GHMC
x

అనుమతులను మించిన అంతస్తులపై జీహెచ్ఎంసీ కొరడా !

అక్రమంగా అదనపు అంతస్తులు నిర్మించిన ఘటన తర్వాత నగరంలో అక్రమ నిర్మాణాలపై GHMC కఠిన చర్యలు. ఆన్‌లైన్ పోర్టల్, భారీ జరిమానా ప్రతిపాదన.


బహుళ అంతస్తుల భవనాల విషయంలో జీహెచ్ఎంసీ ఫోకస్ పెంచింది. చాలా మంది తీసుకున్న అనుమతులకు మించిన ఫ్లోర్లు నిర్మిస్తున్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది. ఇటీవల టోలీచోకీలో కూడా నిర్మాణంలో ఉన్న ఏడంతస్తుల భవనం ఒక్కసారిగా కూలింది. ఈ ప్రమాదంలో దాదాపు నలుగురు మరణించారు. అయితే ఆ భవనానికి మూడు అంతస్తులకు మాత్రమే అనుమతులు తీసుకున్నారని, కానీ ఏడు అంతస్తుల వరకు నిర్మాణం చేపట్టారని అధికారులు దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలోనే అనుమతులను మించి కట్టిన బహుళ అంతస్తుల భవనాలపై జీహెచ్ఎంసీ ఫోకస్ పెట్టాలని నిర్ణయించుకుంది.

పాటించని భద్రతా ప్రమాణాలు

దీనికి సంబంధించి యాక్షన్ ప్లాన్‌ను కూడా రెడీ చేస్తోంది. టోలీచోకీలో మూడు అంతస్తులకు మాత్రమే అనుమతి ఉన్న భవనాన్ని ఆరు లేదా ఏడు అంతస్తుల వరకు నిర్మించడం తీవ్ర ఆందోళనకు దారితీసింది. అధికారిక అనుమతులను ఉల్లంఘిస్తూ నిర్మాణం కొనసాగించడమే కాకుండా భద్రతా ప్రమాణాలు కూడా పాటించలేదని దర్యాప్తులో బయటపడింది. ఈ ఘటన తర్వాత నగరంలో అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది.

పోలీసుల ప్రాథమిక విచారణలో పలు నిర్లక్ష్యాలు బయటపడ్డాయి. నిర్మాణ పనుల్లో ఉపయోగించిన బాంబూ కర్రలు పాతవిగా, పలుమార్లు వాడినవిగా ఉన్నాయని అధికారులు అనుమానిస్తున్నారు. వాటిని మార్చకుండా అన్ని అంతస్తుల్లో అదే కర్రలను వాడటం వల్ల నిర్మాణం బలహీనంగా మారిందని భావిస్తున్నారు. దీంతో కార్మికుల బరువును తట్టుకోలేని పరిస్థితి ఏర్పడినట్లు తెలుస్తోంది. వీటితో పాటు మరిన్ని నిబంధనల అతిక్రమణను కూడా అధికారులు గుర్తించారు.

అక్రమ నిర్మాణాల ట్రాకింగ్‌కు స్పెషల్ పోర్టల్

ఈ ఘటన తర్వాత నగరంలో అక్రమ నిర్మాణాలపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. గత ఐదేళ్లలో తెలంగాణ హైకోర్టులో అక్రమ నిర్మాణాలకు సంబంధించి సుమారు 2.5 లక్షల రిట్ పిటిషన్లు నమోదయ్యాయి. సమస్య తీవ్రతను దృష్టిలో పెట్టుకుని కొత్త చర్యలు చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు. ఇందులో భాగంగా అక్రమ నిర్మాణాలను గుర్తించి ట్రాక్ చేయడానికి ప్రత్యేక ఆన్‌లైన్ పోర్టల్ రూపొందించాలనే ప్రణాళికను జీహెచ్ఎంసీ సిద్ధం చేస్తోంది.

ఈ పోర్టల్ ద్వారా నోటీసులు జారీ చేయడం నుంచి ఆస్తి సీజ్ చేయడం, కూల్చివేత వరకు అన్ని చర్యలను డిజిటల్‌గా నమోదు చేయనున్నారు. అక్రమ నిర్మాణాలు చేపట్టిన యజమానులపై భారీ జరిమానాలు విధించనున్నారు. అనుమతించిన ఫీజుకు నాలుగు రెట్లు, అంటే 400 శాతం వరకు జరిమానా విధించే ప్రతిపాదనపై అధికారులు పని చేస్తున్నారు. నోటీసులను పట్టించుకోని యజమానులపై భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 223 కింద క్రిమినల్ కేసులు నమోదు చేసే అవకాశముందని తెలిపారు.

40 శాతం ఫిర్యాదులు అక్రమ కట్టడాలవే

ఇక భవనాలకు సంబంధించిన ఎన్‌కంబరెన్స్ సర్టిఫికేట్‌లో కూడా ‘అనధికార నిర్మాణం’ అనే గుర్తింపు చేర్చే అంశాన్ని జీహెచ్ఎంసీ పరిశీలిస్తోంది. ఈ విషయంపై స్టాంప్స్, రిజిస్ట్రేషన్ శాఖతో సమన్వయం చేసేందుకు ప్రతిపాదనలు పంపనున్నారు. అధికారుల ప్రకారం నగరంలో చాలా మంది భవన యజమానులు మొదట జీ ప్లస్ వన్ లేదా రెండు అంతస్తులకు అనుమతి తీసుకుని తరువాత అదనపు అంతస్తులు నిర్మిస్తున్నారు.

కొంతమంది నివాస భవనాలను వాణిజ్య వినియోగానికి మార్చి తక్కువ పన్ను ప్రయోజనాలు పొందుతున్నారని అధికారులు తెలిపారు. నగరంలో ప్రతి సోమవారం జరిగే ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే ఫిర్యాదుల్లో 40 నుంచి 50 శాతం వరకు అక్రమ నిర్మాణాలకు సంబంధించినవేనని అధికారులు చెప్పారు. ఈ ఏడాది మాత్రమే జీహెచ్ఎంసీ ఇప్పటికే వెయ్యికి పైగా అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో నగరంలో అక్రమ నిర్మాణాలపై పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది.

Read More
Next Story