బీఆర్ఎస్‌లోకి స్వతంత్ర అభ్యర్థి
x

బీఆర్ఎస్‌లోకి స్వతంత్ర అభ్యర్థి

గడ్డపోతారం మున్సిపాలిటీలో బీఆర్‌ఎస్ బలం 15కు చేరింది. ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు సమక్షంలో 18వ వార్డు స్వతంత్ర అభ్యర్థి పోతారం సతీష్ పార్టీలో చేరారు.


సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గంలోని గడ్డపోతారం మున్సిపాలిటీలో బీఆర్‌ఎస్ పార్టీ తన ఆధిపత్యాన్ని మరింత పటిష్టం చేసుకుంది. ఈ మున్సిపాలిటీలో జరిగిన ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఇప్పటికే విజయకేతనం ఎగురవేయగా తాజాగా గెలిచిన ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా కారెక్కారు. 18వ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన పోతారం సతీష్ ముదిరాజ్ కొద్దిసేపటి క్రితం ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు సమక్షంలో బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు.

ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఎన్నికల ఇంచార్జిగా వ్యవహరించిన ఈ మున్సిపాలిటీలో మొత్తం 18 వార్డులు ఉన్నాయి. ఫలితాల్లో ఇప్పటికే 14 మంది బీఆర్‌ఎస్ అభ్యర్థులు ఘన విజయం సాధించి విజయఢంకా మోగించారు. ఇప్పుడు సతీష్ చేరికతో మున్సిపాలిటీలో బీఆర్‌ఎస్ బలం 15కు చేరుకుంది. పార్టీలో చేరిన సతీష్‌కు శంభీపూర్ రాజు గులాబీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.

ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ కొలను బాలిరెడ్డితో పాటు పలువురు ముఖ్య నేతలు పాల్గొన్నారు. మాజీ సర్పంచ్‌లు పులిగిల్ల ప్రకాష్ చారీ, రవీందర్, సురేందర్ గౌడ్, నిరుడి శ్రీనివాస్ తదితరులు హాజరై సతీష్‌కు అభినందనలు తెలిపారు. గడ్డపోతారంలో బీఆర్‌ఎస్ సాధించిన ఈ విజయం పట్ల పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ప్రజా తీర్పును గౌరవిస్తూ వార్డు అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తామని నాయకులు పేర్కొంటున్నారు.

Read More
Next Story