
మందుల ధరలు పెరగటం తధ్యం అంటున్న ఫార్మా పరిశ్రమ వర్గాలు
ముడిసరుకు ధరలు 50 శాతం వరకు పెరిగాయని ఇప్పటికే ధరలు పెంచుకోవటానికి కేంద్రానికి నివేదించిన పరిశ్రమ
పశ్చిమాసియలో యుద్ధ ప్రభావం వలన మందుల ధరలు పెంచక తప్పదని అందుకు అనుమతి కొరతూ ప్రభుత్వానికి రాసినట్టు ఫార్మా పరిశ్రమ వర్గాలు చెప్తున్నాయి. ముడిసరుకుల ధరలు అదుపులో పెట్టటానికి కేంద్ర ప్రభుత్వం తగ్గించిన కస్టమ్స్ సుంకాల ప్రయోజనం సరఫరా దారులు తమకు కల్పించలేదని వారు ఆరోపిస్తున్నారు.
యుద్ధం లో 15 రోజుల విరామం తమకు ఉపశమనం కలిగిస్తుందని ఆ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. కాగా పరిస్థితిలో మార్పు రాకపోతే ఉద్యోగాలకు కోత విధించాల్సి వస్తుందని ఇప్పటికే విశాఖ నగరానికి సమీపంలో ఉన్న పరవాడ పారిశ్రామిక వాడ కంపెనీలు హెచ్చరిస్తున్నాయి.
భారతీయ ఔషధ పరిశ్రమల సమాఖ్య (Confederation of Indian Pharmaceutical Industry) సెక్రెటరీ జనరల్, శ్రుష్టి ఫార్మా కంపెనీ డైరెక్టర్ అయిన జాతీష్ సేథ్ ‘ఫెడరల్’ తో మాట్లాడుతూ వివిధ ముడిసరుకుల ధరలు 20 శాతం నుంచి 50 శాతం దాకా పెరిగాయన్నారు. “ధరల పెరుగుదలతో పాటు వాటి కొరత మొదలైంది. 15 రోజుల యుద్ధ విరామం పరిస్థితులను చక్కపరుస్తుందని ఆశిస్తున్నాము. మందుల ధరలు ఇప్పుడే పెంచం. పరిస్థితి లో మార్పు రాకపోతే వాటి ధరలు పెంచటానికి ఇప్పటికే ప్రభుత్వానికి రాశాము,” అని ఆయన తెలిపారు.
ఉక్రెయిన్ యుద్ధ కంటే దీని ప్రభావం మరింత ఎక్కువగా ఉందని ఆయన వివరించారు.
హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే భారతీయ బల్క్ డ్రగ్ తయారీదారుల సంస్థ (Bulk Drugs Manufacturers Association Of India) కేంద్రం ముడిసరుకులపై విధించిన కస్టమ్స్ తగ్గింపును స్వాగతించింది. కేంద్రం ఈ తగ్గింపును 2, ఏప్రిల్ 2026 నుండి 30 జూన్, 2026 వరకు మూడు నెలలపాటు అమలు చేస్తోంది.
ముడి సరుకుల ధరలు సరఫరాలో సమస్యల మూలంగా పెరగటంలేదని ఈ సంస్థ కేంద్ర కామర్స్ సెక్రెటరీ రాజేష్ అగర్వాల్ కు 4 ఏప్రిల్ లో రాసిన లేఖలో తెలిపింది.
“ఫార్మా పరిశ్రమలో ఉపయోగించే ఏపిఐ లు ఇంటర్మీడియట్ల ధరలు 50 నుంచి 180 శాతం వరకు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లకు సరఫరా కోసం ఇప్పటికే చేసుకున్న ఒప్పందాలకు కట్టుబడి ఉంటాము. అదే సమయంలో దేశీయంగా మందుల సరఫరాలో ఆటంకాలు రానివ్వం. మా సంస్థలో భాగంగా ఉండే కంపెనీలు వ్యాపారస్తుల దగ్గరే ముడి సరుకులు కొంటాయి,” అని బీడీఎంఏ జాతీయ అధ్యక్షుడు సీహెచ్. ఏ.పి. రామేశ్వర రావు తెలిపారు.
వ్యాపారస్తులు ధరలు పెంచటంతో పాటు ఇది వరకు 180 రోజుల వరకు ఇచ్చే క్రెడిట్ సౌకర్యాన్ని నిలిపివేశారు. సరుకు తీసుకోవాలంటే అధిక ధరలు చెల్లించాల్సి వస్తోంది. కృత్రిమ కొరత సృష్టించి ధరలు పెంచి వ్యాపారస్తులు లాభపడాలని చూస్తున్నట్టు స్పష్టం అవుతోంది. ప్రభుత్వం ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని సరుకులు అందరికీ సరఫరా చేసే భాద్యత తీసుకోవాలని ఆయన ఉత్తరంలో కోరారు.
ఇండియన్ ఫార్మాస్యూటికల్ అలయన్స్, సెక్రెటరీ జనరల్ సుదర్శన్ జైన్ హార్ముజ్ జలసంధి, ఎర్ర సముద్రం లో వ్యాపార కార్యకలాపాలు నిలిచిపోవటంతో సరుకు సరఫరాలో ఆటంకాలు ఏర్పడ్డాయని అన్నారు.
“ప్రస్తుతం అమలులోకి వచ్చిన కాల్పుల విరమణ ఉపశమనం కల్పిస్తుందని ఆశిస్తున్నాము. వాయు మార్గం ద్వారా ఛార్జీలు రెండింతలయ్యాయి, జల మార్గాల పై సర్చార్జ్ సరుకును బట్టి నాలుగు వేల నుండి ఎనిమిది వేల డాలర్లు పెరిగింది. ఇన్షూరెన్స్ ప్రీమియం పెరిగింది సరకు సరఫరా సమయం పెరిగింది. కరెన్సీ లో మార్పులు, పెరిగిన లాజిస్టిక్స్ ఖర్చులు, మధ్య ఆసియా, ఉత్తర ఆఫ్రికా కు ఎగుమతిలో ఆటంకాలు ఎదురౌతున్నాయి. దీనితో జెనరిక్ మందుల తయారీదారుల లాభాలు ప్రభావితం అవుతాయి. ఇది ఈ కంపెనీల మనుగడకే ప్రమాదం,” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ పరిస్థితిలో పరిశ్రమకు కొన్ని నెలలపాటు మద్దతు అవసరమని అని ఆయన తెలిపారు.
“సాధారణంగా పరిశ్రమలు మూడు నెలలకు తగిన ముడిసరుకు నిల్వ పెట్టుకుంటాయి. యుద్ధం మొదలై నెల మాత్రమే అయ్యింది. కంపెనీలు తమ ఉత్పత్తిని జాగ్రత్తగా చేస్తున్నాయి. సరఫరాలో ఉన్న సమస్యలు తీర్చే ప్రయత్నం జరుగుతోంది. మార్కెట్ లో గందరగోళం, అక్రమ నిల్వలు అరికట్టి, సరఫరాలో సమస్యలు పరిష్కరించే ప్రయత్నం జరుగుతోంది. కేంద్రం పరిశ్రమతో నిత్యం సంప్రదింపులు జరుపుతోంది,” అని ఫార్మెక్సిల్ డైరెక్టర్ జనరల్ కె.రాజా భాను తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ విశాఖ సమీపాన పరవాడ పారిశ్రామిక వాడలో పరిస్థితుల ప్రభావం స్పష్టంగా ఉందని ఇప్పటికే 25 నుంచి 30 శాతం ఉత్పత్తి దెబ్బతిందని జవహర్ లాల్ నెహ్రూ ఫార్మా సిటీ పరిశ్రమ సమాఖ్య కోశాధికారి వి. శివ రామ రాజు చెప్పారు. “స్థానికంగా ఉత్పత్తి అయ్యే సల్ఫ్యూరిక్ యాసిడ్ ధర రు. 26 నుంచి రు. 32 రూపాయలు అయ్యింది. దిగుమతి అయ్యే సరుకులపై కేంద్రం కస్టమ్స్ సుంకాలు తగ్గించినా ఆ ప్రయోజనం దిగుమతి దారులు పరిశ్రమకు ఇవ్వటం లేదు. ఇప్పటికే 15,000 మంది రోజువారీ కూలీలకు పని దొరకటం లేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే 25,000 మంది పర్మనెంట్ కార్మికులను పనిలోనుండి తొలగించాల్సి వస్తుంది,” అని ఆయన అన్నారు.
2009 లో 3,000 మంది కార్మికులకు పని కల్పించిన పరవాడ ఫార్మా సిటీ నేడు 40,000 మందికి ఉపాధి కల్పిస్తోంది. ఈ ఇండస్ట్రియల్ పార్క్ గత 18 సంవత్సరాలుగా అభివృద్ధి చెందుతూ 75 దేశాలకు కావాల్సిన ముడిపదార్థాలు ఏపిఐ లు ఇంటర్మీడియట్ల ను సరఫరా చేస్తోంది. ఇక్కడి నుంచి దాదాపు 92 కంపెనీలు తమ కార్యకలాపాలు నెరుపుతున్నాయి.
ఇన్ని రోజులు సజావుగా సాగిన పరిశ్రమలకు యుద్ధం వలన కష్టాలు తప్పటం లేదని జేఎన్ పీ సీ మాన్యుఫ్యాక్చర్స్ అసోసియేషన్ జాయింట్ సెక్రెటరీ సుబ్బా రావు చెప్పారు. ప్రస్తుతం చిన్న పరిశ్రమలు ఎదుర్కొంటున్న సమస్యలు త్వరలో పెద్ద ఔషధ పరిశ్రమలు ఎదుర్కుంటాయని శివ రామ రాజు ఆందోళన వ్యక్తం చేశారు.
భారత ఫార్మారంగం విలువ 60 బిలియన్ డాలర్లు (రూ.5.56 లక్షల కోట్లు) నుంచి 2030 నాటికి 130 బిలియన్ డాలర్లకు (రూ.12.05 లక్షల కోట్లు) చేరుతుందని అంచనా వేస్తున్నారు.

