కాంగ్రెస్ ను ఒంటరి చేయడానికి బీజేపీ రాజ్యాంగ చర్చను వాడుకుంటోందా?
ఇందిరాగాంధీ రాజ్యాంగాన్ని రద్దు చేసిందని పదే పదే ప్రస్తావించిన ఎన్డీఏ
గత కొంత కాలంగా భారతీయ జనతా పార్టీ లక్ష్యంగా ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తూనే ఉన్నాయి. అధికారంలో ఉండి రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, లేదా మారుస్తారని, లేదా రిజర్వేషన్లు తీసివేస్తారని సార్వత్రిక ఎన్నికల్లో విపరీతంగా ప్రచారం చేసి లబ్ది కూడా పొందారు. తాజాగా పార్లమెంట్ లో రాజ్యాంగంపై ప్రత్యేక చర్చ జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి మిగిలిన ఎన్డీఏ కూటమి సభ్యులు కలిసి వచ్చారు.
దేశంలో ఎమర్జెన్సీ విధించింది ఇందిరాగాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ అని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆరోపించారు. ఈ ఆరోపణలపై అధికార ప్రతిపక్షాలు మాటల తూటాలు పేల్చుకున్నాయి.
'భారత రాజ్యాంగం 75 ఏళ్ల గ్లోరియస్ జర్నీ' అనే అంశంపై రెండు రోజుల చర్చాగోష్టిలో తొలిరోజు రాజ్‌నాథ్ శుక్రవారం (డిసెంబర్ 13) బిజెపి కోసం చర్చను ప్రారంభించి, కాంగ్రెస్‌పై మాటల దాడి చేశారు. గత కొన్నేళ్లుగా, ఒక రాజకీయ పార్టీ రాజ్యాంగ రూపకల్పనలో తన ప్రత్యక్ష ప్రమేయం ఉన్నట్లు వ్యవహరిస్తోందని తూర్పార బట్టారు.
“ భారత రాజ్యాంగం ఏదైనా ఒక నిర్దిష్ట రాజకీయ పార్టీ సహకారం కాదు, ఇది దేశం విలువలను సూచించే అసమానమైన, పరివర్తనాత్మక పత్రం. రాజ్యాంగాన్ని రూపొందించే ప్రక్రియను హైజాక్ చేయడానికి ఎల్లప్పుడూ ఓ పార్టీ ప్రయత్నిస్తోంది.
రాజ్యాంగ నిర్మాణంలో అనేక మంది నాయకుల సహకారాన్ని విస్మరించే ప్రయత్నం జరుగుతోంది. గత కొన్నేళ్లుగా ఉద్దేశపూర్వకంగా ఒక రాజకీయ పార్టీ మాత్రమే రాజ్యాంగ నిర్మాణంలో దోహదపడిందనే అభిప్రాయాన్ని ప్రజల్లో కలగజేయడానికి ప్రయత్నిస్తోంది” అని రాజ్‌నాథ్ అన్నారు.
UCCని అమలు చేస్తారా?
దేశంలో త్వరలో యూసీసీ అమలు చేస్తామని కూడా కమలదళం ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. కాంగ్రెస్ నిరంతరం రాజ్యాంగాన్ని మార్చడానికి ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు. దేశంలో యూనిఫాం సివిల్ కోడ్ అమలుపై ప్రతిపక్షాలు పార్టీలు తమ వైఖరిని స్పష్టం చేయాలని బీజేపీ సీనియర్ నాయకుడు జగదాంబిక పాల్ అన్నారు.
'ఒకే దేశం, ఒకే ఎన్నికలు' అమలుకు పార్లమెంటులో బిల్లు తీసుకురావాలని కేంద్రం యోచిస్తున్న తరుణంలో UCC అమలు కోసం డిమాండ్ ను బీజేపీ వ్యూహాత్మకంగా లేవనెత్తింది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల చివరి వారంలో బిల్లును తీసుకురావాలని బీజేపీ-ఎన్డీయే యోచిస్తోంది. అయోధ్యలో రామ మందిర నిర్మాణం, జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370ని తొలగించిన తర్వాత, UCC, 'వన్ నేషన్, వన్ ఎలక్షన్' అనే రెండు కీలక అంశాలు మాత్రమే బీజేపీ ఎజెండాలో ఉన్నాయి.
కాంగ్రెస్‌ను ఒంటరి చేసే ప్రయత్నం..
రెండు రోజుల చర్చలో బీజేపీ-ఎన్డీయే వ్యూహం ఆసక్తికరంగా కనిపించింది. అధికార కూటమి కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీల మధ్య చీలికను సృష్టించడానికి స్పష్టంగా ప్రయత్నించింది. బీజేపీ, ఎన్డీఏ కూటమిలో మాట్లాడిన ప్రతి ఒక్కరూ కూడా కాంగ్రెస్ కూటమిలో నుంచి మిగిలిన పక్షాలను దూరం చేయడానికి ప్రయత్నాలు చేశారు.
కాంగ్రెస్ రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేసిందని ఆరోపిస్తూనే, ఉపాధ్యక్షుడు, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధంఖర్‌పై తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రధాన ప్రతిపక్ష పార్టీ రాజ్యాంగాన్ని అణగదొక్కడం కొనసాగించిందని బిజెపి నాయకత్వం పేర్కొంది. “దేశంలో ఎమర్జెన్సీ విధించి రాజ్యాంగాన్ని ధ్వంసం చేసింది కాంగ్రెస్సే. రాష్ట్ర ప్రభుత్వాలను గద్దె దించే కుట్రలు పన్ని అమలు చేసింది కూడా హస్తం పార్టీనే.
కాంగ్రెస్ పార్టీ ఎమర్జెన్సీ సమయంలో పలువురు నేతలను అరెస్టు చేసి జైల్లో పెట్టి ప్రజాస్వామ్య విలువలను కాలరాసింది. ఇప్పుడు కూడా కాంగ్రెస్ రాజ్యాంగబద్ధమైన పదవి అయిన ఉపరాష్ట్రపతిపై దాడి చేస్తోంది. రాజ్యాంగాన్ని పదేపదే బెదిరిస్తున్న కాంగ్రెస్ పార్టీయే దేశానికి క్షమాపణ చెప్పాలి” అని బీజేపీ సీనియర్ నాయకుడు, పార్లమెంటేరియన్ లహర్ సింగ్ సిరోయా ఫెడరల్‌తో అన్నారు.
రాజ్యాంగాన్ని అణగదొక్కారని ఆరోపిస్తున్న కాంగ్రెస్ నుంచి బీజేపీ నిరంతర ఒత్తిడిని ఎదుర్కొంటోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బిజెపిపై కాంగ్రెస్ నిరంతర దాడి ఫలితంగా లోక్‌సభ ఎన్నికలలో బిజెపి ఎన్నికల పనితీరుపై ప్రభావం పడింది. దశాబ్దంలో మొదటిసారిగా బిజెపి మెజారిటీని పొందలేకపోయింది.
“ ప్రతిపక్ష పార్టీలు రాజ్యాంగాన్ని తమ ప్రచారానికి సంబంధించిన ప్రధాన అంశాలలో ఒకటిగా చేయడం వల్ల 2024 సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి ఎన్నికల్లో నష్టపోయిందని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. రాజ్యాంగంలోని కొన్ని అంశాలు అట్టడుగు వర్గాల్లో ఉన్న వారికి అనుకూలంగా ఉన్నాయి.
వాటిని అణగదొక్కడానికి కమల దళం ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ నిందలు వేస్తోంది. ఇది సార్వత్రిక ఎన్నికల్లో తమకు నష్టపరచిందని బీజేపీ భావిస్తోంది. కాబట్టి తామే రాజ్యాంగాన్ని సక్రమంగా అమలు చేస్తున్నామనే భావన ప్రజల్లో కలిగించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది’’ అని పంజాబ్ విశ్వవిద్యాలయంలో పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ అశుతోష్ కుమార్ ది ఫెడరల్‌తో అన్నారు.
Next Story