
'ఒబిసి క్రీమీలేయర్ కు ఆదాయం ఒక్కటే నియమం కాదు'
బిసిలకు శుభవార్త వినిపించిన సుప్రీంకోర్టు
వెనకబడిన వర్గాలకు సుప్రీంకోర్టు శుభవార్త చెప్పింది.ముఖ్యంగా ఆదాయం కారణంగా క్రీమీ లేయర్ పరిధిలో పడి రిజర్వేషన్ పొందలేకపోతున్న ప్రభుత్వ రంగ, ప్రవేటు ఉద్యోగుల పిల్లలు రిజర్వేషన్ పరిధిలోకి వచ్చేలా తీర్పు చెప్పింది. ఈ హక్కుకోసం పదేళ్లుగా ఈ వర్గాల వారు న్యాయపోరాటం చేస్తున్నారు. దీనికి సుప్రీంకోర్టు ఇద్దరు సభ్యుల ధర్మాసనం ముగింపు పలికింది. క్రీమీ లేయర్ నిర్ణయించేందుకు కేవలం ఆదాయాన్ని మాత్రమే పరిగణనలోనికి తీసుకోరాదని న్యాయమూర్తులు పిఎస్ నరసింహ, ఆర్ మహదేవన్ లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.
ఆదాయంతో 'క్రీమీ లేయర్'లో పరిధిలోకి వచ్చారని OBC కోటా నుండి అభ్యర్థిరి రిజర్వేషన్లు వర్తింపచేయకుండా మినహాయించడం చెల్లదని కోర్టు చెప్పింది. రిజర్వేషన్లకు తల్లిదండ్రుల ఆదాయం మాత్రమే ఏకైక ప్రమాణం కాదని, తల్లిదండ్రుల ఉద్యోగాల హోదా,సామాజిక వర్గాన్ని పరిగణనలోకి తీసుకోవాలని చెబుతూ ఆదాయం/సంపద పరీక్షను మినహాయింపుకు ఒక అదనపు ప్రమాణంగా మాత్రమే పరిగణించాలని సుప్రీంకోర్టు పేర్కొంది.
"Mere determination of the status of a candidate as to whether he/she falls within the creamy layer or the non-creamy layer of the OBCs cannot be decided solely on the basis of the income.” అని న్యాయమూర్తులు పేర్కొన్నారు.
ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు, మిగిలిన వారికి వేర్వేరు ప్రమాణాలు ఉండరాదని ఎత్తిచూపిన కోర్టు, ఇది వివక్షతకు సమానమవుతుందని, దీనిని అనుమతించలేమని పేర్కొంది.
ప్రస్తుతం, 'క్రీమీ లేయర్'ని నిర్ణయించడానికి ఆదాయం సంవత్సరానికి రూ. 8 లక్షలు గరిష్టపరిమితి విధించారు. ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు 'క్రీమీ లేయర్' హోదాను నిర్ణయించడానికి ఆదాయాన్ని ఏకైక నిర్ణయాత్మక అంశంగా తీసుకున్నందున కోర్టు తీర్పు ప్రభుత్వ రంగ మరియు ప్రైవేట్ రంగ ఉద్యోగుల పిల్లలపై భారీ ప్రయోజనం చూపుతుంది
ఆదాయం/సంపద పరీక్ష ప్రమాణంపై పట్టుబట్టిన కేంద్రం విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది. ఒక దశాబ్ద కాలంగా ఈ కేసును పోరాడుతూ వచ్చిన ప్రభుత్వ రంగ ఉద్యోగుల బాధిత పిల్లల వాదనను కోర్టు అంగీకరించింది.
1993లో కేంద్రం ఒక ఆఫీస్ మెమోరాండం(OM) జారీ చేసింది. దీని ప్రకారం ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకులు, బీమా సంస్థలు, విశ్వవిద్యాలయాలు, సమానమైన లేదా వాటితో పోలిక ఉన్న పదవులను కలిగి ఉన్న ఇలాంటి సంస్థల ఉద్యోగులకు కూడా రిజర్వేన్లకు సంబంధించిక ఒక రకం సూత్రం వర్తిస్తుందని పేర్కొంది.
కానీ OM లో ఆలోచించినట్లుగా "పోస్టుల సమానత్వం" జరగలేదు. PSU, ప్రైవేట్ రంగ ఉద్యోగులకు ఆదాయం/సంపద పరీక్షను ఏకైక ప్రమాణంగా చేస్తూ ప్రభుత్వం 2004 లో ఒక స్పష్టమైన వివరణ లేఖను కేంద్రం జారీ చేసింది. దీనితో ప్రభుత్వరంగ, ప్రైవేటురంగం ఉద్యోగుల ఆదాయం ఆధారంగా క్రీమీలేయర్ నిర్ణయించాలని పేర్కొంది. అయితే, తల్లిదండ్రుల హోదా లేదా వాళ్ల ఉద్యోగ రంగంతో సంబంధం లేకుండా 2004 లేఖకు అతిగా ప్రాధాన్యత ఇవ్వడం వల్ల 1993 OM కింద ఇచ్చిన మినహాయింపు ఏర్పాటును దెబ్బతీసింది అని ధర్మాసనం పేర్కొంది.
1993 ఆఫీసుకు మెమొరాండం లక్ష్యాన్ని 2004 లేఖ దెబ్బతీస్తున్నదని పలువురు అభ్యర్థులు వివిధ హైకోర్టులలో కేసులు వేశారు. హైకోర్టులన్నీ అభ్యర్థులకు అనుకూలంగా తీర్పు చెప్పాయి. దీనితో కేంద్రం సుప్రీం కోర్టులో అప్పీలు వేసింది. దీని మీద సుప్రీంకోర్టు ఈ రోజు హైకోర్టుల తీర్పులతో ఏకీభవించింది.

