌-19 వరల్డ్‌కప్‌ 2024 సౌతాఫ్రికాకు తరలించింది.

బోర్డు రద్దు అనంతరం రెండు నెలలపాటు పరిస్థితిని సమీక్షించిన ఐసీసీ తాజాగా సమావేశమై నిషేధాన్ని ఎత్తి వేసింది. ఎస్‌ఎల్‌సీలో ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని సంతృప్తి వ్యక్తం చేస్తూ బ్యాన్‌ను ఎత్తి వేస్తున్నట్లు ఐసీసీ ప్రకటించింది. ఇదిలా ఉంటే, ప్రస్తుతం శ్రీలంక క్రికెట్‌ జట్టుకు ఎలాంటి అంతర్జాతీయ కమిట్‌మెంట్స్‌ లేకపోవడంతో ఆ దేశ ఆటగాళ్లు విదేశీ లీగ్‌ల్లో బిజీగా ఉన్నారు. ఇటీవలే ఆ జట్టు మూడు ఫార్మాట్లకు వేర్వేరు కెప్టెన్లను ఎంపిక చేసింది.

Read More
Next Story