
న్యాయ వ్యవస్థకు కృత్రిమ మేధస్సు ముప్పు ..
ప్రతి న్యాయ సమాచారాన్ని తప్పనిసరిగా ధృవీకరించుకోవాల్సిన అవసరం ఉందన్న సుప్రీంకోర్టు..
కృత్రిమ మేధస్సు (AI) వాడకం వల్ల భారతదేశంలో న్యాయవ్యవస్థ కొత్త ముప్పును ఎదుర్కొంటోంది. పెరుగుతున్న AI వినియోగం కోర్టు తీర్పులపై ప్రభావం చూపుతోంది. ఒక ట్రయల్ కోర్టు AI ఆధారంగా ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. "లేని తీర్పులను కోర్టులో చూపించడం సాధారణ తప్పు కాదు. అది వృత్తి ప్రమాణాలను దెబ్బతీయడమే". అని పేర్కొంది.
ధృవీకరణ తప్పనిసరి..
ఒక ఆస్తి వివాదం పరిష్కారంలో కోర్టు జోక్యం చేసుకొని ఒక అడ్వకేట్ కమిషనర్‌ను నియమించింది. అయితే ట్రయల్ కోర్టు తన తీర్పును సమర్థించడానికి నాలుగు పాత తీర్పులను ఉదహరించింది. ఏవీ చూపిన నాలుగు తీర్పులకు సంబంధించిన కేసులు కేవలం కల్పితమని తర్వాత బయటపట్టాయి. ఈ నేపథ్యంలో పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ అంశాన్ని లోతుగా పరిశీలించడానికి అటార్నీ జనరల్, సొలిసిటర్ జనరల్, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. ఇదే సమయంలో అత్యున్నత న్యాయస్థానం మరో వ్యాఖ్య కూడా చేసింది. కృత్రిమ మేధస్సు వాడటం తప్పు కాదు, కానీ అందించిన సమాచారాన్ని నేరుగా నమ్మడం ప్రమాదకరమని స్పష్టం చేసింది. ప్రతి న్యాయ సమాచారాన్ని తప్పనిసరిగా ధృవీకరించాల్సిన అవసరం ఉందని పేర్కొంది.
ఇంతకు కేసేమిటి?
ఓ సివిల్ వివాదంలో విజయవాడ కోర్టు ఆదేశాల మేరకు అడ్వకేట్-కమిషనర్ తన నివేదికను సమర్పించారు. ఆ నివేదిక పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటిషనర్లు గుమ్మడి ఉషారాణి, సునీత అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన విజయవాడ కోర్టు న్యాయాధికారి..అడ్వకేట్ కమిషనర్ నివేదిక సాక్ష్యం మాత్రమేనని, దానిపై అభ్యంతరం ఉంటే ట్రయల్ సందర్భంగా క్రాస్ ఎగ్జామినేషన్‌లో తేల్చుకోవాలని తెలిపారు. అనుబంధ పిటిషన్‌ను కొట్టివేస్తూ గత ఏడాది ఆగస్టు 19న ఉత్తర్వులు ఇచ్చారు. ఈ సందర్భంగా నాలుగు తీర్పులను తన ఉత్తర్వుల్లో న్యాయాధికారి ఉదహరించారు. దిగువ కోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ పిటిషనర్లు హైకోర్టులో సివిల్ రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా పిటిషనర్ ఉషారాణి తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ...దిగువ కోర్టు న్యాయాధికారి ఇచ్చిన ఉత్తర్వుల్లో ప్రస్తావించిన నాలుగు తీర్పులు ఉనికిలోనే లేవన్నారు. ఆ ఉత్తర్వులను రద్దు చేయాలని అభ్యర్ధించారు. ఈ వివరాలు పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు, న్యాయాధికారి నుండి నివేదిక కోరారు. న్యాయాధికారి నివేదిక సమర్పిస్తూ.. మొదటిసారి ఏఐ సాధనాన్ని వినియోగించానని, అది చూపిన తీర్పులు సరైనవేనని నమ్మి, వాటిని తన ఉత్తర్వుల్లో ఉదహరించానని , భవిష్యత్తులో జాగ్రత్తగా ఉంటానని తెలిపారు. ఆ నివేదికను పరిశీలించిన హైకోర్టు.. ప్రస్తుత కేసుకు న్యాయాధికారి సరైన న్యాయసూత్రాలనే అన్వయింపజేశారని తెలిపారు. ఉత్తర్వుల్లో చట్టపరమైన లోపాలు లేనందున దిగువ కోర్టు తీర్పులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. సివిల్ రివిజన్ పిటిషన్‌ను కొట్టివేశారు. ఏఐ సాధనాలు వినియోగం విషయంలో అత్యంత జాగ్రత్తగా, అప్రమత్తతతో వ్యవహారించాలని దిగువకోర్టులకు ఈ సందర్భంగా హైకోర్టు సూచించింది.

