భారత్‌లో ఏడాదికి 78.2 మిలియన్ టన్నుల ఆహారం వృధా అవుతుందా..?
x
Source: Twitter

భారత్‌లో ఏడాదికి 78.2 మిలియన్ టన్నుల ఆహారం వృధా అవుతుందా..?

ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఆహార పదార్థాల వృధాపై యూఎన్ తాజాగా ఓ నివేదికను విడుదల చేసింది. దాని ప్రకారం భారత్ ఏడాదికి ఎంత ఆహారాన్ని వృధా చేస్తుందో తెలుసా..


ప్రపంచవ్యాప్తంగా వృధా అవుతున్న ఆహారంపై ఐక్యరాజ్యసమితి ఫుడ్ వేస్ట్ ఇండెక్స్ తాజాగా నివేదిక విడుదల చేసింది. ఈ నివేదికతో సంచలన విషయాలు వెలుగు చేశాయి. ఇందులో యూఎన్ సభ్య దేశాల్లో ఒక ఏడాదికి ఏ దేశం ఎంత ఆహారాన్ని వృధా చేస్తుంది అన్నదానిపై ఇండెక్స్ తన అంచనాను పొందుపరిచింది. ఇందులో ప్రపంచంలో అత్యధిక ఆకలితో బాధపడే జనాభా ఉన్న మన భారత్ టాప్‌లో ఉంది. ఈ నివేదిక ప్రకారం ఏడాదికి భారత్ సుమారు 78.2 మిలియన్ టన్నుల ఆహారాన్ని వృధా చేస్తోంది. అంటే ఒక్కో భారతీయుడు సంవత్సరానికి 55 కిలోల ఆహారాన్ని చెత్తబుట్టలో వేస్తున్నాడన్నమాట. ఈ నివేదికను యూఎన్ ఎన్విరాన్‌మెంట్ ప్రోగ్రామ్.. జీరో వేస్ట్ దినోత్సవం సందర్భంగా విడుదల చేసింది. ఇది భారతదేశంలో గ్రామాల కంటే పట్టణాల్లోనే అధికంగా ఆహారం వృధా అవుతుందని వెల్లడించింది.

దక్షిణా ఆసియా దేశాల్లో ఇలా
ఈ నివేదిక ప్రకారం దక్షిణ ఆసియాలో భూటాన్ పౌరుడు ఏడాదికి 19 కిలోల ఆహారం వృధా చేస్తున్నాడు. దీంతో అత్యల్ప ఆహారాన్ని వృధా చేస్తున్న దేశంగా భూటాన్ నిలిచింది. ఇదే క్రమంలో అత్యధిక ఆహారాన్ని వృధా చేస్తున్న దేశంలో పాకిస్థాన్ ఉంది. పాకిస్థాన్‌లో ఒక్కో పౌరుడు ఏడాదికి 130కిలోల ఆహారాన్ని వేస్ట్ చేస్తాడు. అయితే ప్రస్తుతం ఆహార వృధా అనేది భారత్‌లో కూడా అతిపెద్ద సమస్యగా మారుతోందని నివేదిక పేర్కొంది. ఎందుకంటే 783 మిలియన్ల ప్రపంచ జనాభాలో భారతీయులే 233.9 మిలియన్ల మంది ఉన్నారు. ఈ లెక్కలను గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2023 తెలుపుతోంది. ఆకలి పెనుభూతంలా ఉన్న దేశాల జాబితాలో ఉన్న 125 దేశాల్లో భారత్ 111 వ స్థానంలో ఉంది.
రిపోర్ట్ సాగిందిలా
ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, ఉత్తరాఖండ్, ఝార్ఖండ్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో అధ్యయనం చేశారు. ఈ అధ్యయాన్ని పలు సమయాల్లో నిర్వహించారు. ఈ రాష్ట్రాల్లో కేరళ, కర్ణాటకల్లో చేసిన అధ్యయనాన్ని యూఎన్‌కు చెందిన వారు నిర్వహించారని ఈ రిపోర్ట్ పేర్కొంది. ఈ అధ్యయనంలో సేకరించిన సమాచారం ఆధారంగానే నివేదికను సిద్ధం చేసినట్లు రిపోర్ట్ తెలిపింది. అయితే భారత్ నుంచి తీసుకున్న ఆహార వృధా డాటాను రిపోర్ట్ మీడియం కాన్ఫిడెన్స్ జాబితాలో ఉంచింది. ఈ డాటా కొంత భూభాగ పరిధికే చెందిందని, ఇందుకోసం తీసుకున్న శాంపిల్ సైజ్ సరిగా లేదని, కావున సరైన అంచనా వేయడం కష్టమని రిపోర్ట్ వివరించింది.
ఇతర దేశాల్లో అంచనాలిలా
జీ20 దేశాల్లో ఆస్ట్రేలియా, జపాన్, యూకే, యూఎస్ సహా యూరోపియన్ యూనియన్‌లో మాత్రమే 2030 నాటికి ఆహార వృధాలో ఏర్పడే పురోగతిని అంచనా వేయడానికి అనువైన పరిస్థితులను కలిగి ఉన్నాయని రిపోర్ట్ పేర్కొంది. కెనడా, సౌదీ అరేబియాలో తగిన గృహ అంచనాలు ఉన్నాయి. బ్రెజిల్ అంచనాలు 2024 చివరికి అంచనా వేయబడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా 2022లో 1.05 బిలియన్ టన్నుల ఆహారం వృధా అయింది. అందులో తినదగని పదార్థాలు కూడా ఉన్నాయి. అంటే ఒక్కో వ్యక్తి తలసరి ఆహార వృధా 132 కిలోలుగా ఉంది.
60 శాతం వృధా ఇళ్లలోనే
2022 లో జరిగిన ఆహార వృధాలో సుమారు 60 శాతం గృహాల్లో జరిగింది. రెస్టారెంట్లు, హోటళ్లు వంటి వాటి వల్ల 28 శాతం వృధా కాగా రీటైల్ రంగంలో 12 శాతం ఆహార పదార్థాలు వృధా అయ్యాయి. 2022 లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇళ్లు రోజుకు 1 బిలియన్ భోజనాలను వృధా చేశాయని నివేదిక తెలిపింది. ఇదే సమయంలో 783 మిలియన్ మంది ప్రజలపై ఆకలి తీవ్ర ప్రభావం చూపితే వారిలో మూడో వంతు మందికి ఆహార భద్రత లేకుండా ఉంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఆహార వృధా, ఆహార నష్టం విలువ దాదాపు 1 ట్రిలియన్ డాలర్లుగా అంచనా వేయబడింది.
‘‘ఆహార వృధా అనేది ప్రపంచ విషాదం. ఈరోజు ప్రపంచం ఆహారాన్ని వృధా చేయడం వల్ల లక్షలాది మంది ఆకలితో అలమటిస్తున్నారు. ఇది ఒక ప్రధాన అభివృద్ధి సమస్యే కాదు. ఇలాంటి అనవసర వ్యర్థాలు వాతావరణం, ప్రకృతిపై ప్రతికూల ప్రభావాలను చూపుతాయి. ధరల పెరుగుదలలో కీలక పాత్ర పోషిస్తాయి’’ అని యూఎన్‌ఈపీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇంగర్ ఆండర్సన్ చెప్పారు.
ఇది అన్ని దేశాల సమస్య
ఆహార వృధా అనేది కేవలం ధనిక దేశాల సమస్యే కాదని, అప్పర్-మిడిల్, లోవర్-మిడిల్ ఆదాయం ఉన్న దేశాల్లో కూడా ఆహార వృధా అనేది పెద్ద సమస్యగా ఉందని రిపోర్ట్ వివరించింది. ధనిక, తక్కువ ఆదాయం ఉన్న దేశాల మధ్య ఆహార వృధా విషయంలో పెద్దగా తేడా లేదని, సంపాదనలోనే తేడా ఉందని వెల్లడించింది. అయితే ఉష్ణోగ్రతలు అధికంగా ఉండే దేశాల్లో ఆహార వృధా కూడా అధికంగా ఉందని, తాజా ఆహార పదార్థాలను వినియోగించడం, శీతల వాతావరణం లేకపోవడం ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తున్నట్లు రిపోర్ట్ తెలిపింది. ప్రతి ఏడాది ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యే గ్రీన్‌హౌస్ గ్యాస్‌లో 8-10శాతం ఈ వృధా అయిన ఆహార పదార్థాల నుంచి వెలువడుతుందని నివేదిక వెల్లడించింది.
Read More
Next Story