
‘కగార్’ పేరుతో వెయ్యి మందిని చంపేశారు
గిరిజన పోరాటాలు మావోయిస్టులతోనే ప్రారంభం కాలేదు, వారితోనే అంతం కావు. బిర్సాముండా, అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ లను చంపేసినా ఆదివాసీ పోరాటాలు ఆగాయా?
‘కగార్’ పేరుతో వెయ్యి మందిని చంపేశారని, చనిపోయిన వారిలో నాలుగు వందల మంది మహిళలేనని ఛత్తీస్ ఘడ్ కు చెందిన ప్రముఖ గాంధేయ వాది హిమాంశు కుమార్ ఆరోపించారు. దేశంలో ప్రస్తుతం జరుగుతున్నది విధ్వంసకరమైన అభివృద్ధి నమూనా అని, వ్యవసాయాన్నేకాదు, జీవితాన్ని కూడా ధ్వంసం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
పౌర హక్కుల సంఘం రాష్ట్ర మహా సభలో ప్రసంగిస్తున్న గాంధేయ వాది హిమాంశు కుమార్
పౌరహక్కుల సంఘం రెండు తెలు గు రాష్ట్రాల సమన్వయ కర్త క్రాంతి చైతన్యను శుక్రవారం పోలీసులు అరెస్టు చేసిన నేపథ్యంలో, పౌరహక్కుల సంఘం 20వ రాష్ట్ర మహాసభలు తిరుపతిలోని గంధమనేని శివయ్య భవన్ లో శనివారం ఉదయం ఉత్కంఠత మధ్య ప్రారంభమయ్యాయి. పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు వేడంగి చిట్టిబాబు అధ్యక్షతన జరిగిన ఈ మహాసభ తొలి సమావేశంలో ‘కాషాయీకరణ-లౌకిక ప్రజాస్వామ్యం’ అన్న అంశంపైన హిమాంశు కుమార్ ప్రసంగం ఇలా సాగింది.
‘‘రాజ్యాంగాన్ని నమ్మేట్టయితే, ఆదివాసీల కోసం చేసిన చట్టాలను ప్రభుత్వం ఎందుకు గౌరవించడం లేదు? ఛత్తీస్ ఘడ్ లోని దంతెవాడ సమీప గ్రామంలో కమ్యూనిటి హెల్త్, కమ్యూనిటీ ఎడ్యుకేషన్, కమ్యూనిటి శానిటేషన్ కోసం గాంధేయ పద్ధతిలో పనిచేస్తున్న నాపై అయిదు సార్లు హత్యాయత్నం చేశారు. ఛత్తీస్ ఘడ్ లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సాల్వాజుడుంను ఏర్పాటు చేసి, 544 గ్రామాల పైన దాడులు చేయించారు. ఈ దాడిలో అయిదు వందల మంది గాయపడగా, వంద మంది మహిళలపై అత్యాచారం జరిగింది. బిజేపి వాళ్ళు పదహారు ఎకరాల క్యాంపస్ పై 2009లో బుల్ డోజర్లతో దాడి చేసి, ధ్వంసం చేశారు. 2010లో నన్ను రాష్ట్రం విడిచి వెళ్ళిపొమ్మని హెచ్చరించారు. నక్సలైట్ల పైన జరిగిన దాడి మనకెందుకులే అనుకుంటే, రేపు మన పైన కూడా దాడి చేస్తారు. నా పైన అయిదు సార్లు హత్యాయత్నం జరిగింది. ప్రజల కోసం నిలబడినందుకు గుజరాత్ లో ఐపిఎస్ అధికారి సంజీవ భట్ ను జైల్లో పెట్టారు. నక్సలైట్ల దగ్గర కంటే ఆర్ ఎస్ ఎస్ వారి దగ్గరే ఆయుధాలు ఎక్కువగా ఉన్నాయి.
ఆదివాసీలను, అనేక మంది సామాజిక కార్యకర్తలను జైల్లో పెట్టారు. బీమాకోరెగాన్ కేసులో ఉన్న వారంతా నక్సలైట్లా? జైళ్ళలో ఉన్న ఆరువేల మంది నక్సలైట్లా? దేశంలో ఎక్కువ హత్యలు ఆర్ ఎస్ ఎస్ వారే చేస్తున్నారు. ఒక్క బస్తర్ లోనే వెయ్యి మందిని హత్య చేస్తే, వారిలో 40 శాతం మంది మహిళలే ఉన్నారు. స్వాతంత్య్రానంతరం నిరుద్యోగం వచ్చింది. ఇప్పుడు ఆదివాసీల గడపదగ్గరకే యుద్ధం వచ్చింది. రేపిస్టులను, హంతకులను జైళ్ళ నుంచి వదిలేస్తున్నారు. క్రాంతి చైతన్య లాంటి ప్రజలకోసం పనిచేసే వారిని అరెస్టు చేస్తున్నారు. మానవహక్కుల్లో మన దేశం ఏ గ్రేడ్ నుంచి దిగజారితే, పాకిస్తాన్, బంగ్లాదేశ్ లో మనకంటే మెరుగ్గా ఉన్నాయి.’’
హిమాంశు కుమార్ హిందీ ప్రసంగాన్ని పౌర హక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ తెలుగులోకి అనువాదం చేశారు.
పౌర హక్కుల సంఘం రాష్ట్ర మహా సభలో ప్రసంగిస్తున్న జస్టిస్ చంద్ర కుమార్
‘భారత దేశం ప్రజాస్వామ్య పాలన’ అన్న అంశంపై హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ, ‘‘మావోయిస్టులు రాజ్యాంగాన్ని నమ్మడం లేదని అంటున్నారు. మరి ప్రభుత్వానికి రాజ్యాంగంపైన నమ్మకముందా ? క్రాంతి చైతన్యపైన పెట్టిన సెక్షన్లు తగినవా, కాదా అని న్యాయమూర్తులు ఆలోచించాలి. ఆర్ ఎస్ ఎస్ వారు రాజ్యాంగాన్నికానీ, జాతీయ జెండాను కానీ తొలి నుంచి అంగీకరించమని చెప్పారు. వీరు నమ్మే మనువాదం సమాజాన్ని కులాల పేరుతో చీల్చింది.
జీవించే హక్కు చాలా కీలకమైంది. ఎవరి ప్రాణం తీయకూడదని రాజ్యాంగం చెపుతోంది. మావోయిస్టులు చర్చలకు సిద్ధమని, అంతవరకు ఆయుధాలు వాడమని చెపితే, ఇరవై వేలు, ముప్పై వేల పోలీసు బలగాలను తీసుకెళ్ళి అరవై, డెబ్భై ఏళ్ళ వాళ్ళను చంపుతున్నారంటే, చట్టాన్ని, రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే కదా. చర్చల కమిటీతో మాట్లాడతామన్న వారిని చుట్టుముట్టి చంపడమేమిటి? అసలు చంపే హక్కు మీకెవరిచ్చారు? లొంగిపోతామన్న వారిని కూడా పట్టుకుని కాల్చి చంపుతారా? దేశ మంటే రైతులు, కూలీలు, దళితులు, ఆదివాసీలు, సమస్త ప్రజలు. ప్రభుత్వం మాత్రం దేశ మంటే ఆదానీ, అంబానీ అంటోంది.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ఉన్న జీవించే హక్కును, కాలరాస్తున్నారు. జీవించే హక్కును పోగొడుతున్నారు. భూగర్భంలో లభించే 50, 60 లక్షల కోట్ల రూపాయల విలువైన ఖనిజాలను ఆదాని, అంబానీలకు అప్పగించడం కోసమే ‘కగార్’ ఆపరేషన్ మొదలు పెట్టారు. రేపిస్టులకు బెయిల్ దొరుకుతుంటే, ప్రజలకోసం పనిచేసే వారికి బెయిల్ దొరకడం లేదు. సుప్రీం కోర్టు న్యాయమూర్తులు కళ్ళు తెరవాలి’’
పౌరహక్కుల సంఘం రాష్ట్ర మహాసభల ఆహ్వాన సంఘం అధ్యక్షులు రాఘవ మాట్లాడుతూ, తిరుపతి కేవలం ఆధ్యాత్మిక కేంద్రం మాత్రమే కాదని, సాంస్కృతిక పునరుజ్జీవన కేంద్రమని గుర్తుచేశారు. ఇక్కడే పుట్టిన ‘లే’కవిత్వాన్ని, రాడికల్ విద్యార్థి సంఘాన్ని ప్రభుత్వం నిషేధించిందని, ‘లే’ పైన నిషేధాన్ని ఎత్తివేస్తూ, హైకోర్టు న్యాయమూర్తి ‘‘ఎవరి అభిప్రాయలనూ నిషేధించలేం. అలా నిషేధిస్తే, మానవ సమాజం ముందుకు పోదు’’ అని అన్న మాటలను గుర్తు చేశారు.
ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు వేడంగి చట్టిబాబు మాట్లాడుతూ, మహాసభల ముందు పోలీసులు క్రాంతి చైతన్య ను అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నామని అన్నారు. దేశ వ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా హక్కుల ఉల్లంఘన జరుగుతోందని, అదే సమయంలో హక్కులపై చైతన్యం కూడా పెరుగుతోందని గుర్తు చేశారు. ఉత్తర్ ప్రదేశ్ లో అక్లాఖ్ ను హత్య చేసిన వారిపై ఉన్న ఆరోపణలను యోగి ప్రభుత్వం ఉపసంహరించుకుందని, ఇలా ఉపసంహరించడానికి అంగీకరించని సౌరబ్ ద్వివేది అనే న్యాయమూర్తి ఇంటిపై దాడి చేశారని గుర్తుచేశారు. ఉన్నవ్ అత్యాచార నిందితుడైన బిజేపి ఎమ్మెల్యే కి ఢిల్లీ హైకోర్టు బెయిల్ ఇచ్చిందని, ఉమర్ ఖలీద్ కు మాత్రం బెయిల్ తిరస్కరించిందని అన్నారు.
ప్రొఫెసర్ శేషయ్య రాసిన పుస్తకాన్ని సభలో ఆవిష్కరిస్తున్న దృశ్యం
పౌరహక్కుల సంఘం నాయకుడు ప్రొఫెస్ శేషయ్య రాసిన ‘పౌరహక్కుల ఆచరణ, దృక్పథం’ అన్న పుస్తకాన్ని శేషయ్య సతీమణి శశికళ ఆవిష్కరించి మాట్లాడారు. పౌరహక్కుల ఉద్యమం శ్రామిక ఉద్యమమని, భారత సంపదను, ప్రకృతి సంపదను కాపాడే వారు ఆదివాసీలని అన్నారు.
మధ్యాహ్నం పౌరహక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలుకా చంద్రశేఖర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ‘వికసిత భారత్- పౌరహక్కులు’ అన్న అంశంపై పౌరహక్కుల సంఘం నాయకులు ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ, పౌరహక్కులపై కింది స్థాయి నుంచి ఉద్యమం వచ్చినా, రాజ్యం దుర్మార్గం తగ్గడం లేదని, ప్రజాస్వామ్యం కొనసాగుతుందా, లేదా అన్న అనుమానం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివాసీ పోరాటాలు ఈ మార్చి చివరి నాటికి పూర్తిగా ఆపేస్తామంటున్నారని, అంటే డైరెక్టుగా మేం మనుషులను చంపుతామంటున్నారని అన్నారు. గిరిజన పోరాటాలు మావోయిస్టులతోనే ప్రారంభం కాలేదని, వారితోనే అంతం కావని, బిర్సాముండా, అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ లను చంపేసినా ఆదివాసీ పోరాటాలు ఆగాయా అని ప్రశ్నించారు.
గాంధీ జీ నాయకత్వంలో స్వాతంత్య్రోద్యమం జరుగుతుండగానే, దానికి సమాంతరంగా ఆదివాసీల ఉద్యమం కూడా జరిగిందని గుర్తుచేశారు. ఆదివాసీల విధానమే వేరని, ఆవు పాలు దూడ ఆహారం కనుక, వాటిని పిండుకుని తాగరని, సంపదను కూడబెట్టుకోరని చెప్పారు. ఆదివాసీలది కమ్యూనిజం వంటి అత్యుత్తమమైన జీవన విధానమని వ్యాఖ్యానించారు. ఆదివాసీ వారసత్వం కొనసాగుతుందని అన్నారు. ఇప్పుడున్న ఆర్ధిక విధానానికి నైతికత లేదని, అది స్వార్ధ పూరితమైనదని అన్నారు. నిర్బంధం, ఆర్థిక విధానం ఒకటికొకటి ముడిపడి ఉన్నాయని తెలిపారు.
‘వికసిత భారత్’ అన్న అంశంపై ఆర్థిక రంగ నిపుణుడు ప్రొఫెసర్ డి.నరసింహారెడ్డి మాట్లాడుతూ, 1990 నుంచి భారత్ అభివృద్ధి చెందుతోందంటున్నారని, కేవలం 5 శాతానికి మించి అభివృద్ధి చెందలేదని అన్నారు. ఈ ముగింపు సమావేశంలో పౌరహక్కుల సంఘం అధ్యక్షులు వేడంగి చిట్టిబాబు, ప్రధాన కార్యదర్శి చిలుకా చంద్రశేఖర్ ప్రసంగించారు. మధ్యమధ్యలో ప్రజాకళామండలి కళాకారులు పాటలు పాడారు.
పౌర హక్కుల సంఘం రాష్ట్ర మహా సభలో అమర వీరులకు నివాళులు అర్పిస్తున్న ప్రజా కళా మండలి సభ్యులు, మహాసభ ప్రతినిధులు
మహాసభలు ప్రారంభానికి ముందు ఏర్పాటు చేసిన పత్రికావిలేకరుల సమావేశంలో క్రాంతి చైతన్య అరెస్టును ఖండిస్తూ హరగోపాల్, వేడంగి చిట్టిబాబు, చిలుకా చంద్ర శేఖర్, ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ తదితరులు ప్రసంగించారు. అంతకంటే ముందు ప్రాంగణంలోనే ఏర్పాటు చేసిన అమరవీరుల స్థూపాన్ని దివంగత పౌరహక్కుల నేత ప్రొఫెసర్ శేషయ్య జీవిత సహచరి శశికళ ఆవిష్కరించారు. అనంతరం పౌరహక్కుల ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరులకు నివాళులు అర్పిస్తూ ప్రజాకళా మండలి కళాకారు పాటలు పాడుతూ, సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చారు.

