పార్లమెంట్ సభ్యులకు సుదర్శన్ రెడ్డి లేఖ
x

పార్లమెంట్ సభ్యులకు సుదర్శన్ రెడ్డి లేఖ

సెప్టెంబర్ 9న జరిగే ఎన్నికలో పోటీ చేయడం గొప్ప గౌరవం.


ఉపరాష్ట్రపతి ఎన్నికకు సమయం ఆసన్నమవుతోంది. ఇంకా పట్టుమని పదిరోజులు కూడా లేవు. దీంతో ఎన్‌డీఏ, ఇండి కూటముల అభ్యర్థులు తమ ప్రచారంలో వేగం పెంచారు. తమకు మద్దతు ఇవ్వాలని ఎంపీలను కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇండి కూటమి అభ్యర్థి, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బీ సుదర్శన్ రెడ్డి.. పార్లమెంటు సభ్యులకు సోమవారం ఓ లేఖ రాశారు. అందులో రానున్న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా తాను పోటీ చేస్తుండటాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. సెప్టెంబర్ 9న జరిగే ఉపరాష్ట్రపతి ఎన్నికలో తనకు అందరి మద్దతు కావాలని కోరారు.

‘‘ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా, హైకోర్టు సీజేగా, లా విద్యార్థిగా, ప్రజాస్వామ్య బద్దమైన మూలాలు కలిగిన పౌరుడిగా గడిపిన జీవితం నాకు ఎన్నో విషయాలను నేర్పింది. భారతదేశ బలం.. ప్రతి ఒక్కరిని గౌరవంలో దాగి ఉందని చెప్పింది. అనేక భిన్నత్వాలను ఏకత్వంతో సెలబ్రేట్ చేసుకోవడం, రాజ్యాంగ నైతికతను కాపాడుకోవడంలో దేశం శక్తి దాగి ఉందని నేర్పింది’’ అని ఆయన తన లేఖలో రాసుకొచ్చారు.

‘‘ఇక ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికల విషయానికి వస్తే ఇది కేవలం ఇద్దరు వ్యక్తులలో ఒకరిని ఎంచుకోవడం మాత్రమే కాదు. ఇది ఒక సిద్ధాంతపరంగా తీసుకునే చాయిస్. ఇది మన స్వాతంత్య్ర ఉద్యమం చేత ఊహించబడిన అంశం. మన రాజ్యాంగంలో పొందుపరిచిన అద్భుతమైన ఆలోచనను ఈ ఎన్నిక పునరుద్ఘాటిస్తుంది. పూర్తి సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయానికి కట్టుబడి ఉన్న భారతదేశం. అసమ్మతిని ప్రోత్సహించే, స్వాగతించే, గౌరవించే భారతదేశం. సంస్థలు స్వాతంత్య్రం, న్యాయంగా ప్రజలకు సేవ చేసే, చేస్తున్న దేశం ఇండియా’’ అని రాసుకొచ్చారు.

‘‘ఉపరాష్ట్రతి.. రాజ్యసభ ఛైర్‌పర్సన్‌గా ఎవరికీ అనుకూలంగా కానీ, భయం కానీ లేకుండా పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యతను తన భుజాలపై మోస్తారు. ఒకవేళ ఈ పదవికి నేను ఎన్నికయితే.. ఆ ఉపరాష్ట్రపతి పదవిని నేను పూర్తి గౌరవంతో, నిష్పాక్షికంగా, దృఢమైన నిబద్దతతో నిర్వర్తిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నా. అందుకు మీ అందరి మద్దతు కోరుతున్నా’’ అని ఆయన పేర్కొన్నారు.

Read More
Next Story