సహకరించకపోతే జనాలకు జైలేనా ?
x

సహకరించకపోతే జనాలకు జైలేనా ?

జనగణనలో ఎన్యుమరేటర్లు అడిగే ప్రశ్నలకు ప్రజలందరు తప్పనిసరిగా సమాధానాలు చెప్పాల్సిందే అని రాష్ట్రప్రభుత్వం ఒక ఉత్తర్వు జారీచేసింది


రాను రాను ప్రభుత్వాల తీరు మరీ విచిత్రంగా తయారవుతోంది. ప్రజాస్వామ్యం ముసుగులో నియంతృత్వ పాలన జరుగుతోందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. తాను అనుకున్నదానికి ప్రజలు సహకరించకపోతే నిర్బంధించి అయినా సరే అనుకున్నది చేయాలనే పట్టుదల ప్రభుత్వాల్లో పెరిగిపోతోంది. దీనికి తాజా ఉదాహరణ ఏమిటంటే వచ్చేఏడాది ప్రారంభమవబోతున్న జనగణనలో ఎన్యుమరేటర్లు అడిగే ప్రశ్నలకు ప్రజలందరు తప్పనిసరిగా సమాధానాలు చెప్పాల్సిందే అని రాష్ట్రప్రభుత్వం ఒక ఉత్తర్వు జారీచేసింది. జనగణనకు సంబంధించి ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాల ప్రకారం ఎన్యుమరేటర్లు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పటానికి ఇంటివాళ్ళు నిరాకరిస్తే వెయ్యి రూపాయల జరిమాన పడుతుంది.

అలాగే తప్పుడు సమాచారం ఇచ్చినట్లు క్రాస్ వెరిఫికేషన్లో తేలితే మూడేళ్ళు జైలుశిక్ష ఖాయం. ఎన్యుమరేటర్ల విధులను అడ్డుకున్నా, వాళ్ళకు సహకరించకపోయినా జరిమానా, జైలుశిక్ష తప్పదని మార్గదర్శకాల్లో ప్రభుత్వం స్పష్టంచేసింది. కేంద్రప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాలను రాష్ట్రప్రభుత్వం యథాతధంగా అన్నీ శాఖల అధిపతులకు పంపింది. ఎన్యుమరేటర్ల సర్వే, ప్రశ్నలు, సమాధానాలు ఇవ్వటం తదితరాలపై ప్రజలందరినీ చైతన్యం చేయాలని రాష్ట్రప్రభుత్వం వివిధ శాఖాధిపతులను ఆదేశించింది.

సంప్రదాయాలు, ఆచారాలు, మత ధర్మాల ప్రకారం భర్తల పేర్లు చెప్పకూడదని ఎవరైనా మహిళలు అన్నా, సర్వేకి సహకరించకపోయినా జరిమానా, జైలుశిక్ష తప్పదు. ప్రభుత్వాలు విధానాలను రూపొందించుకోవటానికి, నియోజకవర్గాల పునర్విభజనకు, పంచాయతీ, ఇతర స్ధానిక సంస్ధల వార్డులు, డివిజన్ల విభజనకు జనగణన సమాచారమే ఆధారమవుతుంది. ప్రజలు సర్వేలో తప్పుడు సమాచారం ఇవ్వకుండా, తమకు తెలిసిన పక్కా సమాచారాన్ని ఇవ్వకుండా దాచిపెట్టకూడదని చెప్పింది. ఎన్యుమరేటర్లను ఇళ్ళల్లోకి రానివ్వాలని, అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పాల్సిందే అని ప్రభుత్వం స్పష్టంచేసింది.

ఒకవైపే వ్యక్తిగత, కుటుంబ సమాచారాన్ని పంచుకోవటం కుటుంబాల ఇష్టమని చెబుతున్న ప్రభుత్వాలు మరోవైపు నిర్బంధంగా అయినా వివరాలు సేకరించాలని సర్క్యులర్ జారీచేయటమే విచిత్రంగా ఉంది. పైగా సర్వేలో సహకరించని వారికి జరిమానా, 3 ఏళ్ళు జైలుశిక్ష అని హెచ్చరించటం ఏమిటో జనాలకు అర్ధంకావటంలేదు. ప్రభుత్వాల నుండి సంక్షేమపథకాలు అందుకుంటున్న వారు కచ్చితంగా తమ కుటుంబాల వివరాలను ఇచ్చి తీరాల్సిందే అనటంలో అర్ధముంది. అంతేకాని ఎలాంటి పథకాలు అందుకోని కుటుంబాలు కూడా ఎన్యుమరేటర్లు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పతీరాల్సిందే నిర్బంధించటమే ఆశ్చర్యంగా ఉంది. సహకరించకపోతే జైలుశిక్ష ఖాయమని బెదిరించటం మరీ విచిత్రంగా ఉంది.

Read More
Next Story