‘‘ఒక ఖమేనీ పోతే వెయ్యి మంది పుడతారు’’
x
జమ్మూకశ్మీర్ లో నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్న షియాలు

‘‘ఒక ఖమేనీ పోతే వెయ్యి మంది పుడతారు’’

భారత్ లో షియాల నిరసన


Click the Play button to hear this message in audio format

ఇరాన్ సుప్రీంలీడర్, షియాల ఆధ్యాత్మిక మత గురువు అయతుల్లా అలీ ఖమేనీ హత్య తరువాత ఆదివారం వేలాది షియాలు భారత్ అంతటా నిరసన ప్రదర్శనలకు దిగారు. ముఖ్యంగా జమ్మూకశ్మీర్ లోని శ్రీనగర్ వీధులలో ఖమేనీ చిత్రపటాలు, ఇరాన్ జాతీయ జెండాలు తీసుకుని ర్యాలీ నిర్వహించారు.

సోనావారి, బందీపోరా, బారాముల్లాలో కూడా నిరసనకారులు ప్రదర్శనలు జరిగాయి. షియా సంప్రదాయం ప్రకారం వారంతా నల్ల జెండాలు, నల్ల బట్టలతో నౌహ అనే మతాచారాలను నిర్వహించారు. అయితే జమ్మూకశ్మీర్ లో నిర్వహించిన ప్రతి ర్యాలీ శాంతియుతంగానే జరిగింది.
యూపీ రాజధాని లక్నోలోనూ నిరసనకారులు ప్రదర్శనలు చేశారు. ఇక్కడ వీరు అమెరికా- ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘‘వారు చర్చలతో మోసం చేస్తూనే ఉన్నారు. యుద్ధం గురించి బెదిరించారు. కానీ మా నాయకుడు భయపడలేదు. తలవంచలేదు. ఒక ఖమేనీ పోతే, వెయ్యి మంది ఖమేనీలు వస్తారు, ట్రంప్ గెలవలేరు’’ అని నిరసనకారులు నినాదాలు చేశారు. ప్రపంచం మౌనంగా ఉన్నప్పుడూ పాలస్తీనాలో జరిగిన హత్యలకు వ్యతిరేకంగా ఖమేనీ తన స్వరాన్ని వినిపించినందుకే అమెరికా, ఇజ్రాయెల్ కలిసి తమ నాయకుడిని హతమార్చాయని వారు ఆరోపించారు.
‘‘ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని అమెరికా చంపేసింది. వారిని ప్రపంచకోర్టులో విచారించి దోషులుగా ప్రకటించాలి. అమెరికా ఏదీ కావాలంటే అది చేస్తుంది. ఎప్పుడూ కావాలంటే అప్పుడు చేస్తుంది’’ అని ఆల్ ఇండియా ఇమామ్ అసోసియేషన్ అధ్యక్షుడు సాజిద్ రషీద్ అన్నారు.
ఢిల్లీలోని షియా జామా మసీద్ ఇమామ్ మౌలానా మొహ్మద్ అలీ మెహ్సిన్ తక్వీ మాట్లాడుతూ.. ‘‘ఒక దేశం న్యాయం, సార్వభౌమత్వం సమర్థించే ప్రతి వ్యక్తి నేడు విచారంతో ఉన్నారు. ప్రపంచం అధ్వాన్నమైన రోజులను చూస్తోంది. ఏ దేశ అధ్యక్షుడిని అయినా అపహరించవచ్చు. ఏ దేశ నాయకత్వాన్ని అయిన బాంబులతో చంపవచ్చు. అది నేడు ఇరాన్, రేపు సౌదీ, తరువాత టర్కీ కావచ్చు’’ అని అన్నారు.
ఖమేనీ మరణవార్తతో ఢిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయం తన జాతీయ జెండాను అవనతం చేసింది. జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ఈ దాడులకు ఖండించారు.

దాడుల తరువాత ఏం జరిగింది..

ఫిబ్రవరి 28 నుంచి అమెరికా ‘ఆపరేషన్ ఎపిక్ ప్యూరీ’ పేరుతో, ఇజ్రాయెల్ ‘ఆపరేషన్ లయన్ రోర్’ పేరుతో ఇరాన్ పై దాడులు ప్రారంభించాయి. ఆదివారం తెల్లవారుజామున ఖమేనీ ఉన్న భవనంపై ఇవి క్షిపణుల వర్షం కురిపించాయి. దీనితో ఆయన మరణించారు.
ఈ విషయాన్ని ఆ దేశ మీడియా కూడా అధికారికంగా ధృవీకరించింది. ఆయన మృతితో ఇరాన్ అంతటా 40 రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించారు. తరువాత ఇరాన్ దళాలు ప్రతీకారదాడులకు దిగాయి. గల్ఫ్ లోని 27 అమెరికా వైమానిక స్థావరాలపైకి క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించారు.
Read More
Next Story