
‘పరిశ్రమలను ఔటర్ కు తరలించాల్సిందే’
1970ల్లో పరిశ్రమలకు భూములు కేటాయించినపుడు ఆ ప్రాంతాలన్నీ నగర శివార్లుగా గుర్తుచేశారు.
కాలుష్యకారక పరిశ్రమలను ఔటర్ రింగ్ రోడ్డు బయటకు తరలించాల్సిందే అని పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు స్పష్టంచేశారు. మంగళవారం అసెంబ్లీలో హిల్ట్(HILT) పాలసీపై జరిగిన చర్చలో మంత్రి మాట్లాడుతు కాలుష్యకారక పరిశ్రమలు ప్రజల ఆరోగ్యానికి ఇబ్బందిగా మారాయన్నారు. ఫ్యాక్టరీ గోడల పక్కనే ఇళ్ళుండటాన్ని సైంటిఫిక్ డిజాస్టర్ గా పేర్కొన్నారు. 1970ల్లో పరిశ్రమలకు భూములు కేటాయించినపుడు ఆ ప్రాంతాలన్నీ నగర శివార్లుగా గుర్తుచేశారు. అలాంటివి అప్పటి పరిశ్రమల చుట్టూ తర్వాత రెసిడెన్షియల్ కాలనీలు ఏర్పడటంతో సమస్యలు మొదలైనట్లు మంత్రి చెప్పారు. బాలానరగ్, సనత్ నగర్, ఉప్పల్ లాంటి ప్రాంతాల్లోని పరిశ్రమలను, రెసిడెన్షియల్ లొకేషన్లను ఉదాహరణగా మంత్రి చెప్పారు.
హిల్ట్ పాలసీ గురించి వివరిస్తు పారిశ్రామికవేత్తల భూములను ప్రభుత్వ భూములుగా కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నట్లు మంత్రి మండిపడ్డారు. పారిశ్రామికవేత్తల దగ్గరున్న భూములన్నీ గత ప్రభుత్వాలు కేటాయించినవే అని తెలిపారు. ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ప్రజలకు అందించంటంతో పాటు పర్యావరణాన్ని బాగుచేసే ఆలోచనతోనే తమ ప్రభుత్వం హిల్ట్ పాలసీని అమల్లోకి తెస్తున్నట్లు చెప్పారు.
పాలసీలో భాగంగా పారిశ్రామికవేత్తలకు ఆరుమాసాలు గడువిస్తున్నట్లు మంత్రి చెప్పారు. స్వచ్ఛందంగా ముందుకు వస్తేనే వారి భూములను కన్వర్ట్ చేస్తామని ప్రకటించారు. పాలసీల గురించి అవగాహన లేకుండా కొందరు దురుద్దేశ్యంతో కావాలనే ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నట్లు మంత్రి ఆరోపించారు. దశాబ్దాల క్రితమే భూములను ప్రభుత్వాలు పరిశ్రమలకు అమ్మేసినట్లు చెప్పారు. పరిశ్రమలు ఏర్పాటుచేయగా మిగిలిన భూములను, మూతపడిన పరిశ్రమల భూములను ప్రభుత్వ కన్వర్షన్ పాలసీలో తీసుకోవాలని అనుకుంటున్నట్లు వివరించారు. కొందరు కావాలనే రాజకీయం చేస్తు పాలసీపై బురదచల్లేస్తున్నట్లు ఆరోపించారు.
అభివృద్ధి అంటే ప్రకృతిని నాశనంచేయటం కాదు, పిల్లలకు ఇచ్చే ఆస్తులూ కాదన్నారు. క్లాన్ ఎన్విరాన్మెంటే అసలైన వారసత్వంగా మంత్రి వర్ణించారు. కలుషితమైన వాతావరణం కారణంగా బంగారుపళ్ళంలో విషం తినిపించినట్లుగా తయారవుతుందన్నారు. ప్రకృతి నాశనమైతే తిరిగి రాదన్నారు. క్లీన్ ఎన్విరాన్మెంట్ ఇవ్వటాన్ని తమ ప్రభుత్వ బాధ్యతగా భావించిందని మంత్రి తెలిపారు. ఆరోగ్యకరమైన భవిష్యత్తును అందించాలనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం హిల్ట్ పాలసీని తీసుకువస్తున్నట్లు స్పష్టంచేశారు.

