
ఎల్పీజీ సరఫరా భద్రతకు నిత్యావసర వస్తువుల చట్టం అమలు
ఎల్పీజీ (కమర్షియల్) నుంచి PNGకి మారే వినియోగదారులకు ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్లు ప్రకటన..
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరిగిపోతున్నాయి. మరోవైపు ఇంధన సరఫరాపై ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్పీజీ (Liquid petroleum gas) ఎల్ఎన్జీ (Liquefied Natural Gas) సరఫరాలో అంతరాయం కలగకుండా ఉండేందుకు నిత్యావసర వస్తువుల చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ చట్టం కింద పెట్రోలియం ఉత్పత్తులు, సహజ వాయువుతో సంబంధం ఉన్న అన్ని సంస్థలకు కొత్త మార్గదర్శకాలు జారీ అయ్యాయి. ఉత్పత్తి, శుద్ధి, నిల్వ, రవాణా, దిగుమతి, ఎగుమతి, మార్కెటింగ్, పంపిణీ కార్యకలాపాలు నిర్వహించే సంస్థలు తమ వివరాలను తప్పనిసరిగా ప్రభుత్వానికి పంపాలి.
ఈ డేటాను సేకరించే బాధ్యతను పెట్రోలియం మంత్రిత్వ శాఖ నోడల్ ఏజెన్సీ పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ (PPAC)కు అప్పగించారు. తాజా నోటిఫికేషన్ ప్రకారం, సంస్థలు తమ సమాచారాన్ని రియల్ టైం పద్ధతిలో PPACకు అందించాలి.
‘‘ఈ నోటిఫికేషన్‌ను మార్చి 19న విడుదల చేశారు. ఆదేశాలను ఉల్లంఘిస్తే చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం నేరంగా పరిగణిస్తారు. అవసరమైతే జైలుశిక్ష కూడా విధించవచ్చు’, అని పెట్రోలియం మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ తెలిపారు.
‘దేశంలో ప్రస్తుతం ఇంధన కొరత లేదు. రిఫైనరీలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. మన అవసరాలకు సరిపడ ముడి చమురు ఉంది. దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకులు ఎలాంటి అంతరాయం లేదు,’ అని పేర్కొన్నారు.
‘‘సహజ వాయువు సరఫరా కూడా సవ్యంగా కొనసాగుతోంది. పైపుల ద్వారా సరఫరా చేసే PNG (Piped Natural Gas), CNG (Compressed Natural Gas) అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఎల్పీజీ కమర్షియల్ వినియోగదారులను PNGకి మారాలని ప్రభుత్వం కోరుతోంది. వారికి త్వరగా కనెక్షన్లు, ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఇటీవలి మూడు రోజుల్లోనే 5,600 మందికి పైగా ఎల్పీజీ వినియోగదారులు PNGకి మారినట్లు సమాచారం. గత రెండు వారాల్లో సుమారు 1.25 లక్షల కొత్త PNG కనెక్షన్లు మంజూరయ్యాయి.’’ అని తెలిపారు.
ఇరాన్, ఇజ్రాయిల్ - అమెరికా మధ్య యుద్ధం ప్రభావం ప్రపంచ ఎల్ఎన్జీ సరఫరాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. దీంతో భారత్ ముందస్తు చర్యలు తీసుకుంటోంది. దేశం తన అవసరాల కోసం రష్యా, అమెరికా, వెనిజులా వంటి దేశాల నుంచి ముడి చమురు దిగుమతి చేసుకుంటోంది. సహజ వాయువును అమెరికా, ఆస్ట్రేలియా, నార్వే, రష్యా వంటి దేశాల నుంచి పొందుతోంది.
ఇంకా, నిల్వలు దాచడం, బ్లాక్ మార్కెట్ కార్యకలాపాలను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి, తనిఖీలు ముమ్మరం చేశాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కూడా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కొనసాగిస్తున్నాయి.
మొత్తంగా ఇంధన సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రభుత్వం పలు ముందస్తు చర్యలు చేపట్టింది. దేశంలో ఇంధన భద్రతను కాపాడేందుకు కట్టుదిట్టమైన చర్యలు కొనసాగుతున్నాయి.

