భవానీ రేవణ్ణ పొలిటికల్ ఎంట్రీ ముగిసినట్లేనా?
x

భవానీ రేవణ్ణ పొలిటికల్ ఎంట్రీ ముగిసినట్లేనా?

మాజీ ప్రధాని దేవేగౌడ పెద్ద కోడలు భవాని రేవణ్ణ రాజకీయాల్లోకి రావాలనుకున్నారా? ప్రజ్వల్ సెక్స్ స్కాండిల్ వ్యవహారం ఆమె పొలిటికల్ ఎంట్రీకి అడ్డంకిగా మారుతుందా?


కర్ణాటకలో రోజురోజుకు చోటుచేసుకుంటున్న నాటకీయ పరిణామాలు హెచ్‌డి దేవెగౌడ పెద్ద కోడలు భవాని రాజకీయ జీవితానికి ముగింపు పలుకుతాయన్న సందేహం కలుగుతోంది.
జెడి(ఎస్) ఎమ్మెల్యే హెచ్‌డి రేవణ్ణ ఇప్పటికే జైలులో ఉన్నారు. ఆయన కుమారుడు, హసన్ ఎంపి ప్రజ్వల్ పరారీలో ఉన్నాడు. అత్యాచార బాధితురాలిని కిడ్నాప్ చేసిన కేసులో రేవణ్ణ భార్య భవానిని కూడా పోలీసులు విచారించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కొందరు జనతాదళ్ (సెక్యులర్) నాయకులు భవానీ రాజకీయ ప్రవేశంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
హెచ్‌డి దేవెగౌడ కుటుంబంలో విభేదాలొచ్చాయా?
హెచ్‌డి దేవెగౌడ కుటుంబానికి చెందిన పలువురు రాజకీయాలలో ఉన్నా.. సోదరులు హెచ్‌డి రేవణ్ణ, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డి కుమారస్వామి పార్టీలో రెండు వర్గాలకు విడిపోయినట్లు స్పష్టమవుతోంది.
హెచ్‌డి రేవణ్ణ కేవలం హసన్ నియోజకవర్గంపైనే దృష్టి సారిస్తే.. ఆయన సోదరుడు హెచ్‌డి కుమారస్వామి జాతీయ రాజకీయాలపై దృష్టి సారించారు.
భవాని మనస్తాపానికి కారణమేంటి?
మైసూరు జిల్లాలోని కేఆర్ నగర్‌కు చెందిన భవానీ రాజకీయాల్లోకి రావాలని ఆశపడ్డారు. కాని ఆమె కల నెరవేరలేదు. అయితే హెచ్‌డీ కుమారస్వామి భార్య అనిత ఎమ్మెల్యే కాగలిగారు. దాంతో భవానీ తీవ్ర మనస్తాపానికి గురైనట్లు సమాచారం. తన భర్త హెచ్‌డి రేవణ్ణ జెడి (ఎస్) సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నా, ఆయనను ముఖ్యమంత్రి పదవికి ఎప్పుడూ పరిగణనలోకి తీసుకోలేదని బాధపడ్డారట.
తన భర్త రేవణ్ణ, కుమారులు సూరజ్, ప్రజ్వల్‌లకు ముఖ్యమైన పదవులు దక్కాలని భవాని కోరుకునేదని పార్టీ నాయకుడొకరు ఫెడరల్‌కు చెప్పారు.
2019 పార్లమెంటు ఎన్నికల్లో కుమారస్వామి కుమారుడు నిఖిల్‌ను మాండ్యా నుంచి లోక్‌సభ అభ్యర్థిగా ఎంపిక చేయడంతో రెండు కుటుంబాల మధ్య విభేదాలు స్పష్టంగా కనిపించాయి.
మనవడి కోసం త్యాగం..
తన కుమారుడు ప్రజ్వల్‌ను కూడా ఎంపీని చేయాలని తన భర్త రేవణ్ణపై భవాని ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. దాంతో దేవెగౌడ తన సొంత గడ్డ హాసన్ లోక్‌సభ స్థానాన్ని మనవడు ప్రజ్వల్‌కు త్యాగం చేసి, తాను తుమకూరు నుంచి పోటీ చేశారు. హాసన్ నుంచి ప్రజ్వల్ గెలుపొందగా, తుమకూరులో దేవెగౌడ ఓడిపోయారు.
2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో దేవెగౌడ ఇద్దరు కుమారుల మధ్య విభేదాలు మరింత ముదిరాయి.
జేడీ(ఎస్)లో కుమారస్వామి కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వడంపై భవానీ ఆందోళన వ్యక్తం చేశారు. హసన్ అసెంబ్లీ జేడీ(ఎస్) టిక్కెట్టు తనకు ఇప్పించాలని భవానీ తన భర్త ద్వారా దేవెగౌడపై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. అయితే ఆ సీటును కుమారస్వామి సన్నిహితుడైన స్వరూప్‌ హెచ్‌ఎస్‌ ప్రకాష్‌కు కేటాయించారు. దీనిపై దేవెగౌడ ముందు రేవణ్ణ కుటుంబానికి, కుమారస్వామికి మధ్య వాడివేడిగా చర్చలు జరిగాయని జెడి(ఎస్) మాజీ మంత్రి ఒకరు ‘ది ఫెడరల్’తో అన్నారు. భవానీ చిన్న కుమారుడు సూరజ్ రేవణ్ణను కర్ణాటకలోని ఎగువ సభ అయిన శాసన మండలిలో సభ్యుడిగా నియమించి భవాని కోపాన్ని తగ్గించినట్లు సమాచారం.
రాజకీయాలపై పట్టు సాధించాలకున్న భవానీ మొదట జిల్లా పంచాయతీ సభ్యురాలు అయ్యారు. "ఆమె హాసన్ రాజకీయాలతో పాటు JD (S) పై గట్టి పట్టును సాధించాలనుకున్నారు" అని పార్టీ వర్గాలు తెలిపాయి.
సెక్స్ స్కాండల్‌తో ఒక్కిరి బిక్కిరి..
ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ వ్యవహారం దేవేగౌడ కుటుంబాన్ని ఒక్కిరి బిక్కిరి చేస్తుంది. పార్టీకి చెడ్డపేరు రాకుండా చూసుకుంటున్న నేతలు.. రేవణ్ణ కుటుంబాన్ని మాత్రం కాపాడలేకపోతున్నారు.
కుమారస్వామి ఆదుకుంటారా?
తన భర్తను బయటకు తీసుకురావడానికి కుమారస్వామిని భవాని సంప్రదించినట్లు సమాచారం. న్యాయ సహాయం కోసం ఆయనను కలిసినట్లు జెడి(ఎస్) వర్గాలు చెబుతున్నాయి. ఇలాంటి సమయంలో రేవణ్ణకు అండగా నిలవాలని మిగతా కుటుంబ సభ్యులంతా కుమారస్వామిని కోరినట్లు సమాచారం. అయితే తన సోదరుడి కోసం న్యాయవాదులతో మాట్లాడేందుకు అంగీకరించిన కుమారస్వామి.. ప్రజ్వల్‌కు మాత్రం ఏ సాయం చేయకూడదని నిర్ణయించుకున్నారని పార్టీ నాయకుడు ఒకరు ఫెడరల్‌తో చెప్పారు.
భవానిని కూడా ప్రశ్నిస్తారా?
సెక్స్ స్కాండల్ కేసులో భవానీని సాక్షిగా లేదా నిందితురాలిగా ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే బాధితులు ఇచ్చిన వాంగ్మూలంలో ఆమె పేరు ఉన్నట్లు సమాచారం. కిడ్నాప్ కేసులో భవాని ప్రమేయం ఎంతవరకు ఉందన్న దానిపై ఆమెను విచారించనున్నారు. ఈ మేరకు రెండుసార్లు నోటీసులు జారీ చేశారు పోలీసులు.
ఇప్పటికే అరెస్టులు..
లైంగిక వేధింపుల బాధితురాలిని కిడ్నాప్‌ చేసిన కేసులో రేవణ్ణతో పాటు భవానీ బంధువు సతీష్ బాబన్న, హెచ్‌వై సుజయ్‌, మధు, తిమ్మప్ప, మనుని పోలీసులు అరెస్టు చేశారు.
Read More
Next Story