అధికారంలోకి వస్తే రైతుల డిమాండ్లు పరిష్కరిస్తాం: రాహుల్
తాము అధికారంలోకి వస్తే రైతుల డిమాండ్లను పరిష్కరిస్తామన్నారు రాహుల్ గాంధీ. పంటలకు కనీస మద్దతు ధరకి చట్టపర హామీ ఇస్తుందని హామీ ఇచ్చారు.
తాము అధికారంలోకి వస్తే రైతుల దీర్ఘకాలిక డిమాండ్లను పరిష్కరిస్తామన్నారు రాహుల్ గాంధీ. పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి)కి చట్టపర హామీ ఇస్తుందని ఏఐసీసీ మాజీ చీఫ్ హామీ ఇచ్చారు. తన 'భారత్ జోడో న్యాయ్ యాత్ర'లో భాగంగా బీహార్‌లోని రోహతాస్‌లో ఏర్పాటు చేసిన రైతుల సమావేశం 'కిసాన్ న్యాయ్ పంచాయితీ'ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. రైతులు తమ పంటలకు లాభదాయక ధరలను పొందడం లేదన్నారు. గతంలో తాము రైతులకు అండగా నిలిచామని, భవిష్యత్తులో కూడా వారి పక్షాన ఉంటామని భరోసా ఇచ్చారు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధ హామీతో సహా రైతుల డిమాండ్లను ఆమోదించాలని.. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు సంయుక్త కిసాన్ మోర్చా (SKM) శుక్రవారం 'భారత్ బంద్'కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
పంజాబ్‌కు చెందిన రైతులు మంగళవారం 'ఢిల్లీ చలో' మార్చ్‌ను ప్రారంభించారు. ఢిల్లీ, హర్యానా మధ్య శంభు, ఖనౌరీ సరిహద్దు వద్ద భద్రతా సిబ్బంది వారిని అడ్డుకున్నారు. అప్పటి నుంచి రైతులు అక్కడే మకాం వేశారు. రైతుల ఆందోళన శుక్రవారం నాలుగో రోజుకు చేరింది.
రక్షణ శాఖకు కేటాయించిన బడ్జెట్‌లోని నిధులలో ఓ పారిశ్రామిక వేత్త జేబులోకి వెళ్తున్నాయని రాహుల్ గాంధీ ఆరోపించారు.
కేంద్ర ప్రభుత్వం "సైన్యాన్ని అగ్నివీర్, రెగ్యులర్ అని రెండు వర్గాలుగా విభజించిందని, అగ్నివీర్ గాయపడినా లేదా చనిపోయిన ఆ కుటుంబానికి తగిన పరిహారం అందదన్నారు. ఈ వివక్ష ఎందుకో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ 'భారత్ జోడో న్యాయ్ యాత్ర'లో పాల్గొన్నారు. మెల్లగా కదులుతున్న స్పోర్ట్స్ యుటిలిటీ వాహనంలో యాదవ్, గాంధీ ప్రయాణిస్తూ కనిపించారు. ఈ రోజు (ఫిబ్రవరి 16) ఉదయం ససారమ్‌లోని పార్టీ జిల్లా కార్యాలయం నుంచి తిరిగి ప్రారంభమైన న్యాయ్ యాత్ర సాయంత్రానికి కైమూర్ జిల్లాలోని మోహనియా మీదుగా ఉత్తరప్రదేశ్‌లోకి ప్రవేశిస్తుంది. జనవరి 14న మణిపూర్‌లో ప్రారంభమైన 'భారత్ జోడో న్యాయ్ యాత్ర' 67 రోజుల్లో 6,713 కిలోమీటర్లు, 15 రాష్ట్రాల్లోని 110 జిల్లాల గుండా ప్రయాణించి మార్చి 20న ముంబైలో ముగుస్తుంది.