ఇండోర్: ‘‘కలుషిత నీటితో 22 మంది మరణించారు’’
x

ఇండోర్: ‘‘కలుషిత నీటితో 22 మంది మరణించారు’’

మధ్యప్రదేశ్ సభలో అంగీకరించిన బీజేపీ సర్కార్


Click the Play button to hear this message in audio format

ఇండోర్‌లో కలుషిత నీరు తాగి 22 మంది మరణించారని మధ్యప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా అంగీకరించింది. అయితే రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం గత నెలలో మధ్యప్రదేశ్ హైకోర్టుకు సమర్పించిన "డెత్ ఆడిట్" నివేదికలో ఈ సంఖ్యను తక్కువగా చేసి చూపించింది. ఇండోర్‌లోని భగీరత్‌పుర ప్రాంతంలో కలుషిత నీటిని తాగడం వల్ల వాంతులు, విరేచనాలు వ్యాపించి 2025 డిసెంబర్‌లో 16 మంది మరణించారని పేర్కొంది.

అసెంబ్లీ లో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు ఆరోగ్య మంత్రి రాజేంద్ర శుక్లా సమాధానమిచ్చారు. నీటి కాలుష్యం కారణంగా ఇండోర్‌లో 22 మంది మరణించారని అంగీకరించారు. "డిసెంబర్ 21, 2025 నుంచి తీవ్రమైన విరేచనాల కారణంగా మొత్తం 22 మంది మరణాలు అధికారికంగా నిర్ధారించబడ్డాయి" అని ఆయన అన్నారు.
మృతుల బంధువులకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల పరిహారం చెల్లించామని శుక్లా తెలిపారు. నీటి కాలుష్యం ఘటనలో మొత్తం 459 మంది ఆసుపత్రి పాలయ్యారని, వారిలో కొందరు ఇప్పటికీ చికిత్స పొందుతున్నారని ఆయన అసెంబ్లీకి తెలిపారు.

'రాజకీయాలకు అతీతమైనది'

సభలో ఉన్న ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, ఈ విషయం రాజకీయాలకు అతీతమని, దీనిలో ఎటువంటి వ్యతిరేకత ఉండకూడదని అన్నారు.
"ఈ కేసులో దోషిగా తేలిన సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ అధికారిని సస్పెండ్ చేశారు. పరిహారం విషయానికొస్తే, ప్రభుత్వం వెనక్కి తగ్గదు. ఇప్పుడు చెల్లించిన రూ. 2 లక్షలను రూ.4 లక్షలు లేదా రూ.5 లక్షలకు కూడా పెంచవచ్చు" అని ఆయన అన్నారు.

మంత్రులు రాజీనామా చేయాల్సిందే: కాంగ్రెస్

అయితే కాంగ్రెస్ వీటిని తీవ్రంగా ఖండించింది. ఇండోర్ నీటి కాలుష్యంలో 35 మంది మరణించారని ఆరోపించింది. గురువారం.. ప్రశ్నోత్తరాల సమయంలో సభ కొంతసేపు సజావుగా సాగింది. అయితే, ఇండోర్‌లో నీటి ద్వారా వ్యాపించే వ్యాధుల కారణంగా మరణాల అంశం తలెత్తిన వెంటనే, ఇద్దరు మంత్రులు, ఇండోర్ మేయర్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.

'నైతిక కారణాల వల్ల మంత్రులు రాజీనామా చేయాలి'

ప్రతిపక్ష నాయకుడు ఉమాంగ్ సింఘర్ ఈ సంఘటనను వ్యవస్థ వైఫల్యంగా అభివర్ణించారు. పట్టణాభివృద్ధి మంత్రి కైలాష్ విజయ్‌వర్గియా, ఆరోగ్య మంత్రి రాజేంద్ర శుక్లా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కలుషిత నీటి కారణంగా 35 మంది మరణించగా, బాధ్యతాయుతమైన మంత్రులు సభలో కూర్చున్నారని ఆయన పేర్కొన్నారు. "ఈ మంత్రులు నైతిక కారణాల వల్ల రాజీనామా చేయాలి" అని సింఘర్ అన్నారు.

పరిహారం పెంచాలి

మృతులకు ఇచ్చిన ఒక్కొక్కరికి రూ. 2 లక్షల పరిహారం సరిపోదని పేర్కొంది. ఆ మొత్తాన్ని కనీసం రూ. 4 లక్షలకు పెంచాలని డిమాండ్ చేసింది. కాంగ్రెస్ సభ్యులు గందరగోళం సృష్టించడం ప్రారంభించారు. మంత్రుల రాజీనామాలను డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. గందరగోళం కారణంగా, స్పీకర్ నరేంద్ర సింగ్ తోమర్ సభను రెండుసార్లు వాయిదా వేయాల్సి వచ్చింది. ఎంపీ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రస్తుతం జరుగుతున్నాయి.
Read More
Next Story