
కుంభమేళాలో స్నానం చేస్తున్నారా, అయితే జాగ్రత్తగా ఉండాల్సిందే!
కుప్పలు తెప్పలుగా తేలుతున్న మలమూత్రాలు.. కుళ్లిన ఫలపుష్పాలు, పులిసికంపు కొడుతున్న ఆహార పదార్థాలు.. మరోపక్క లెక్కకు మిక్కిలి పవిత్రస్నానాలు చేసే భక్తులు..
ఉత్తర ప్రదేశ్ ప్రయాగరాజ్ లో జరుగుతన్న మహాకుంభమేళాలో స్నానాలు చేసిన భక్తుల సంఖ్య త్వరలో సుమారు 60 కోట్లకు చేరుతుంది. ఇప్పటికే 52 కోట్ల మంది స్నానాలు చేసినట్టు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం లెక్కలు చెబుతోంది. ఇలా భక్తుల తాకిడి పెరిగే కొద్ది ప్రయాగ్ రాజ్ త్రివేణీ సంగమంలోని నీళ్లు స్నానానికి పనికి రావని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (CPCB) తేల్చింది. ఈమేరకు రిపోర్ట్ ను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ)కి అందజేసింది.
సీపీసీబీ రిపోర్ట్ చదివితే ఒళ్లు గగుర్పాటు కల్పించే నిజాలు బయటపడుతున్నాయి. ఎటుచూసినా కుప్పలు తెప్పలుగా తేలుతున్న మానవ మలమూత్రాలు.. ఇసుక తిన్నెలపై కుళ్లిన పూలదండలు, పులిసికంపు కొడుతున్న ఆహార పదార్థాల వ్యర్థాలు.. నీటిపై తేలియాడుతున్న చింకిపాతలు.. మరోపక్క లెక్కకు మిక్కిలి పవిత్రస్నానాలు చేసే భక్తులు..
ఏది ఏమైనా ప్రస్తుతం త్రివేణి సంగమం తీవ్రమైన కాలుష్యాన్ని ఎదుర్కొంటోంది. ప్రభుత్వ సంస్థలు నిర్వహించిన పరిశోధనల్లో నీటిలో ప్రమాదకర స్థాయిలో ‘ఫీకల్ కాలిఫార్మ్’ బాక్టీరియా ఉందని గుర్తించారు. అనుమతించదగిన హద్దును మించిపోయింది.
ఫీకల్ కాలిఫార్మ్ బాక్టీరియా అంటే ఏమిటి?
ఫీకల్ కాలిఫార్మ్ బాక్టీరియా ఇదో సూక్ష్మజీవి. మనుషుల ప్రేగుల్లో ఉంటుంది. మూత్రవిసర్జన లేదా మలవిసర్జన ద్వారా నీటిలో కలుస్తాయి. నీటి కాలుష్య స్థాయిని అంచనా వేసే సూచికలుగా దీన్ని ఉపయోగిస్తారు. ఇవి నీటిలో ఉంటే చాలా ప్రమాదకరమైన జబ్బులు వచ్చే అవకాశం ఉంది. నీటి నాణ్యతను పరీక్షించేందుకు, ఫీకల్ కాలిఫార్మ్ స్థాయిని విశ్లేషిస్తారు. దీని స్థాయిని బట్టి ఆ నీరు తాగడానికి, స్నానానికి, ఈతకు, లేదా వినోదాత్మక కార్యకలాపాలకు పనికి వస్తుందా లేదా అనేది నిర్దారిస్తారు.
ఫీకల్ కాలిఫార్మ్ వల్ల కలిగే ప్రమాదం
CPCB నివేదిక ప్రకారం, మహా కుంభమేళా జరిగే గంగానదిలో ఫీకల్ కాలిఫార్మ్ స్థాయి 2,500 యూనిట్ల (100 మిల్లీలీటర్లకు)కు మించిపోయింది. ఈ 2,500 యూనిట్ల లోపు ఉంటే దాన్ని సురక్షిత పరిమితి అంటుంటారు. ఇప్పుడీస్థాయి మించిపోవడం వల్ల గంగానదిలో స్నానం చేసే భక్తులకు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది.
స్పందించని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం..
ప్రయాగరాజ్‌లో స్నానానికి కోట్లాది మంది యాత్రికులు తరలివస్తుండటంతో, నీటి ద్వారా వ్యాపించే వ్యాధుల ప్రమాదం పెరిగింది. పైగా, సమీప ప్రాంతాల నుండి శుద్ధి చేయని కాలుష్యనీరు, మానవ మలమూత్రాలు నేరుగా నదిలోకి చేరడంతో ఈ పరిస్థితిని మరింత దిగజార్చుతోంది. దీంతో త్రివేణి సంగమ ప్రాంతంలో నీటి నాణ్యత దారుణంగా పడిపోయింది. మురుగుతో నీరు కలుషితం అయిపోతోంది. ఇక్కడి నీటి కాలుష్యం ప్రాథమిక ప్రమాణాల స్థాయిని మించిపోయి స్నానానికి అనుకూలం కాని విధంగా మారిపోయింది. నీటిలో ఫీకల్ కోలీఫామ్ బ్యాక్టీరియా స్థాయిని మించి పెరిగిపోయిందని నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్జీటీ)కు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) ఓ నివేదిక ద్వారా ఇటీవల తెలిపింది. ఈ పరిస్థితిపై ఎన్జీటీ ధర్మాసనం సీపీసీబీ నివేదికను సమీక్షించి ఆందోళన వ్యక్తం చేసింది. కాలుష్య నియంత్రణ చర్యలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని తాము కోరినా స్పందించని ఉత్తరప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి (యూపీపీసీబీ)పై ఎన్జీటీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ కేసులో తదుపరి విచారణకు యూపీపీసీబీ సభ్య కార్యదర్శితో పాటు ఇతర అధికారులు పాల్గొనాలని ఆదేశించింది.
కాగా, త్రివేణి సంగమంలో నీటి నాణ్యతపై అడిషనల్ కలెక్టర్ వివేక్ చతుర్వేది వివరణ ఇచ్చారు. పుణ్య స్నానాలకు వీలుగా నదిని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తున్నామని తెలిపారు. అన్ని ఘాట్లలో పీసీబీ బృందం ప్రతిరోజు నీటి పరీక్షలు చేస్తోందని, నీటి నాణ్యత నియంత్రణలోనే ఉందని చెప్పారు. పువ్వులు, కొబ్బరికాయలు, ఇతరత్రా పూజా సామగ్రిని ప్రతి రెండు గంటలకు ఓసారి మెషీన్ల సాయంతో తొలగిస్తున్నామని వెల్లడించారు. మహా కుంభమేళా పూర్తయ్యే వరకు నదిలో నీటిని శుభ్రంగా ఉంచటానికి నిరంతరం పరవేక్షిస్తూ చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఇక మహా కుంభ మేళా నిర్వహణకు రూ. 7 వేల కోట్లు కేటాయించిన యూపీ ప్రభుత్వం.. జలాలు, వ్యర్థాల నిర్వహణకు రూ. 1,600 కోట్లు ఖర్చుపెడుతోంది. అత్యాధునిక పద్ధతుల్లో మురుగునీటి నిర్వహణ, వ్యర్థాల తరలింపు చర్చలు చేపడుతోంది.
ఈ నీటిలో స్నానం చేస్తే నష్టాలివీ...
ఫీకల్ కాలిఫార్మ్ బాక్టీరియా ఎక్కువగా ఉన్న ఈ నీటిలో స్నానాలు చేయడం వల్ల జీర్ణాశయ సంబంధిత ఇన్ఫెక్షన్లు, వాంతులు, డైయేరియా వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.
చర్మ వ్యాధులు, అలర్జీలు రావచ్చు. కళ్లు మండడం, కండ్లకలకలు రావచ్చు.
టైఫాయిడ్, హెపటైటిస్ A వంటి తీవ్రమైన అంటువ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.
కాలుష్యంతో కూడిన నీరు పొరపాటున గొంతులో పోతే శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వృద్ధులు, చిన్న పిల్లలకు ఈ వ్యాధులు సోకే అవకాశం ఎక్కువ.
చర్మం, జీర్ణాశయం, శ్వాస వ్యవస్థకు సంబంధించిన అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
దీర్ఘకాలంగా కాలుష్యమైన నీరు తాగితే మూత్రపిండాలు, కొలన్ క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.
ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. భక్తులు, స్థానికులు నీటి స్వచ్ఛతపై అప్రమత్తంగా ఉండాలి.
60 కోట్ల మంది పుణ్యస్నానాలు
గత నెల రోజులకు పైగా కొనసాగుతున్న మహాకుంభమేళాలో ఇప్పటి వరకు అపూర్వ స్థాయిలో 55 కోట్ల మంది త్రివేణి సంగమంలో పుణ్యస్థానాలు ఆచరించారని యూపీ ప్రభుత్వం మంగళవారం వెల్లడించింది. దేశంలో సనాతన ధర్మాన్ని పాటించే 110 కోట్ల జనాభాలో సగం మంది మూడు నదుల సంగమంలో స్నానాలు చేశారని, ఈ సంఖ్య మహాకుంభ్ ముగిసే ఈనెల 26వ తేదీ నాటికి 60 కోట్లు దాటుతుందని ఓ ప్రకటనలో పేర్కొంది. దేశంలోని దాదాపు 143 కోట్లు ఉన్న మొత్తం జనాభా పరంగా చూస్తే.. ఇప్పటి వరకు 38 శాతానికి పైగా ప్రజలు పుణ్యస్నానాలు చేశారని తెలిపింది. కాగా, మహాకుంభమేళా ప్రారంభానికి ముందు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో 45 కోట్ల మంది భక్తులు పాల్గొంటారని యోగి సర్కార్ అంచనా వేసింది. అయితే ఆ సంఖ్య ఈ నెల 14వ తేదీకే 50 కోట్లు దాటిందని ప్రభుత్వం పేర్కొంది. ఇందులో అత్యధికంగా మౌని అమావాస్య రోజున దాదాపు 8 కోట్ల మంది పవిత్ర స్నానాలు చేశారని తెలిపింది.
Next Story