
ఈ కాలేజీల్లో ఉద్యోగం చేస్తే లక్షల్లో జీతం గ్యారెంటీ
తెలంగాణలోని కొన్ని మెడికల్ కాలేజీల్లో ఉద్యోగంలో చేరితే లక్షల రూపాయల జీతాలు అందుకోవచ్చు
ఎవరు ఏపనిచేసినా జీతం డబ్బుల కోసమే. అయితే కొందరికి పనికి తగ్గ జీతం రాకపోవచ్చు. మరికొందరికి పనికితగ్గ జీతంకన్నా ఎక్కువ రావచ్చు. ఇప్పుడీ విషయం దేనికంటే తెలంగాణలోని కొన్ని మెడికల్ కాలేజీల్లో ఉద్యోగంలో చేరితే లక్షల రూపాయల జీతాలు అందుకోవచ్చు. ఇంతకీ ఆ మెడికల్ కాలేజీలు ఎక్కడున్నాయి అనే కదా మీకు సందేహం. అవును, మారుమూల ప్రాంతాల్లో గట్టిగా చెప్పాలంటే అన్నీవిధాలుగా వెనుకబడున్న ప్రాంతాల్లోని మెడికల్ కాలేజీల్లో పిల్లలకు పాఠాలు చెప్పే ఉద్యోగంలో చేరితో డబ్బే డబ్బు. మైదాన ప్రాంతాల్లోని టీచింగ్ స్టాఫ్ తీసుకునే జీతాలకన్నా బాగా ఎక్కువ జీతాలను ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆఫర్ చేస్తోంది.
ఇపుడు విషయం ఏమిటంటే రాష్ట్రంలోని అత్యంత వెనుకబడిన ప్రాంతాలైన అసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, గద్వాల లాంటి మెడికల్ కాలేజీల్లో చదువుకునేందుకు విద్యార్ధులు ఉన్నారు కాని చదువు చెప్పేందుకు సరిపడా ప్రొఫెసర్లే లేరు. పాఠాలు చెప్పే ప్రొఫెసర్లు లేనికారణంగా విద్యార్ధులు బాగా నష్టపోతున్నారు. ఈవిషయాన్ని గమనించిన ప్రభుత్వం ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులను యుద్ధప్రాతిపదికన భర్తీ చేయాలని డిసైడ్ అయ్యింది.
ఎందుకు వెళ్ళటంలేదు
ఇపుడున్న కాలేజీల నుండి మారుమూల ప్రాంతాల్లోని కాలేజీలకు ఎవరిని బదిలీచేసినా వెళ్ళటంలేదు. ఎందుకంటే ఆ ప్రాంతాల్లో సరైన సౌకర్యాలుండటంలేదని. అందుకనే ప్రొఫెసర్లను ఆకర్షించేందుకనే ప్రభుత్వం ‘యూకోట్ వి పే’ అనే కాంట్రాక్ట్ విధానాన్ని అమలుచేయాలని డిసైడ్ చేసింది. ఈ పద్దతిలో అయితే ప్రొఫెసర్లు కాలేజీల్లో చేరటానికి ఆసక్తి చూపుతారని ప్రభుత్వం ఆశిస్తున్నది.
ఇపుడు రాష్ట్రంలో 35మెడికల్ కాలేజీలున్నాయి. వాటిల్లో చాలావరకు కొత్తగా ఏర్పాటుచేసినవే. అసిఫాబాద్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబా బాద్, గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూల్ లాంటి కాలేజీల్లో రెగ్యులర్ ప్రొఫెసర్ల కొరత చాలా ఎక్కువగా ఉంది. అనేక విభాగాల్లో ప్రొఫెసర్, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లలో ఒక్కరంటే ఒక్కరు కూడా లేరు. అందుకనే యూ కోట్ వి పే అనే విధానంలో అవసరమైన అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలని డిసైడ్ అయినట్లు మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ నరేంద్రకుమార్ చెప్పారు. ఈపద్దతిలో నియామకాలకు ఇఫ్పటికే కసరత్తు మొదలైనట్లు కూడా తెలిపారు.
ఊహించనంత జీతాలు
యూ కోట్ వి పే పద్దిలో అధ్యాపకులు ఊహించనంత జీతాలు అందుకోవచ్చు. అధ్యాపకుల నియామకాలకు రెండుసార్లు నోటిఫికేషన్ జారీచేస్తారు. రెండుసార్లు నోటిఫికేషన్ జారీచేసినా ఎవరూ దరఖాస్తులు చేసుకోకపోతే అప్పుడు యూ కోట్ వి పే అనే విధానాన్ని అమల్లోకి తెస్తారు. ఈ పద్దతిలో మామూలు వైద్య కళాశాలల్లో ప్రొఫెసర్లు ఇపుడు అందుకుంటున్న జీతం నెలకు రు. 1.90 లక్షలు. అసోసియేట్ ప్రొఫెసర్ కు రు. 1.5 లక్షన్నర, అసిస్టెంట్ ప్రొఫెసర్ కు రు. 1.25 లక్షల జీతం అందుకుంటున్నారు. కొత్త పద్దతిలో అయితే ప్రొఫెసర్ కు నెల జీతం సుమారు రు. 5.70 లక్షలు వస్తుంది.
ఈ పద్దతిని ఎలాగ అమలుచేస్తారంటే ప్రొఫెసర్ పోస్టుకు ముగ్గురు దరఖాస్తు చేశారని అనుకుందాము. ఒకరు నెల జీతం రు. 5.70 లక్షలు కావాలని, మరోకరు రు. 5 లక్షలు, ఇంకో వ్యక్తి రు. 4.5 లక్షలు కోట్ చేశారని అనుకుందాముం. సహజంగానే ప్రభుత్వం తక్కువగా రు. 4 లక్షల జీతం కోట్ చేసిన మూడో ప్రొఫెసర్ నే పోస్టులో నియమిస్తుంది. అలాకాకుండా వచ్చిన దరఖాస్తు ఒక్కటే అయి ఆ ఒక్క దరఖాస్తులో జీతం రు. 5.7 లక్షలు కోట్ చేస్తే ఆ ప్రొఫెసర్ కోట్ చేసినంత జీతమిచ్చి ఉద్యోగంలోకి తీసుకుంటుంది ప్రభుత్వం. అసోసియేట్ ప్రొఫెసర్ కు నెలకు రు. 4.5 లక్షలు, అసిస్టెంట్ ప్రొఫెసర్ కు నెలకు 3.75 లక్షల జీతం వచ్చే అవకాశముంది. ప్రస్తుతం ఈ విధానం మధ్యప్రదేశ్ లో అమల్లో ఉంది. అంటే రెగ్యులర్ గా ఇపుడు మైదాన ప్రాంతాల్లోని ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు అందుకుంటున్న జీతాలకు మూడురెట్లు ఎక్కువగా అందుకునే అవకాశాలున్నాయి.
కొరతకు అసలు కారణం ఏమిటి ?
మారుమూల ప్రాంతాల్లోని కాలేజీల్లో ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు లేని మాట నిజమే కాని ఎందుకింత కొరతతో ఇబ్బందులు పడుతున్నది ప్రభుత్వం ? ఎందుకంటే ఒక్కసారిగా అనేక కాలేజీలను బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించేసింది కాబట్టి. ఏ ప్రభుత్వం కూడా ఇన్ని కాలేజీలను ఒకేసారి ప్రారంభించదు, ప్రారంభించకూడదు కూడా. 2022-23, 2023-24 విద్యా సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్కసారిగా 25 మెడికల్ కాలేజీలను ప్రారంభించేసింది. ప్రారంభించబోయే కాలేజీల్లో సరిపడా అధ్యాపకులు ఉంటారా లేరా అని కూడా చూడలేదు. ఒక్కసారిగా అన్ని కాలేజీలను ప్రారంభించేసరికి అవసరమైన ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు దొరకలేదు.
అందుకని అప్పటికప్పుడు 3 ఏళ్ళు సర్వీసున్న 250మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లుకు ఒక్కసారిగా ప్రొమోషన్లు ఇచ్చి అసోసియేట్ ప్రఫెసర్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం నియమించేసింది. నిజానికి అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేరిన 4 ఏళ్ళ తర్వాతే అసోసియేట్ ప్రొఫెసర్ అవుతారు. 3 ఏళ్ళ సర్వీసు తర్వాత అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ అవుతారు. అంటే 7 ఏళ్ళ సర్వీసు ఉంటే కాని ప్రొఫెసర్లు కాలేరు. అలాంటిది ఒక్కసారిగా 25 కాలేజీలను ప్రభుత్వం ప్రారంభించేయటంతో పై మూడు క్యాటగిరిల్లోని ప్రొఫెసర్ల కొరత వచ్చేసింది. అందుకనే తన తప్పిదాన్ని కప్పుపుచ్చుకునేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం నిబంధనలన రిలాక్స్ చేసి ఇష్టమొచ్చినట్లు ప్రమోషన్లు ఇచ్చేయటంతో ఇపుడు అసోసియేట్ ప్రొఫెసర్లు లేకుండాపోయారు.
మరికొందరిని అవసరాల కోసం ఉస్మానియా, గాంధీ, కాకతీయ మెడికల్ కాలేజీల నుండి మారుమూల కాలేజీలకు బదిలీచేసింది అప్పటి ప్రభుత్వం. దాంతో పైన చెప్పిన మూడు కాలేజీల్లో స్టాఫ్ కొరత వచ్చేసింది. సరిపడా పోస్టులను చూసుకున్న తర్వాతనే ప్రభుత్వం కాలేజీని స్టార్ట్ చేయాలి. కాని బీఆర్ఎస్ ప్రభుత్వం ఉల్టాగా కాలేజీని స్టార్ట్ చేసేసి అధ్యాపకులను నియమించటంతో స్టాఫ్ కొరత వచ్చేసింది. పైగా అనాటమి, ఫిజియాలజీ, పేతాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రో బయాలజీ, ఫార్మా బ్రాంచ్, రేడియాలజీల్లో ఎక్కువగాను, ఫోరెన్సిక్ బ్రాంచ్ లో తక్కువగాను కొరత ఉన్నట్లు సమాచారం. అన్నేసి లక్షలరూపాయల జీతాలను ప్రభుత్వం ఆఫర్ చేసినా ఎంతమంది చేరటానికి ముందుకొస్తారో చూడాలి. ఎలాగూ కాంట్రాక్టు పద్దతిలోనే కాబట్టి రిటైర్ అయిన అధ్యాపకులు చేరుతారేమో చూడాలి.

