రేవంత్ భాష పై పెరిగిపోతున్న వ్యతిరేకత
x
Revanth Reddy

రేవంత్ భాష పై పెరిగిపోతున్న వ్యతిరేకత

ఉద్యమకారుల్లో కసిని రగల్చటానికి కేసీఆర్ ప్రతిరోజు పదేపదే ఆంధ్రోళ్ళు అంటు నోటికొచ్చినట్లుగా మాట్లాడేవారు


తెలంగాణ రాజకీయాల్లో తిట్లభాష రాజ్యమేలుతోంది. విధానపరమైన అంశాలపై పద్దతిగా ఆరోపణలు, విమర్శలు చేయటం ఎప్పుడో పోయింది. తాజాగా కేసీఆర్ ను ఉద్దేశించి ముఖ్యమంత్రి (Revanth)ఎనుముల రేవంత్ రెడ్డి ఉపయోగించిన భాషపై అన్నీ వర్గాల నుండి తీవ్ర వ్యతిరేకత కనబడుతోంది. నిజానికి ఇలాంటి భాషకు ఆధ్యుడు కేసీఆర్ అనేచెప్పాలి. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఆంధ్రోళ్ళు అనేపదాన్ని (KCR)కేసీఆర్ కాయిన్ చేశారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ఊపుతేవటానికి లేదా ఉద్యమకారుల్లో కసిని రగల్చటానికి కేసీఆర్ ప్రతిరోజు పదేపదే ఆంధ్రోళ్ళు అంటు నోటికొచ్చినట్లుగా మాట్లాడేవారు. చాలా అసహ్యమైన తిట్లు తిట్టేవారు. తెలంగాణ ఉద్యమం నడిచినపుడే కాదు ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అదేపద్దతిని ఉపయోగించేవారు. తన ప్రత్యర్ధులపైన ఆరోపణలు, విమర్శలు చేసేటప్పుడు కూడా అదే భాషను ఉపయోగించేవారు.

ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి కేసీఆర్ ఏమి మాట్లాడినా చెల్లిపోయింది. అటు సీమాంధ్ర నేతలతో పాటు ఇటు తెలంగాణలో తనప్రత్యర్ధులపైన కేసీఆర్ చాలాసార్లు అభ్యంతరకరంగానే మాట్లాడేవారు. అలాంటిది ఇపుడు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత అలాంటి భాషనే తనమీద ఉపయోగిస్తుండటాన్ని తట్టుకోలేకపోతున్నారు. ముఖ్యమంత్రి అయినదగ్గర నుండి రేవంత్ చాలాసార్లు కేసీఆర్ పైన విరుచుకుపడుతున్న విషయం చూస్తున్నదే. ఆ సమయంలో కేసీఆర్ పైన రేవంత్ రెడ్డి కూడా అదేస్ధాయిలో నోటికొచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. కేసీఆర్ పైన రేవంత్ అభ్యంతరకరమైన భాషను ఉపయోగించటంపై పార్టీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీమంత్రి తన్నీరు హరీష్ రావు తదితరులు తీవ్రస్ధాయిలో అభ్యంతరాలు వ్యక్తంచేస్తున్నారు.

రేవంత్ భాషపై మండిపడుతున్న కేటీఆర్, హరీష్ తదితరులు గతంలో కేసీఆర్ కూడా ప్రత్యర్ధులపై ఇలాంటి భాషనే ఉపయోగించినపుడు నోరెత్తలేదు. అధికారంలో ఉన్నపుడు వాళ్ళ వ్యవహరాశైలి ఎలాగుండేది అంటే శాశ్వతంగా బీఆర్ఎస్సే అధికారంలో ఉంటుంది అన్నట్లుగా మాట్లాడేవారు. 2023 ఎన్నికల్లో పార్టీ ఓడిపోతుందని కాని, రేవంత్ సీఎం అవుతారని కాని, కేసీఆర్ తో పాటు తమపైన తమ భాషలోనే విరుచుకుపడతారని కాని అప్పట్లో కారుపార్టీ నేతలు ఎవరూ ఊహించలేదు. అందుకనే ఇపుడు రేవంత్ భాషను భరించలేకపోతున్నారు.

ఉద్యమసమయంలో ఉద్యమకారులను ఉత్తేజపరచటం కోసమే తాను అలాంటి భాషను ఉపయోగించినట్లు కేసీఆరే స్వయంగా ఎన్నోసార్లు అంగీకరించారు. తన అవసరంకోసం కేసీఆర్ ప్రత్యర్ధులను నోటికొచ్చినట్లు తిట్టడం తప్పుకాదుకాని ఇపుడు అదే భాషను కేసీఆర్ పైన రేవంత్ ప్రయోగించటమే వీళ్ళకు తప్పుగా కనబడుతోంది.

ఏదేమైనా ఒకళ్ళని మరొకళ్ళు నోటికొచ్చినట్లు తిట్టడాన్ని, వ్యక్తిత్వాన్ని కించపరచటాన్ని జనాలు ఏమాత్రం హర్షించరన్న విషయం అందరికీ తెలిసిందే. విధానపరమైన ఆరోపణలు, విమర్శల స్ధాయి దాటిపోయి వ్యక్తులను కించపరచటం ఎక్కువైపోతోంది. ఇదే విషయమై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ మాట్లాడుతు కేసీఆర్ పైన రేవంత్ మాట్లాడిన భాష సరికాదన్నారు. మనం మాట్లాడే భాష ఎదుటి వ్యక్తులను కించపరిచేట్లుగా ఉండకూడదని అభిప్రాయపడ్డారు. తనభాషపైన రేవంత్ ఒకసారి పునరాలోచించుకోవాలి అని సలహా ఇచ్చారు. రేవంత్ ఉపయోగిస్తున్న భాషతో తనకే నష్టం జరుగుతుందని సూచించారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ముఖ్యమంత్రిగా రేవంత్ ఉండటాన్ని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు తట్టుకోలేకపోతున్నది వాస్తవం. ఆ విషయాన్ని రేవంత్ పైన ఆరోపణలు, విమర్శలు చేసేటపుడు కేటీఆర్ తదితరులు బాహాటంగానే ప్రదర్శిస్తున్నారు. రేవంత్ ను పట్టుకుని పొట్టోడని, మూడడుగులోడని, అదని..ఇదని కేటీఆర్ కించపరిచేట్లుగా మాట్లాడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అందుకనే తెలంగాణ రాజకీయాల్లో ఆరోపణలు, విమర్శల్లో సంస్కారయుతమైన భాష ఎప్పుడో దారితప్పింది.

Read More
Next Story