‘‘బాధితుల పట్ల గౌరవం ఉంటే పరామర్శించండి’’
మహిళలను నిజంగా గౌరవిస్తే.. లైంగిక వేధింపులకు గురైన బాధితులను జేడీ(ఎస్) నేతలు పరామర్శించాలని కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ డిమాండ్ చేశారు.
ఏ మాత్రం గౌరవం ఉన్నా హసన్ నియోజకవర్గ ఎంపీ ప్రజ్వల్ లైంగిక వేధింపులకు గురైన బాధితులను జెడి (ఎస్) నాయకుడు హెచ్‌డి కుమారస్వామి, బిజెపి నాయకులు పరామర్శించాలని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ డిమాండ్ చేశారు. అశ్లీల వీడియోలు బయటకు రావడం వెనుక 'మహానాయకుడు' ఉన్నారని హెచ్ డీ కుమారస్వామి ఆరోపణపై శివకుమార్ స్పందించారు. “ అశ్లీల వీడియోలు ఉన్న పెన్ డ్రైవ్‌కు సంబంధించి దేవరాజేగౌడ ఎవరిని కలిశారో మా పార్టీ ప్రతినిధులు సుదీర్ఘంగా మాట్లాడారు. ఈ విషయమై దేవరాజేగౌడ బీజేపీ నేతలకు లేఖ రాయడమే కాకుండా కుమారస్వామిని కూడా కలిశారు. ఇలాంటి చౌకబారు రాజకీయాలు చేయాల్సిన అవసరం మాకు లేదు. ఇక ఈ కేసును సిట్ దర్యాప్తు చేస్తోంది. ఏప్రిల్ 26న రాష్ట్రంలో మొదటి దశ ఎన్నికల పోలింగ్ ముగిసిన కొద్దిసేపటికే ప్రజ్వల్ జర్మనీకి వెళ్లిపోయాడు.’’ అని శివకుమార్ వివరించారు.
ఎవరీ ప్రజ్వల్..
జెడి(ఎస్) చీఫ్, మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు ప్రజ్వల్. ప్రజ్వల్ తండ్రి రేవణ్ణ. కర్ణాటక రాష్ట్రం హసన్ నియోజక వర్గ ఎంపీగా ఉన్న ప్రజ్వల్.. ఈ సారి ఎన్నికలలో కూడా అక్కడి నుంచి బరిలోకి దిగారు. ప్రజ్వల్ అనేక మంది మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. వీడియో క్లిప్‌లు సామాజిక మాధ్యమాల్లో వైరలయ్యాయి. ఓ బాధితురాలు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కాంగ్రెస్ ప్రభుత్వం సిట్ దర్యాప్తునకు ఆదేశించింది. 24 గంటలలోగా తమ ముందు హాజరుకావాలని ప్రజ్వల్, ఆయన తండ్రి రేవణ్ణకు సిట్ అధికారులు నోటీసులు కూడా అందజేశారు. ఇటు జేడీ(ఎస్) కూడా ప్రజ్వల్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.