మాట వినని కమిషనరమ్మకు ఖైదు
x
గుంటూరు కార్పొరేషన్ కమిషనర్, పక్కన ఏపీ హైకోర్టు

మాట వినని కమిషనరమ్మకు ఖైదు

కార్పొరేషన్ కమిషనరైతే ఏంటీ, కలెక్టరైతే ఏంటీ? చట్టం ఎవరికీ చుట్టం కాదు కదా.. ఇప్పుడు గుంటూరు మున్సిపల్ కమిషనర్ కీర్తి పరిస్థితి అంతే అయింది. ఆ కథేంటో చదవండి..


ఆమె ఓ పెద్ద నగరానికి పెద్దాధికారి. కోర్టు ఆమెకో పని అప్పగించింది. ఆమె పట్టించుకోలేదు. బాధితుడికి కోపం వచ్చింది. కోర్టు మెట్లెక్కాడు. ఫలితం.. ఆమెకు కారాగార శిక్ష పడింది. కార్పొరేషన్ ఖజానాకు చిల్లుపడింది. చట్టం ముందు అందరూ సమానమేనని మరోసారి రుజువైంది.

విషయమేమిటంటే..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి ఉన్న జిల్లా గుంటూరు. అటువంటి నగరపాలక సంస్థకు కమిషనర్ కీర్తి. గుంటూరు కార్పొరేషన్ పరిధిలోని యడవలి వారి సత్రం ఒకటుంది. దానికి కొంత స్థలం, మరికొన్ని గదులున్న భవనం ఉంది. దాన్ని కార్పొరేషన్ చట్టవిరుద్ధంగా తీసుకుందట. తీసుకుంటే తీసుకుంది.. అద్దె అయినా ఇచ్చిందా అంటే అదీ లేదు. అందులో ఏకంగా ఓ స్కూలు కూడా పెట్టింది కార్పొరేషన్. దీనిపైన సత్రం నిర్వాహకులు కోర్టుకు వెళ్లారు. ఆ సత్రం తమదేనంటూ వాదించారు. హైకోర్టు కూడా సత్రం నిర్వాహకుల వాదనతో ఏకీభవించింది. తక్షణమే ఉత్తర్వులు ఇచ్చింది. వాళ్ల అద్దె వాళ్లకి ఇమ్మని కార్పొరేషన్ తరఫున కమిషనర్ కీర్తిని ఆదేశించింది. ఆ మాట చెప్పి చాలా కాలమైనా ఆమె పట్టించుకోలేదు. పిటిషనర్‌కు ఇమ్మన్న 25 లక్షల రూపాయలు ఇవ్వలేదు.

కోర్టు ధిక్కారమును ...

దీంతో మనసు చిన్నబుచ్చుకున్న సత్రం నిర్వాహకులు మళ్లీ హైకోర్టుకు వెళ్లి.. అయ్యా మీరు చెప్పినా ఆ కమిషనర్ డబ్బివ్వలేదని విన్నవించుకున్నారు. కోర్టు ధిక్కరణ వ్యాజ్యం వేశారు. దీన్ని విచారించిన హైకోర్టు.. మున్సిపల్ కమిషనర్‌ కీర్తికి నెల రోజుల జైలు శిక్ష, 2వేల రూపాయల జరిమానా విధించింది. జనవరి 2న హైకోర్టు రిజిస్ట్రార్‌ వద్ద లొంగిపోవాలని కీర్తిని ఆదేశించడంతో ఆమె ఘొల్లు మన్నారు. నెల రోజుల జైలుశిక్ష విధించడమేమిటని వాపోయారు. అయితే ఆమె ఈ తీర్పుపై అప్పీలుకు వెళతానంటున్నారు.

Read More
Next Story