తొలిరోజే కూల్చేశారు: ఆపై నిలబడ్డారు
x
కుల్దీప్ యాదవ్, భారత స్పిన్ బౌలర్

తొలిరోజే కూల్చేశారు: ఆపై నిలబడ్డారు

ధర్మశాల టెస్ట్ లో తొలిరోజు భారత్ దే. భారీ స్కోర్ దిశగా సాగుతున్న ఇంగ్లండ్ ను కట్టడి చేసిన టీమిండియా తరువాత రోహిత్, జైశ్వాల్ దూకుడుతో మ్యాచ్ పై పట్టుబిగించింది.


ఐదో టెస్ట్ లో అయినా గెలిచి పరువు నిలుపుకుందామని అనుకున్న ఇంగ్లండ్ కు భారత స్పిన్నర్లు షాక్ ఇచ్చారు. ముఖ్యంగా కుల్దీప్ యాదవ్, వందో టెస్ట్ ఆడుతున్న రవిచంద్రన్ అశ్విన్ ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్ లకు చుక్కలు చూపించారు. దీంతో ఇంగ్లండో 57.4 ఓవర్లలో కేవలం 218 పరుగులకే ఆలౌట్ అయింది.

తరువాత బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ వికెట్ నష్టానికి 135 పరుగులు చేసింది. భారత కెప్టెన్ రోహిత్ శర్మ 52 బ్యాటింగ్, శుభ్ మన్ గిల్ 26 పరుగులతో క్రీజులో ఉన్నారు. యశస్వీ జైశ్వాల్ 57 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. భారత్ ఇంకా 83 పరుగుల వెనకంజలో ఉంది. జైస్వాల్ ఆఫ్ స్పిన్నర్ షోయబ్ బషీర్ బౌలింగ్ ముందుకు వచ్చి ఆడబోయి స్టంప్ ఔట్ అయ్యాడు.

అంతకుముందు మ్యాచ్ లో కుల్దీప్ యాదవ్ బౌలింగ్ అద్భుతం. సాఫీగా సాగుతున్న ఇంగ్లండ్ బ్యాటింగ్ ఆర్డర్ ను కుప్పకూల్చాడు. ఒక దశలో 175/3 తో పటిష్టంగా ఉన్న ఇంగ్లండ్ టీమ్ తరువాత అనూహ్యంగా తడబడి, 218 కే కుప్పకూలింది. టాప్ ఆర్డర్ లోని వరుసగా నాలుగు వికెట్లను కుల్దీప్ తన ఖాతాలోనే వేసుకున్నాడు. తరువాత నిలకడగా ఆడుతున్న రూట్ ను జడేజా అద్భుతమైన బంతితో ఎల్బీ వెనక్కి పంపాడు. మిగిలిన నాలుగు వికెట్లు కూడా అశ్విన్ తన ఖాతాలో వేసుకున్నాడు.
వందో టెస్ట్ ఆడిన అశ్విన్, బెయిర్ స్టోలు..
ధర్మశాల టెస్ట్ ద్వారా వందో మ్యాచ్ ఆడుతున్న జానీ బెయిర్ స్టో బ్యాటింగ్ లో దూకుడు ప్రదర్శించాడు. భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. చెడామడా ఫోర్లు, ఓ సిక్స్ తో సూపర్ ఫామ్ లో ఉన్నట్లు కనిపించాడు. కానీ కుల్దీప్ వేసిన అద్బుత బంతితో కీపర్ ధృవ్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అప్పడు జట్టు స్కోర్ 175, ఇదే స్కోర్ వద్ద జో రూట్, బెన్ స్టోక్స్ కూడా పెవిలియన్ బాట పట్టారు. దీంతో 175/ 3 తో ఉన్న ఇంగ్లండ్ 175/6 కి మారి తీవ్ర ఆత్మ రక్షణలో పడింది. పైగా జానీ బెయిర్ స్టో, జో రూట్, బెన్ స్టోక్స్ వరుసగా రివ్యూలు తీసుకుని కొల్పోయారు. ఇంగ్లండ్ జట్టులో ఓపెనర్ క్రాలీ మాత్రమే అర్థ సెంచరీ(79) సాధించాడు.
కెరీర్ వందో టెస్ట్ ఆడుతున్న అశ్విన్ కూడా అత్యద్భుతంగా బౌలింగ్ చేశాడు. తొలి సెషన్ లో సరిగా ప్రభావం చూపలేకపోయిన చెన్నై చిన్నోడు.. లంచ్ తరువాత బౌలింగ్ దిగి లోయర్ ఆర్డర్ పని పట్టాడు. తొలి రోజు పడిన ఇరు జట్ల వికెట్లు కూడా అన్ని స్పిన్నర్లకే దక్కాయి. భారత్ నుంచి కుల్దీప్, అశ్విన్, జడేజా, ఇంగ్లండ్ లో బషీర్ ఇలా బ్యాట్స్ మెన్ ను పెవిలియన్ చేర్చారు.


Read More
Next Story