
తెలంగాణ చేనేత ఖ్యాతిని ప్రపంచానికి చాటుదాం
ప్రఖ్యాత చేనేత డిజైనర్, జాతీయ అవార్డు గ్రహీత కొలను రవీందర్ అంతర్జాతీయ చేనేత దినం సాధన కోసం బాలి లో జరుగుతున్న సదస్సుకు మద్దతు తెలిపారు
తెలంగాణ చేనేత ఖ్యాతిని ప్రపంచానికి చాటుదామని చేనేత డిజైనర్, జాతీయ అవార్డు గ్రహీత కొలను రవీందర్ అన్నారు. ఇక్కత్ పుట్టినిల్లయిన ఇండోనేషియా లోని బాలిలో జరిగే వరల్డ్ వీవర్స్ కాన్ఫరెన్స్ లో తాను పాల్గొంటున్నానని, చేనేత అభిమానులు కూడా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ఆయన పిలుపునిచ్చారు. డబుల్ ఇక త్ చీరెలను న్యాచురల్ రంగులతో రూపొందించిందుకు 2018లో ఆయనకు జాతీయ పురస్కారం లభించింది.
వెంకన్న నేత
ప్రతి సంవత్సరం ఆగస్టు 7 న జరిగే జాతీయ చేనేత దినోత్సవ స్ఫూర్తితో ప్రపంచ చేనేత దినోత్సవం కూడా జరిపేందుకు అంతర్జాతీయ మద్దతు కోసం ఇపుడు కృషి జరుగుతూ ఉంది. జాతీయ చేనేత దినోత్సవం ప్రకటన 2015 జూన్ లో వెలువడటం వెనక వెంకన్న నేత కృషిని ఆయన ప్రశంసించారు. భారతదేశంలో 2015 ఆగస్టు 7 నుంచి జాతీయ చేనేత దినోత్సవం జరుగుతూ ఉంది. ఇదే విధంగా అంతర్జాతీయ చేనేత దినోత్సవ సాధనకై జరుగుతున్న బాలి కాన్ఫరెన్స్ లో అందరి మద్దతు కూటగట్టడంలో కాన్ఫరెన్స్ నిర్వాహకులు వెంకన్న నేత సఫలీకృతం కాగలనరనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.
ఇక్కత్ పరిశ్రమలో పుట్టపాక గ్రామ విశిష్టతను ఆయన తెలియజేశారు.
భారతీయ ఇకత్ చేనేత కళ వర్ధిల్లిన రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా ఇకత్ ఉత్పత్తికి శాశ్వత కేంద్రంగా ఉంది. జిల్లాలోని పోచంపల్లి, పుట్టపాక, చౌటుప్పల్ ప్రాంతాల్లో ఇకత్ చేనేత జోరుగా కొనసాగుతోంది. ఈ విశిష్ట చేనేత కళను ఆయువు పట్టు పుట్టపాక పద్మశాలీలు. పుట్టపాక చీరలు పోచంపల్లి చీరలుగా విక్రయించబడుతున్నాయి.
పుట్టపాక డబల్ ఇకత్ చీరె (ఫేస్ బుక్ నుంచి)
ఈ కళ దాదాపు 200 సంవత్సరాలకు పైగా ఇక్కడ ప్రాచుర్యంలో ఉంది. ఇకత్ అనేది శ్రమతో కూడుకున్న కళ. డబుల్ ఇకత్ దాని బలం. ఇక్కడి తయారయ్యే డబల్ ఇకత్ చీరెలు విదేశాలకు బాగా ఎగుమతి అవుతుంటాయి. ఈ గ్రామానికి జిఎ (జియోగ్రాఫికల్ ఐడెంటిటి) కూడా లభించింది. ఈ మధ్య జరగిని G.20 దేశాల సమావేశంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ పుట్టపాక లో తయారయిన చీరెలను ఫ్రెంచ్ ప్రధానికి బహూకరించడం జరిగింది. అంతర్జాతీయ చేనేత దినోత్సవం సాధిస్తే, ఆ ఖ్యాతి వెంకన్న నేతకే కాదు, తెలంగాణకు , భారత్ కు దక్కుతుందని, అదే విధంగా తెలంగాణ చేనేత వస్త్ర వ్యాపారం విస్తృతికి దోహదపడుతుందని ఆయన అన్నారు.
బాలిలో సదస్సు ఎందుకు?
ఇకత్ కళ కు పుట్టినిల్లు ఇండోనేషియా అక్కడి నుంచే ఇతర ప్రపంచదేశాలకు 18 వ శతాబ్దంలో వలసపాలకు వల్ల విస్తరించిందని చెబుతారు.
చాలా మంది వస్త్ర నిపుణులు ఈ కళ ప్రధానంగా ఇండోనేషియా లోనే కనపించినా కంబోడియా, మయన్మార్, ఫిలిప్పీన్స్ , థాయ్‌లాండ్ వంటి ఇతర ఆగ్నేయాసియా దేశాలలో చేనేత కళాకారులకు కూడా తెలుసు. వారు ఇకత్ నేత శైలిని అభివృద్ధి చేసిన సుదీర్ఘ చరిత్ర వారిది. అయితే, ప్రతి దేశానికి అదొక సొంత కళారూపంగా మారింది. ఇండోనేషియాని ఆపైన సెంట్రల్ అమెరికాలోని దేశాలను అక్రమించి పాలించిన డచ్ వలస దారుల వల్ల ఇకత్ ఒక వస్త్ర-కళగా అర్జెంటీనా, బొలీవియా, మెక్సికో మరియు గ్వాటెమాల వంటి దేశాలకు ప్రయాణించింది. ఈక్రమంలోనే అది భారత్ లోకి ప్రవేశించింది. తెలంగాణ కూడా ప్రవేశించి ఒక స్వతంత్ర ఇకత్ కళగా రూపొందింది.
ప్రపంచ చేనేత దినోత్సం కోసం బాలి లో జరుగుతున్న ఈ కార్యక్రమం కూడా ఈ సుదీర్ఘ అంతర్జాతీయ చేనేత బంధాన్నిపటిష్టం చేసుకోవడానికే.
మరొక విశేషం
ఇండోనేషియాలోని బాలిలో జరగనున్న వరల్డ్ వీవర్స్ కాన్ఫరెన్స్ కోసం ముఖ్యమైన భాగస్వామిగా చేతులు కలిపేందుకు Saree Connecxions అంగీకరించింది. ఇందులో భాగంగా Saree Connecxions వరల్డ్ వీవర్స్ కాన్ఫరెన్స్ బృందానికి 22 ఫిబ్రవరి, 2024న సింగపూర్‌లో ఆతిథ్యం ఇవ్వనుంది. దీనికోసం ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తుంది. ఈ సహకారం ఈ కాన్ఫరెన్స్ అంతర్జాతీయ హోదాని ఇంకా మెరుగుపరుస్తుందని వెంకన్న ఆశాభావం వ్యక్తం చేశారు.

